‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం  | State cabinet has approved the draft bill of the new municipal act | Sakshi
Sakshi News home page

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

Published Thu, Jul 18 2019 1:33 AM | Last Updated on Thu, Jul 18 2019 5:08 AM

State cabinet has approved the draft bill of the new municipal act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన కొత్త మునిసిపల్‌ చట్టాల ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. కొత్త మునిసిపాలిటీల చట్టం, కార్పొరేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల చట్టం, టౌన్‌ప్లానింగ్‌ చట్టంతో కూడిన ముసాయిదా బిల్లును సీఎం కేసీఆర్‌ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టను న్నారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో చర్చించి కొత్త మునిసిపల్‌ చట్టాల బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. కొత్త మునిసిపల్‌ చట్టాల బిల్లుకు ఆమోదంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది.

ఈ సుదీర్ఘ భేటీలో కొత్త మునిసిపల్‌ చట్టాల ముసాయిదా బిల్లుపై చర్చ నిర్వహించారు. కొత్త మునిసిపల్‌ చట్టాలను తీసుకురావడం ద్వారా పురపాలనలో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలనతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై  చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ కొత్త చట్టాలను రూపొందించినట్లు సీఎం కేసీఆర్‌ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. హరితహారం   కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85% వాటిని సంరక్షించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కొత్త చట్టాల్లో పొందుపరిచినట్లు సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలోని కొన్ని మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం లేదా వాటిని కొత్త మునిసిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశాన్నీ కేబినేట్‌లో చర్చించినట్లు తెలిసింది.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 
- వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ రూ.1,000 నుంచి రూ.2,016కు పెంపు.  
దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ రూ.1,500 నుంచి 3,016కు పెంపు. ఈ పింఛన్‌ జూన్‌ నుంచి అమలు. జూలై నుంచి లబ్ధిదారులకు అందజేత. 
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామనే టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని అమలుకు నిర్ణయం. 

మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు
- రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఇతరులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 
- వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్‌ను 2019 జూన్‌ నుంచి అమలు చేస్తారు. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్‌ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారుల పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. 
- వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
- బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం (17–07–2019) నాటి వరకు కూడా పీఎఫ్‌ ఖాతా ఉన్న కార్మికులకు పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించింది. 
- రుణ ఉపశమన కమిషన్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ బిల్లుతో పాటు పాత మునిసిపల్‌ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ బిల్లును సైతం మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement