దేశానికి దశా దిశా చూపించే బిల్లు | YS Jagan Mohan Reddy comments for the eradication of corruption | Sakshi
Sakshi News home page

దేశానికి దశా దిశా చూపించే బిల్లు

Published Sat, Jul 27 2019 4:37 AM | Last Updated on Sat, Jul 27 2019 5:06 AM

YS Jagan Mohan Reddy comments for the eradication of corruption - Sakshi

సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అవినీతి నిర్మూలన, పారదర్శకతకు పెద్దపీట వేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ముందస్తు న్యాయ పరిశీలనకు రాష్ట్రంలో బీజం వేసినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ బీజం మున్ముందు మహావృక్షం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అవినీతి ముద్రను చెరిపేసేందుకు నడుం బిగించినట్టు ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు–2019’ చరిత్రాత్మకమైన బిల్లు అని అభివర్ణించారు. ఇది దేశానికి దశా దిశా చూపించే బిల్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే.. 

ప్రజలకు అందుబాటులోకి టెండర్‌ పత్రాలు 
‘‘ఏ టెండర్‌ తీసుకున్నా, ఏ పని తీసుకున్నా సర్వం కుంభకోణాల మయమే. చివరకు మనం కూర్చున్న ఇదే బిల్డింగ్‌ను తీసుకున్నా కుంభకోణమే కనిపిస్తుంది. ఒక్కో అడుగుకి రూ.10 వేలు ఖర్చు చేసి కట్టిన తాత్కాలిక బిల్డింగ్‌లో మనం కూర్చుని మాట్లాడుతున్నాం. ఏది తీసుకున్నా స్కామ్‌లమయమే కనిపిస్తోంది. ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు ప్రకారం.. ఏ పనైనా రూ.100 కోట్లు, ఆపై విలువ చేసే ఏ టెండరైనా, ఒకే పనిని విభజించినా సరే మొత్తం విలువ రూ.100 కోట్లు, ఆపైన విలువ ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఒక హైకోర్టు జడ్జి వద్దకు పంపిస్తాం. ఈ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ బిల్లు ద్వారా అడుగుతున్నాం. సిట్టింగ్‌ జడ్జా, రిటైర్డ్‌ జడ్జా అన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఉంటుంది. వాళ్లు నియమించిన ఆ జడ్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఏ టెండరైనా, పనైనా సరే దాని విలువ రూ.100 కోట్లు దాటితే ఆ టెండర్‌ పత్రాలను జడ్జికి పంపిస్తాం. జడ్జి వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. ప్రజలందరికీ కనిపించేలా అన్ని మాధ్యమాల్లో– ఇంటర్నెట్, వెబ్‌సైట్లలో.. ఇలా అన్నిచోట్లా పెడతారు. వారం రోజుల పాటు ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ఆ టెండర్‌కు సంబంధించి ఫలానా మార్పులు చేయాలని సలహాలు, సూచనలు నేరుగా జడ్జికి ఇవ్వొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. వీటిని జడ్జి స్వీకరిస్తారు. ఆ న్యాయమూర్తికి సాంకేతికంగా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక టెక్నికల్‌ ప్యానెల్‌ను నియమిస్తాం. సాంకేతిక సాయం కోసం ఎవరినైనా జడ్జి పిలవవచ్చు. వీళ్లు కాకుండా వేరొకరు కావాలని జడ్జి కోరితే ఆ మేరకు వారిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. టెండర్‌కు సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వీటిపై తన దగ్గరున్న టెక్నికల్‌ సిబ్బందితో జడ్జి చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత శాఖను పిలుస్తారు. తాను పరిగణనలోకి తీసుకున్న సలహాలు, సూచనల్లో తాను సరైనవనుకున్న వాటిపై జడ్జి ఆదేశాలు జారీ చేస్తారు. ఆ మార్పులన్నీ తూచా తప్పకుండా చేసిన తర్వాతే టెండర్‌ డాక్యుమెంట్లను రిలీజ్‌ చేస్తారు. మొత్తం టెండర్‌ ఖరారు కావడానికి దానికి ముందు జరిగే ప్రక్రియ 15 రోజుల పాటు ఉంటుంది. జడ్జి 7 రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు, మరో 8 రోజులు తాను సమయం తీసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై టెక్నికల్‌ టీంతో చర్చించి, ఆదేశాలు ఇవ్వడానికి జడ్జి ఈ సమయం తీసుకుంటారు. అనంతరం జడ్జి సూచించిన మార్పులు చేసిన తర్వాత టెండర్‌ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. 

లోకాయుక్త బిల్లునూ తీసుకొచ్చాం...
ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లుతో పాటు లోకాయుక్త బిల్లును కూడా తీసుకొచ్చాం. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో లోకాయుక్త లేదు. ఇది ఎందుకు అమలు కాలేదన్నది ప్రశ్నార్థకమే. లోకాయుక్తను తీసుకురావాలనుకుంటే నిజంగా జరిగి ఉండేది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త లేదు. కారణం.. దానికి కావాల్సిన ప్రక్రియను తీసుకురాలేదు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది. కానీ, ఆ ఆలోచన వారికి(టీడీపీ సర్కారు) లేదు. చిన్నచిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. ఒక సిట్టింగ్‌ జడ్జి గానీ, రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉంటే గానీ లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఎవరైనా ఫర్వాలేదని నిర్ధారిస్తే ఐదేళ్ల క్రితమే లోకాయుక్త వచ్చి ఉండేది. కానీ, లోకాయుక్త అన్నది రానే రాకుండా ఐదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే పారదర్శకత కోసం మా ప్రభుత్వం వ్యవస్థలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టిందని సగర్వంగా చెబుతున్నా’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. 

అవినీతికి వ్యతిరేకంగా నాయకులు, పాలకులు మాట్లాడడం చాలాసార్లు విన్నాం గానీ, నిజంగానే ఆ దిశగా ఆలోచన చేసి, అడుగులు వేయడం ఇప్పుడు తప్ప ఇంతకు ముందెన్నడూ జరగలేదు. 
ఇంత పారదర్శకంగా, ఇంత నిజాయతీగా ఒక వ్యవస్థను సృష్టించి, ఆ వ్యవస్థ ద్వారా పారదర్శకతను ఒక స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకువెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తి నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి.

చరిత్రాత్మకమైన బిల్లును తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఇది మొదలవుతోంది. పారదర్శకత అనే పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే, దేశం యావత్తూ దీన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించాలి, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో అడుగులు వేయడమన్నది దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. 


ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పారదర్శకత ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పోతుంది. ఇది ఇక్కడితో ఆగదు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని పాటించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇక్కడ మనం బీజం వేశాం. ఇది మహా వృక్షం అవుతుంది. దేశానికి దశా దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా చెబుతున్నా.  

రైతు బాగోగుల పర్యవేక్షణకే ఏపీ మార్కెట్ల చట్ట సవరణ: సీఎం
అన్నదాతల బాగోగుల్లో ఎమ్మెల్యేలు పాలుపంచుకునేందుకే ఏపీ మార్కెట్ల చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద)లో మార్పులు తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏదైనా నియోజకవర్గంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు వీలుగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఉత్పత్తుల, పశు సంపద మార్కెట్ల చట్టం–1966 సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ’గిట్టుబాటు ధరలు దక్కడంలో జాప్యం జరిగితే రైతులు నష్టపోతారు. దీన్ని నివారించేందుకే ఎమ్మెల్యేలను మార్కెట్లకు గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నాం. వారు మార్కెట్‌ కమిటీ సమావేశాలకు నేరుగా హాజరు కావడం వల్ల ఎక్కడైనా గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెస్తారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం’ అని సీఎం చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement