Eradication of corruption
-
PM Narendra Modi: అవినీతిపరులు ఒక్కటవుతున్నారు
జమూయి/కూచ్‌బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు. గురువారం బిహార్‌లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్‌కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. -
ఆ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలి
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూ లన, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను భారత్ నుంచి తరిమి కొట్టాలని ప్రజలు నినదిస్తున్నారని ప్రధాని∙మోదీ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ దినాన్ని బుధవారం బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా మూడింటిని దేశం నుంచి తరిమి కొట్టాలని ఒకే స్వరం వినిపిస్తోందని ప్రధాని చెప్పారు. ‘అవినీతిని దేశం నుంచి తరిమేయాలి. వారసత్వ రాజకీయాలను, బుజ్జగింపు రాజకీయాలను కూడా తరిమికొట్టాలి’’ అని ప్రధాని బుధవారం ఒక ట్వీట్లో వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు పరిరక్షించాలంటే అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. -
అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి
సాక్షి, అమరావతి: అవినీతి నిర్మూలన విషయంలో రాజీపడే సమస్యే లేదని, అవినీతి ఎక్కడున్నా ఏరివేయాల్సిందేనని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి సంబంధించి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో రూపొందించిన ఇంగ్లిష్, తెలుగు భాషల్లోని వీడియోలను మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. ‘అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి సంకల్పం. ఎవ్వరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి’ అని పీవీ సింధు ఈ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంపై అధికారులు పూర్తి స్థాయిలో ధ్యాస పెట్టాలని సూచించారు. -
దేశానికి దశా దిశా చూపించే బిల్లు
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అవినీతి నిర్మూలన, పారదర్శకతకు పెద్దపీట వేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ముందస్తు న్యాయ పరిశీలనకు రాష్ట్రంలో బీజం వేసినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ బీజం మున్ముందు మహావృక్షం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అవినీతి ముద్రను చెరిపేసేందుకు నడుం బిగించినట్టు ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు–2019’ చరిత్రాత్మకమైన బిల్లు అని అభివర్ణించారు. ఇది దేశానికి దశా దిశా చూపించే బిల్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే.. ప్రజలకు అందుబాటులోకి టెండర్ పత్రాలు ‘‘ఏ టెండర్ తీసుకున్నా, ఏ పని తీసుకున్నా సర్వం కుంభకోణాల మయమే. చివరకు మనం కూర్చున్న ఇదే బిల్డింగ్‌ను తీసుకున్నా కుంభకోణమే కనిపిస్తుంది. ఒక్కో అడుగుకి రూ.10 వేలు ఖర్చు చేసి కట్టిన తాత్కాలిక బిల్డింగ్‌లో మనం కూర్చుని మాట్లాడుతున్నాం. ఏది తీసుకున్నా స్కామ్‌లమయమే కనిపిస్తోంది. ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు ప్రకారం.. ఏ పనైనా రూ.100 కోట్లు, ఆపై విలువ చేసే ఏ టెండరైనా, ఒకే పనిని విభజించినా సరే మొత్తం విలువ రూ.100 కోట్లు, ఆపైన విలువ ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఒక హైకోర్టు జడ్జి వద్దకు పంపిస్తాం. ఈ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ బిల్లు ద్వారా అడుగుతున్నాం. సిట్టింగ్ జడ్జా, రిటైర్డ్ జడ్జా అన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఉంటుంది. వాళ్లు నియమించిన ఆ జడ్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఏ టెండరైనా, పనైనా సరే దాని విలువ రూ.100 కోట్లు దాటితే ఆ టెండర్ పత్రాలను జడ్జికి పంపిస్తాం. జడ్జి వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. ప్రజలందరికీ కనిపించేలా అన్ని మాధ్యమాల్లో– ఇంటర్నెట్, వెబ్సైట్లలో.. ఇలా అన్నిచోట్లా పెడతారు. వారం రోజుల పాటు ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆ టెండర్‌కు సంబంధించి ఫలానా మార్పులు చేయాలని సలహాలు, సూచనలు నేరుగా జడ్జికి ఇవ్వొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. వీటిని జడ్జి స్వీకరిస్తారు. ఆ న్యాయమూర్తికి సాంకేతికంగా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక టెక్నికల్ ప్యానెల్‌ను నియమిస్తాం. సాంకేతిక సాయం కోసం ఎవరినైనా జడ్జి పిలవవచ్చు. వీళ్లు కాకుండా వేరొకరు కావాలని జడ్జి కోరితే ఆ మేరకు వారిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. టెండర్‌కు సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వీటిపై తన దగ్గరున్న టెక్నికల్ సిబ్బందితో జడ్జి చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత శాఖను పిలుస్తారు. తాను పరిగణనలోకి తీసుకున్న సలహాలు, సూచనల్లో తాను సరైనవనుకున్న వాటిపై జడ్జి ఆదేశాలు జారీ చేస్తారు. ఆ మార్పులన్నీ తూచా తప్పకుండా చేసిన తర్వాతే టెండర్ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తారు. మొత్తం టెండర్ ఖరారు కావడానికి దానికి ముందు జరిగే ప్రక్రియ 15 రోజుల పాటు ఉంటుంది. జడ్జి 7 రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతారు, మరో 8 రోజులు తాను సమయం తీసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై టెక్నికల్ టీంతో చర్చించి, ఆదేశాలు ఇవ్వడానికి జడ్జి ఈ సమయం తీసుకుంటారు. అనంతరం జడ్జి సూచించిన మార్పులు చేసిన తర్వాత టెండర్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. లోకాయుక్త బిల్లునూ తీసుకొచ్చాం... ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లుతో పాటు లోకాయుక్త బిల్లును కూడా తీసుకొచ్చాం. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో లోకాయుక్త లేదు. ఇది ఎందుకు అమలు కాలేదన్నది ప్రశ్నార్థకమే. లోకాయుక్తను తీసుకురావాలనుకుంటే నిజంగా జరిగి ఉండేది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త లేదు. కారణం.. దానికి కావాల్సిన ప్రక్రియను తీసుకురాలేదు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది. కానీ, ఆ ఆలోచన వారికి(టీడీపీ సర్కారు) లేదు. చిన్నచిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. ఒక సిట్టింగ్ జడ్జి గానీ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటే గానీ లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరైనా ఫర్వాలేదని నిర్ధారిస్తే ఐదేళ్ల క్రితమే లోకాయుక్త వచ్చి ఉండేది. కానీ, లోకాయుక్త అన్నది రానే రాకుండా ఐదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే పారదర్శకత కోసం మా ప్రభుత్వం వ్యవస్థలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టిందని సగర్వంగా చెబుతున్నా’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అవినీతికి వ్యతిరేకంగా నాయకులు, పాలకులు మాట్లాడడం చాలాసార్లు విన్నాం గానీ, నిజంగానే ఆ దిశగా ఆలోచన చేసి, అడుగులు వేయడం ఇప్పుడు తప్ప ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇంత పారదర్శకంగా, ఇంత నిజాయతీగా ఒక వ్యవస్థను సృష్టించి, ఆ వ్యవస్థ ద్వారా పారదర్శకతను ఒక స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకువెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తి నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. చరిత్రాత్మకమైన బిల్లును తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఇది మొదలవుతోంది. పారదర్శకత అనే పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే, దేశం యావత్తూ దీన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించాలి, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో అడుగులు వేయడమన్నది దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పారదర్శకత ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పోతుంది. ఇది ఇక్కడితో ఆగదు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని పాటించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇక్కడ మనం బీజం వేశాం. ఇది మహా వృక్షం అవుతుంది. దేశానికి దశా దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా చెబుతున్నా. రైతు బాగోగుల పర్యవేక్షణకే ఏపీ మార్కెట్ల చట్ట సవరణ: సీఎం అన్నదాతల బాగోగుల్లో ఎమ్మెల్యేలు పాలుపంచుకునేందుకే ఏపీ మార్కెట్ల చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద)లో మార్పులు తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏదైనా నియోజకవర్గంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు వీలుగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల, పశు సంపద మార్కెట్ల చట్టం–1966 సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ’గిట్టుబాటు ధరలు దక్కడంలో జాప్యం జరిగితే రైతులు నష్టపోతారు. దీన్ని నివారించేందుకే ఎమ్మెల్యేలను మార్కెట్లకు గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నాం. వారు మార్కెట్ కమిటీ సమావేశాలకు నేరుగా హాజరు కావడం వల్ల ఎక్కడైనా గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెస్తారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం’ అని సీఎం చెప్పారు. -
‘పుర’ బిల్లుకు కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. కొత్త మునిసిపాలిటీల చట్టం, కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చట్టం, టౌన్‌ప్లానింగ్ చట్టంతో కూడిన ముసాయిదా బిల్లును సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టను న్నారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో చర్చించి కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సుదీర్ఘ భేటీలో కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుపై చర్చ నిర్వహించారు. కొత్త మునిసిపల్ చట్టాలను తీసుకురావడం ద్వారా పురపాలనలో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలనతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ కొత్త చట్టాలను రూపొందించినట్లు సీఎం కేసీఆర్ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85% వాటిని సంరక్షించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కొత్త చట్టాల్లో పొందుపరిచినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలోని కొన్ని మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లేదా వాటిని కొత్త మునిసిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశాన్నీ కేబినేట్లో చర్చించినట్లు తెలిసింది. కేబినెట్ కీలక నిర్ణయాలు.. - వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ.1,000 నుంచి రూ.2,016కు పెంపు. - దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్ రూ.1,500 నుంచి 3,016కు పెంపు. ఈ పింఛన్ జూన్ నుంచి అమలు. జూలై నుంచి లబ్ధిదారులకు అందజేత. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ ఎన్నికల హామీని అమలుకు నిర్ణయం. మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు - రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఇతరులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. - వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్‌ను 2019 జూన్ నుంచి అమలు చేస్తారు. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారుల పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. - బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం (17–07–2019) నాటి వరకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించింది. - రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు పాత మునిసిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును సైతం మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది. -
లంచాలు లేకుండా పనులు జరగాలి
నా స్థాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నా. మీ స్థాయిలో మీరు కూడా కృషి చేయాలి. దయచేసి అంతా అవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టాలి. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా తిరిగి వెళ్లామనే సంతృప్తి ప్రజల్లో కలగాలి. – అధికారులకుసీఎం వైఎస్ జగన్ సూచన సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ‘అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పా. ఎమ్మార్వో కార్యాలయాల్లోకానీ పోలీస్స్టేషన్లలోకానీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా వెళ్లిందా?.. లేదా?’ అని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతిని సహించబోదని కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వడంతోపాటు అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని సీఎం ఆదేశించారు. ‘స్పందన’ మరింత బాగుండాలి.... ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్పందనలో 45,496 వినతులు అందగా ఆర్థిక అంశాలతో సంబంధం లేనివి 1,904 అర్జీలు ఉన్నాయి. ఇందులో ఏడు రోజుల్లోగా పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా 1,116 ఉన్నాయని గుర్తించారు. స్పందనలో అందిన వినతిపత్రాలను పరిష్కరించకుంటే రానురాను పేరుకుపోతాయని ఈ నేపథ్యంలో తదుపరి స్పందన కార్యక్రమంలోగా వీటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మన దృష్టి, ఏకాగ్రత తగ్గితే విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. ప్రజలను సంతోషపెట్టేలా ఈ కార్యక్రమం ఉండాలని, ఇప్పటివరకూ బాగానే చేస్తున్నారని, మరింత బాగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీవెన్సెస్ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు. 80 శాతం గ్రీవెన్సెస్ భూ సంబంధిత, సివిల్ సప్లై, పెన్షన్లు, పురపాలక, నగర పాలక సంస్థలకు చెందినవి, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. ఎమ్మార్వోల వద్దకు వచ్చిన గ్రీవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్లైన్లో పరిశీలించే విధానం ఉండాలని, అదే సమయంలో జాయింట్ కలెక్టర్ కూడా సమీక్షించే వ్యవస్థ ఉండాలన్నారు. కలెక్టర్, జేసీ పక్కపక్కనే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల చాలావరకు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎమ్మార్వోలు కూడా చురుగ్గా సమస్యలను పరిష్కరిస్తారన్నారు. జిల్లా స్థాయిలో అందే విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మార్వోలు, స్థానిక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే సిబ్బంది స్పందన కార్యక్రమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారని సీఎం పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో నేరుగా కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. సీఎస్ కూడా దీన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారంపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. మలేరియా ప్రబలకుండా చర్యలు గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కూడా వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు వ్యవసాయ శాఖ నుంచి కంటెంజెన్సీ ప్రణాళికలను జిల్లాలకు పంపిస్తున్నామని, దాని ప్రకారం విత్తనాల లభ్యత ఉండేలా చూసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. విత్తన సేకరణలో ఇప్పటికే తప్పులు జరిగాయని, అయితే ఇందులో అధికారులను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని, గత సర్కారు వీటిపై సరిగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని, కచ్చితంగా అధికారులు, ప్రభుత్వం కలసి ముందుకు సాగాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుతో రైతులు నష్టపోకుండా నివారించాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్స్ (నాణ్యత పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ఈలోగా కలెక్టర్లు దీనిపై దృష్టి సారించి తనిఖీలు జరపాలని సూచించారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై ప్రభుత్వ ముద్ర ఉండాలని, గ్రామ సచివాలయాలు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతాయని చెప్పారు. ఇంటి స్థలం లేని పేదలు ఉండకూడదు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలని సూచించారు. గ్రామ వలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఎంతమందికి ఇళ్లు లేవో వీరి ద్వారా సమాచారం అందుతుందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి కావాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారుడికి తెలియని పరిస్థితి ఉండకూడదన్నారు. గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ. 8,600 కోట్లు కేటాయించామని, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇస్తున్నామన్నారు. ‘కలెక్టర్ల మీదే నా విశ్వాసం.. వారే నా బలం కూడా..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్లు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ కార్యక్రమం కచ్చితంగా చేయగలుగుతామన్నారు. ‘వచ్చే తరాలు కూడా మీ (కలెక్టర్లు) గురించి మాట్లాడుకుంటాయి. ఇవ్వాళ్టి నుంచే మీరు (కలెక్టర్లు) పని చేయడం ప్రారంభిస్తేనే ఉగాది నాటికి పూర్తవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఇసుక లభ్యత పెంచండి ఇసుక కొరత ఉన్నట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో లభ్యతను పెంచాలని, అదే సమయంలో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. సెప్టెంబరు 1 నుంచి ఇసుకపై కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కార్యక్రమాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమిస్తున్నందున వారి సేవలను మెరుగ్గా వినియోగించుకోవడంపై మార్గనిర్దేశం చేయాలని కోరారు. సీఎం కార్యాలయం నుంచి కొన్ని మార్గదర్శకాలు పంపిస్తామని తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టులు రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు పనుల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా? అని బాధపడకూడదన్నారు. ప్రజలు రకరకాల సమస్యలతో వస్తారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం? ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యమని చెప్పారు. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలని ఇదివరకే చెప్పానని, ఇది కొనసాగాల్సిందేనని, ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఈ సందేశం పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మారాలి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మార్చాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మంచి పేరు రావాలని, జిల్లాపై మీ ముద్ర కనిపించాలని ఆకాంక్షించారు. వీటిని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్కూళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్స్, ఆట స్థలం లాంటి కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. కొద్ది రోజుల తరువాత ఫొటోలు తీసి వీటిని ఎలా మెరుగుపరిచామో ప్రజలకు తెలియచేస్తామన్నారు. పాఠ్యప్రణాళికలను మార్చటంపై నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తామని అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు సరుకుల కొనుగోళ్లు, ఆయాలకు సరైన సమయంలో వేతనాలు అందేలా చూడాలని సూచించారు. ఎక్కడైనా ఆలస్యమైతే వెంటనే తనను అప్రమత్తం చేయాలని సీఎం కోరారు. నెలల తరబడి వారికి డబ్బులివ్వకుండా పిల్లలకు మంచి భోజనం పెట్టమని ఎలా అడగగలమంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. యూనిఫారాలు, పుస్తకాలు కూడా సరైన సమయానికి అందించాలన్నారు. తల్లిదండ్రులకు దుస్తులు అందచేసి కుట్టుకూలీ చార్జీలు ఇవ్వాలని సూచించారు. జూన్ మొదటివారం నాటికి ఇవన్నీ అందాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కూడా ఇదే తరహాలో దృష్టి సారించాల్సిందిగా కలెక్టర్లకు సీఎం సూచించారు. కర్నూలు కలెక్టర్‌కు సీఎం అభినందనలు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభినందించారు. పాణ్యం అక్రమ పాఠశాల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చిన వైనాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కర్నూలు కలెక్టర్ ఆకస్మికతనిఖీ వీడియోను నేరుగా ఆయన చూశారు. మిగతా అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే వ్యవస్థలు బాగుపడతాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
ఈ ఏడాది 94 వేల విద్యుత్ కనెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: నూతన ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది (2016-17) 94,735 కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ చేసేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ అనుమతి రాగానే కనెక్షన్లు ఇవ్వనున్నారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏప్రిల్ నాటికి 93,043 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. తాజాగా ఈ సంఖ్యకు లక్షకు మించి పోయి ఉంటుందని అంచనా. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 64,730 కనెక్షన్లు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో 30,005 కనెక్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. గతేడాది రాష్ట్రంలో 1,01,020 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 93,299 కనెక్షన్లు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 21లక్షలకు చేరింది. అవినీతి నిర్మూలనకు చర్యలు కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీలో క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇటీవల ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్గత విజిలెన్స్ విచారణ జరిపించిన డిస్కంలు.. కొత్త కనెక్షన్ల జారీలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని గుర్తించాయి. ముందు వచ్చిన వారికి ముందు (ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లేదా ఫిఫో) విధానం అమల్లో ఉన్నా ఎక్కడా పాటించడం లేదని.. డబ్బులిచ్చిన వారికి తొలుత కనెక్షన్లు ఇస్తున్నారని తేల్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించాయి. కొత్త మార్గదర్శకాలు ≈ కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తును వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలి. దరఖాస్తుదారులకు కామన్ సీనియారిటీ ఆర్డర్లో రిజిస్ట్రేషన్ నంబర్లను జారీ చేయాలి. ≈ గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేసి డిస్కంల వెబ్‌సైట్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించాలి. ప్రతి నెలా ఈ జాబితాలను నవీకరించాలి. ముందు వచ్చిన వారికి ముందు జారీ చేసే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. మంజూరు చేసిన కనెక్షన్ల జాబితాను ప్రతి నెలా నవీకరించాలి. ≈ వర్క్ ఆర్డర్ జారీ, మెటీరియల్ సమీకరణ, కనెక్షన్ తదితర చర్యలను సైతం సీనియారిటీ ప్రకారం చేపట్టాలి. పురోగతి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ≈ అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించినప్పుడు అదనంగా రుసుము వసూలు చేయాలి. ఇలాంటి కేసులను సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఆమోదించాలి. ≈ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తే డిస్కంల ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. -
అవినీతిపై ఏసీబీ గురి
నేటినుంచి వారోత్సవాలు ప్రజల్లో అవగాహనకు ప్రయత్నం విజయవాడ సిటీ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన అంశంపై ప్రజలు పెద్దగా స్పందించరు. ఎంతోకొంత ముట్టచెప్పి తమ పని పూర్తి చేసుకుంటారు తప్ప అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేసి అక్రమార్కుల ఆట కట్టించేందుకు ప్రయత్నించరు. ప్రజల భావనలో మార్పు తెచ్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా డిసెంబర్ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలను ఇందుకు వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు, యువత, అవినీతిని పారదోలాలనే అభిప్రాయం ఉన్న వారిని ఒక చోటకు చేర్చి తమ ఉద్దేశాలను వివరించనున్నారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలతో పాటు అవినీతికి సంబంధించిన అవకాశాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు జరిగే కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నారు. అన్ని కార్యక్రమాల్లోను ఆరోపణలు లేని స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. పోస్టర్ల ప్రచారం: జిల్లాలో అవినీతిపై వ్యతిరేక నినాదాలతో కూడిన పోస్టర్లను విరివిగా ప్రదర్శించనున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో అందరికీ కనిపించే విధంగా వీటిని ఏర్పాటు చేస్తారు. కరపత్రాలు, స్టిక్కర్లను కూడా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాల్లో అంటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ లక్ష్యం, నినాదం, ఫోన్ నంబర్లను వీటిలో పొందుపరుస్తున్నారు. అవినీతి మెండు : ప్రభుత్వ శాఖలో అవినీతి పెరిగిందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. చేయి తడపనిదే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయడం అరుదు. తర్వాత తమ పని కాదనే భావన.. కోర్టుల చుట్టూ తిరగాలనే అభిప్రాయంతో ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. అన్ని శాఖల్లోనూ అవినీతిపై సమర శంఖం పూరించాలని ఏసీబీ నిర్ణయించింది. అపోహలు వద్దు ఏసీబి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులుంటాయనే అపోహ వద్దు. బాధితుల సొమ్ము మా శాఖ నుంచే ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. డీజీపీ అనుమతితో ట్రాప్‌కు అవసరమైన సొమ్ము మేమే సమకూర్చుతాం. కోర్టు ద్వారా ఆ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చేర్చుతాం. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నాం. పని కాదనే భయం కూడా వద్దు. ఆ పని పూర్తి చేసేందుకు మేమే చొరవ తీసుకుంటాం. - వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ, కృష్ణా -
‘మీ సేవ’.. ఏదీ తోవ!
గజ్వేల్: మున్సిపాలీటీలు, నగరపంచాయతీల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలుకునోచుకోవడంలేదు. అవినీతి నిర్మూలన, సత్వర సేవలే లక్ష్యంగా గతేడాది నుంచే ‘మీ-సేవ’తో పుర సేవలన్నీ అనుసంధానం చేయాలనే ప్రతిపాదన వ్యవహారం చడీచప్పుడు లేకుండా తయారైంది. ఫలితంగా ప్రజల ఇబ్బందులు యథాతథంగా మారాయి. జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్, పటాన్చెరు మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట నగర పంచాయతీలున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధి పెరుగుతుండగా ప్రజలకు వేగంగా సేవలందించడం కష్టతరంగా మారుతోంది. సిబ్బంది బాధ్యతారాహిత్యం, అవినీతి కూడా ప్రజలకు ప్రతి బంధకమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మున్సిపాలిటీల ప్రధాన సేవలన్నింటినీ ‘మీ-సేవా’ ద్వారా అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లకు గతేడాది పలుమార్లు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కొత్త విధానం అమల్లోకి రాబోతుందని ఏడాది కిందటే హడావిడి చేశారు. ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ‘మీ-సేవ’ ద్వారా అందిస్తున్నారు. కొత్త విధానంలో నల్లా కనెక్షన్, ఇంటి నిర్మాణానికి అనుమతి, ఆస్తి మార్పిడి, పన్నుల అసిస్మెంట్, పన్నుల సవరణ, ట్రేడ్ లెసైన్స్ వంటి ఆరు సేవలను ఆన్లైన్ ద్వారానే అందించడానికి చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ విధానంలో ముందుగా దరఖాస్తుదారులు రూ.35 రుసుము చెల్లించి ఆప్లికేషన్ ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా వారి అభ్యర్థనపై విచారణ జరిపి ఆ ఆమోదం తెలిపిన తర్వాత ఆ సేవకు సంబంధించి చార్జీలను చెల్లించాలి. మొత్తం మీద ఈ విధానం అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజలకు కూడా వేగంగా సేవలందుతాయని ప్రభుత్వ ఆలోచన. కానీ పరిస్థితి భిన్నంగా మారటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అవినీతిపైనే పోరు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో సీపీఎం, సీపీఐలు కలసి కట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఒంటరిగా చెరో తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను నిలబెట్టారు. తమకు పట్టున్న స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వామపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో నేతలు తిష్ట వేసి, గెలుపు లక్ష్యం గా, కార్మిక ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తాము రూపొం దించిన మ్యానిఫెస్టోను సీపీఐ విడుదల చేసిం ది. ఉదయం టీ నగర్‌లోని కార్యాలయంలో అవినీతిపైనే పోరు జరిగిన సమావేశంలో ఈ మ్యానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, జాతీయ కార్యదర్శి, ఎంపి డి రాజాలు విడుదల చేశారు. 40 గెలిచినా పీఎం సీటు కలే మ్యానిఫెస్టో విడుదల అనంతరం మీడియాతో పాండియన్ మాట్లాడుతూ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మూడో ఫ్రంట్‌లోకి జయలలిత వస్తారా లేదా అన్నది తనకు తెలియదన్నారు. ఆ పార్టీ పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో 40 సీట్లు గెలిచినా, ఆమె పీఎం కావడానికి మరో 234 సీట్లు అవసరం అన్నది గుర్తుంచుకోవాలంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం విచారకరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఇక రాష్ట్రంలో భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీలంకను వెనకేసుకు రావడమే కాకుండా అధికారుల మీద నిందలు వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు ఉన్న అధికారాలను ఉపయోగించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చుగా అని ప్రశ్నించారు. దేశంలో మోడీ పవనాలు వీయడం లేదని, ఇవన్నీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సృష్టిగా అభివర్ణించారు. కాంగ్రెస్, బీజే పీలు రెండు ఒకటేనని, ఆ ఇద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రజలకు అష్టకష్టాలు తప్పవని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలసి డీఎంకే, డీఎంకేతో కలసి కాంగ్రెస్ చెడి పోయిందని, ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లినట్టేనన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నేతలు నల్లకన్ను, మహేంద్రన్, ఏఎస్ కన్నన్, తదితరులు పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలు అవినీతి నిర్మూలనా నినాదంతో ముందుకెళ్తున్నాం. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీస్తాం. నదుల అనుసంధానంలో కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే. ఈ రెండు పార్టీలతో ఒరిగేది శూన్యం. దక్షిణాదిలోని నదులు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటాం. దక్షిణాది జిల్లాల ప్రజల కలలను సాకారం చేస్తూ, సేతు సముద్రం ప్రాజెక్టు అమలయ్యేలా చేస్తాం. విద్యుత్ గండం నుంచి రాష్ట్రాన్ని బయట పడేలా చేస్తాం. విద్యుత్ సమస్యతో చతికిలబడుతున్న చిన్న తరహా పరిశ్రమలను ఆదుకుంటాం. అద్దకం పరిశ్రమలు, రసాయన పరిశ్రమల బారినుంచి గ్రామీణ ప్రజల్ని రక్షిస్తాం. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో రసాయనాల శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు నర్సరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు పాల్పడుతున్న విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేరుస్తాం. ఉద్యోగ అవకాశాల మెరుగు లక్ష్యంగా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తాం. ఖనిజ సంపదల పరిరక్షణతో పాటుగా ఆ సంపదలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోకి వచ్చే రీతిలో చర్యలు తీసుకుంటాం.