ఈ ఏడాది 94 వేల విద్యుత్ కనెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: నూతన ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది (2016-17) 94,735 కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ చేసేందుకు అనుమతించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ అనుమతి రాగానే కనెక్షన్లు ఇవ్వనున్నారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏప్రిల్ నాటికి 93,043 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. తాజాగా ఈ సంఖ్యకు లక్షకు మించి పోయి ఉంటుందని అంచనా.
అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలో 64,730 కనెక్షన్లు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలో 30,005 కనెక్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. గతేడాది రాష్ట్రంలో 1,01,020 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 93,299 కనెక్షన్లు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 21లక్షలకు చేరింది.
అవినీతి నిర్మూలనకు చర్యలు
కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీలో క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇటీవల ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్గత విజిలెన్స్ విచారణ జరిపించిన డిస్కంలు.. కొత్త కనెక్షన్ల జారీలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని గుర్తించాయి. ముందు వచ్చిన వారికి ముందు (ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లేదా ఫిఫో) విధానం అమల్లో ఉన్నా ఎక్కడా పాటించడం లేదని.. డబ్బులిచ్చిన వారికి తొలుత కనెక్షన్లు ఇస్తున్నారని తేల్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించాయి.
కొత్త మార్గదర్శకాలు
≈ కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తును వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలి. దరఖాస్తుదారులకు కామన్ సీనియారిటీ ఆర్డర్‌లో రిజిస్ట్రేషన్ నంబర్లను జారీ చేయాలి.
≈ గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేసి డిస్కంల వెబ్‌సైట్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించాలి. ప్రతి నెలా ఈ జాబితాలను నవీకరించాలి. ముందు వచ్చిన వారికి ముందు జారీ చేసే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. మంజూరు చేసిన కనెక్షన్ల జాబితాను ప్రతి నెలా నవీకరించాలి.
≈ వర్క్ ఆర్డర్ జారీ, మెటీరియల్ సమీకరణ, కనెక్షన్ తదితర చర్యలను సైతం సీనియారిటీ ప్రకారం చేపట్టాలి. పురోగతి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి.
≈ అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించినప్పుడు అదనంగా రుసుము వసూలు చేయాలి. ఇలాంటి కేసులను సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఆమోదించాలి.
≈ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తే డిస్కంల ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి.