లంచాలు లేకుండా పనులు జరగాలి | CM YS Jagan review with district collectors and SPs On Spandhana | Sakshi
Sakshi News home page

లంచాలు లేకుండా పనులు జరగాలి

Published Wed, Jul 17 2019 3:52 AM | Last Updated on Wed, Jul 17 2019 11:29 AM

CM YS Jagan review with district collectors and SPs On Spandhana - Sakshi

నా స్థాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నా. మీ స్థాయిలో మీరు కూడా కృషి చేయాలి. దయచేసి అంతా అవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టాలి. పోలీస్‌ స్టేషన్లు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా తిరిగి వెళ్లామనే సంతృప్తి ప్రజల్లో కలగాలి.
– అధికారులకుసీఎం వైఎస్‌ జగన్‌ సూచన

సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ‘అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పా. ఎమ్మార్వో కార్యాలయాల్లోకానీ  పోలీస్‌స్టేషన్లలోకానీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా వెళ్లిందా?.. లేదా?’ అని  కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతిని సహించబోదని కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వడంతోపాటు అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని సీఎం ఆదేశించారు. 

‘స్పందన’ మరింత బాగుండాలి....
‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్‌ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. స్పందనలో 45,496 వినతులు అందగా ఆర్థిక అంశాలతో సంబంధం లేనివి 1,904 అర్జీలు ఉన్నాయి. ఇందులో ఏడు రోజుల్లోగా పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా 1,116 ఉన్నాయని గుర్తించారు. స్పందనలో అందిన వినతిపత్రాలను పరిష్కరించకుంటే రానురాను  పేరుకుపోతాయని ఈ నేపథ్యంలో తదుపరి స్పందన కార్యక్రమంలోగా వీటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మన దృష్టి, ఏకాగ్రత తగ్గితే విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. ప్రజలను సంతోషపెట్టేలా ఈ కార్యక్రమం ఉండాలని, ఇప్పటివరకూ బాగానే చేస్తున్నారని, మరింత బాగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీవెన్సెస్‌ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు.

80 శాతం గ్రీవెన్సెస్‌ భూ సంబంధిత, సివిల్‌ సప్‌లై, పెన్షన్లు, పురపాలక, నగర పాలక సంస్థలకు చెందినవి, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. ఎమ్మార్వోల వద్దకు వచ్చిన గ్రీవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్‌లైన్లో పరిశీలించే విధానం ఉండాలని, అదే సమయంలో జాయింట్‌ కలెక్టర్‌ కూడా సమీక్షించే వ్యవస్థ ఉండాలన్నారు. కలెక్టర్, జేసీ పక్కపక్కనే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల చాలావరకు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎమ్మార్వోలు కూడా చురుగ్గా సమస్యలను పరిష్కరిస్తారన్నారు.

జిల్లా స్థాయిలో అందే విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మార్వోలు, స్థానిక అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే సిబ్బంది స్పందన కార్యక్రమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారని సీఎం పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో నేరుగా కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. సీఎస్‌ కూడా దీన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారంపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.

మలేరియా ప్రబలకుండా చర్యలు
గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కూడా వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. 

విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
వ్యవసాయ శాఖ నుంచి కంటెంజెన్సీ ప్రణాళికలను జిల్లాలకు పంపిస్తున్నామని, దాని ప్రకారం విత్తనాల లభ్యత ఉండేలా చూసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. విత్తన సేకరణలో ఇప్పటికే తప్పులు జరిగాయని, అయితే ఇందులో అధికారులను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని, గత సర్కారు వీటిపై సరిగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని, కచ్చితంగా అధికారులు, ప్రభుత్వం కలసి ముందుకు సాగాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుతో రైతులు నష్టపోకుండా నివారించాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్స్‌ (నాణ్యత పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ఈలోగా కలెక్టర్లు దీనిపై దృష్టి సారించి తనిఖీలు జరపాలని సూచించారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై ప్రభుత్వ ముద్ర ఉండాలని, గ్రామ సచివాలయాలు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతాయని చెప్పారు.

ఇంటి స్థలం లేని పేదలు ఉండకూడదు
వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని  పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలని సూచించారు. గ్రామ వలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఎంతమందికి ఇళ్లు లేవో వీరి ద్వారా సమాచారం అందుతుందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి కావాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారుడికి తెలియని పరిస్థితి ఉండకూడదన్నారు. గృహ నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ. 8,600 కోట్లు కేటాయించామని, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇస్తున్నామన్నారు. ‘కలెక్టర్ల మీదే నా విశ్వాసం.. వారే నా బలం కూడా..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్లు  చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ కార్యక్రమం కచ్చితంగా చేయగలుగుతామన్నారు. ‘వచ్చే తరాలు కూడా మీ (కలెక్టర్లు) గురించి మాట్లాడుకుంటాయి. ఇవ్వాళ్టి నుంచే మీరు (కలెక్టర్లు) పని చేయడం ప్రారంభిస్తేనే ఉగాది నాటికి పూర్తవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. 

ఇసుక లభ్యత పెంచండి
ఇసుక కొరత ఉన్నట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో లభ్యతను పెంచాలని, అదే సమయంలో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని సీఎం జగన్‌ కలెక్టర్లకు సూచించారు. సెప్టెంబరు 1 నుంచి ఇసుకపై కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.  గ్రామ వలంటీర్ల శిక్షణ కార్యక్రమాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమిస్తున్నందున వారి సేవలను మెరుగ్గా వినియోగించుకోవడంపై మార్గనిర్దేశం చేయాలని కోరారు. సీఎం కార్యాలయం నుంచి కొన్ని మార్గదర్శకాలు పంపిస్తామని తెలిపారు.

అన్ని పోలీస్‌స్టేషన్లలో రిసెప్షనిస్టులు 
రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు పనుల నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా? అని బాధపడకూడదన్నారు. ప్రజలు రకరకాల సమస్యలతో వస్తారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం? ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యమని చెప్పారు. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలని ఇదివరకే చెప్పానని, ఇది కొనసాగాల్సిందేనని, ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఈ సందేశం పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మారాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మార్చాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మంచి పేరు రావాలని,  జిల్లాపై మీ ముద్ర కనిపించాలని ఆకాంక్షించారు. వీటిని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్కూళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, ఫర్నిచర్, బ్లాక్‌ బోర్డ్స్, ఆట స్థలం లాంటి కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. కొద్ది రోజుల తరువాత ఫొటోలు తీసి వీటిని ఎలా మెరుగుపరిచామో ప్రజలకు తెలియచేస్తామన్నారు. పాఠ్యప్రణాళికలను మార్చటంపై నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తామని అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు సరుకుల కొనుగోళ్లు, ఆయాలకు సరైన సమయంలో వేతనాలు అందేలా చూడాలని సూచించారు. ఎక్కడైనా ఆలస్యమైతే వెంటనే తనను అప్రమత్తం చేయాలని సీఎం కోరారు. నెలల తరబడి వారికి డబ్బులివ్వకుండా పిల్లలకు మంచి భోజనం పెట్టమని ఎలా అడగగలమంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. యూనిఫారాలు, పుస్తకాలు కూడా సరైన సమయానికి అందించాలన్నారు. తల్లిదండ్రులకు దుస్తులు అందచేసి కుట్టుకూలీ చార్జీలు ఇవ్వాలని సూచించారు. జూన్‌ మొదటివారం నాటికి ఇవన్నీ అందాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కూడా ఇదే తరహాలో దృష్టి సారించాల్సిందిగా కలెక్టర్లకు సీఎం సూచించారు.

కర్నూలు కలెక్టర్‌కు సీఎం అభినందనలు
కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. పాణ్యం అక్రమ పాఠశాల హాస్టల్‌ను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసి అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చిన వైనాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కర్నూలు కలెక్టర్‌ ఆకస్మికతనిఖీ వీడియోను నేరుగా ఆయన చూశారు. మిగతా అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే వ్యవస్థలు బాగుపడతాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement