నేటినుంచి వారోత్సవాలు ప్రజల్లో అవగాహనకు ప్రయత్నం
విజయవాడ సిటీ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన అంశంపై ప్రజలు పెద్దగా స్పందించరు. ఎంతోకొంత ముట్టచెప్పి తమ పని పూర్తి చేసుకుంటారు తప్ప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేసి అక్రమార్కుల ఆట కట్టించేందుకు ప్రయత్నించరు. ప్రజల భావనలో మార్పు తెచ్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా డిసెంబర్ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ఇందుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత, అవినీతిని పారదోలాలనే అభిప్రాయం ఉన్న వారిని ఒక చోటకు చేర్చి తమ ఉద్దేశాలను వివరించనున్నారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలతో పాటు అవినీతికి సంబంధించిన అవకాశాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు జరిగే కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు. అన్ని కార్యక్రమాల్లోను ఆరోపణలు లేని స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు.
పోస్టర్ల ప్రచారం: జిల్లాలో అవినీతిపై వ్యతిరేక నినాదాలతో కూడిన పోస్టర్లను విరివిగా ప్రదర్శించనున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో అందరికీ కనిపించే విధంగా వీటిని ఏర్పాటు చేస్తారు. కరపత్రాలు, స్టిక్కర్లను కూడా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల్లో అంటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ లక్ష్యం, నినాదం, ఫోన్ నంబర్లను వీటిలో పొందుపరుస్తున్నారు.
అవినీతి మెండు : ప్రభుత్వ శాఖలో అవినీతి పెరిగిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. చేయి తడపనిదే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయడం అరుదు. తర్వాత తమ పని కాదనే భావన.. కోర్టుల చుట్టూ తిరగాలనే అభిప్రాయంతో ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అన్ని శాఖల్లోనూ అవినీతిపై సమర శంఖం పూరించాలని ఏసీబీ నిర్ణయించింది.
అపోహలు వద్దు
ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులుంటాయనే అపోహ వద్దు. బాధితుల సొమ్ము మా శాఖ నుంచే ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. డీజీపీ అనుమతితో ట్రాప్‌కు అవసరమైన సొమ్ము మేమే సమకూర్చుతాం. కోర్టు ద్వారా ఆ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చేర్చుతాం. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నాం. పని కాదనే భయం కూడా వద్దు. ఆ పని పూర్తి చేసేందుకు మేమే చొరవ తీసుకుంటాం.
- వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, కృష్ణా
అవినీతిపై ఏసీబీ గురి
Published Wed, Dec 3 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement