అవినీతిపైనే పోరు | Fighting against corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపైనే పోరు

Published Sat, Mar 29 2014 11:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Fighting against corruption

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో సీపీఎం, సీపీఐలు కలసి కట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఒంటరిగా చెరో తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను నిలబెట్టారు. తమకు పట్టున్న స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వామపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో నేతలు తిష్ట వేసి, గెలుపు లక్ష్యం గా, కార్మిక ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తాము రూపొం దించిన మ్యానిఫెస్టోను సీపీఐ విడుదల చేసిం ది. ఉదయం టీ నగర్‌లోని కార్యాలయంలో అవినీతిపైనే పోరు జరిగిన సమావేశంలో ఈ మ్యానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, జాతీయ కార్యదర్శి, ఎంపి డి రాజాలు విడుదల చేశారు.
 
 40 గెలిచినా పీఎం సీటు కలే
 మ్యానిఫెస్టో విడుదల  అనంతరం మీడియాతో పాండియన్ మాట్లాడుతూ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మూడో ఫ్రంట్‌లోకి జయలలిత వస్తారా లేదా అన్నది తనకు తెలియదన్నారు. ఆ పార్టీ పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో 40 సీట్లు గెలిచినా, ఆమె పీఎం కావడానికి మరో 234 సీట్లు అవసరం అన్నది గుర్తుంచుకోవాలంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  శ్రీలంకకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం విచారకరంగా పేర్కొన్నారు.
 
 కాంగ్రెస్‌ను ఇక రాష్ట్రంలో భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీలంకను వెనకేసుకు రావడమే కాకుండా అధికారుల మీద నిందలు వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు ఉన్న అధికారాలను ఉపయోగించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చుగా అని ప్రశ్నించారు. దేశంలో మోడీ పవనాలు వీయడం లేదని, ఇవన్నీ  ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సృష్టిగా అభివర్ణించారు. కాంగ్రెస్, బీజే పీలు రెండు ఒకటేనని, ఆ ఇద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రజలకు అష్టకష్టాలు తప్పవని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలసి డీఎంకే, డీఎంకేతో కలసి కాంగ్రెస్ చెడి పోయిందని, ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లినట్టేనన్నారు. ఈ సమావేశంలో  సీపీఐ నేతలు నల్లకన్ను, మహేంద్రన్, ఏఎస్ కన్నన్, తదితరులు పాల్గొన్నారు.
 
 మ్యానిఫెస్టోలోని అంశాలు
 
అవినీతి నిర్మూలనా నినాదంతో ముందుకెళ్తున్నాం. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీస్తాం.
నదుల అనుసంధానంలో కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే. ఈ రెండు పార్టీలతో ఒరిగేది శూన్యం. దక్షిణాదిలోని నదులు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటాం.
దక్షిణాది జిల్లాల ప్రజల కలలను సాకారం చేస్తూ, సేతు సముద్రం ప్రాజెక్టు అమలయ్యేలా చేస్తాం.
విద్యుత్ గండం నుంచి రాష్ట్రాన్ని బయట పడేలా చేస్తాం. విద్యుత్ సమస్యతో చతికిలబడుతున్న చిన్న తరహా పరిశ్రమలను ఆదుకుంటాం.
అద్దకం పరిశ్రమలు, రసాయన పరిశ్రమల బారినుంచి గ్రామీణ ప్రజల్ని రక్షిస్తాం. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో రసాయనాల శుద్ధీకరణ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తాం.
ప్రైవేటు నర్సరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు పాల్పడుతున్న విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేరుస్తాం.
ఉద్యోగ అవకాశాల మెరుగు లక్ష్యంగా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తాం.
ఖనిజ సంపదల పరిరక్షణతో పాటుగా ఆ సంపదలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోకి వచ్చే రీతిలో చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement