ముంబై: పట్టణీకరణ వేగవంతం కావడం, భారీగా జనాభా పెరగడం వల్ల సహజంగానే నేరాలు పెరుగుతాయి. దేశ ఆర్థిక రాజధానిలో భారీగా నేరాలు జరుగుతున్నట్టు వార్తాపత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నా, ప్రభుత్వ గణాంకాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ముంబైలో నేరాలరేటు తగ్గుముఖం పడుతోందని పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 నుంచి ముంబై, ఢిల్లీ జనాభా దాదాపు 70 శాతం పెరిగింది. ఇదే కాలంలో నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని అధికారులు అంటున్నారు.
చాలా ఘటనల్లో ఫిర్యాదులు నమోదు కాకపోవడం వల్ల నేరాలరేటు తక్కువగా ఉంటోంది. 1999లో ముంబై ప్రతి లక్షమందికి 401.01 నేరాలు నమోదు కాగా, గత ఏడాది ఈ సంఖ్య 165.7 మాత్రమే! ముంబై జనాభా గత 21 ఏళ్లలో 85 లక్షలు పెరిగింది. అయితే 1991లో 39,897గా ఉన్న నేరాల సంఖ్య గత ఏడాదిలో 30,508గా నమోదవడం గమనార్హం. ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్‌లోనూ నేరాల రేటు తగ్గిందని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అత్యాధునిక నగరం లండన్‌లో గత ఏడాది లక్ష మందికి 310 చొప్పున నేరాలు నమోదు కాగా, ఎన్నో సంక్షోభాలకు నిలయమైన ముంబైలో కేవలం 400 నేరాలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టు సైతం మంగళవారం స్పందిస్తూ చాలా నేరాలపై ఫిర్యాదులు నమోదు కావడం లేదని కుండబద్దలు కొట్టింది. గుర్తించదగిన (కాగ్నిజబుల్) ప్రతి ఘటనపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనని స్పష్టీకరించింది. చాలా ఘటనలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని ఆక్షేపించింది.
ఇలా ఎందుకు జరుగుతోందంటే ?
చాలా సందర్భాల్లో పోలీసులు ఫిర్యాదులను తొక్కిపెడుతున్న మాట నిజమేనని పలువురు ఐపీఎస్ అధికారులు అంగీకరించారు. హత్య వంటి నేరాలను దాచిపెట్టడం సాధ్యం కాకపోయినా, సొత్తు అపహరణ, లైంగిక నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిందితులతో కుమ్మక్కుకావడం, లంచగొండితనం, స్టేషన్‌లో కేసుల సంఖ్యను తక్కువగా చూపించాలనే ఆలోచన ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. పోలీసుల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేరాలరేటు పెరుగుతుందనే అభిప్రాయం సరికాదని చెబుతున్నారు. పోలీసులు తమ స్టేషన్‌కు చెడ్డపేరు రావొద్దనే ఆలోచనతో నేరాలను తక్కువ చేసి చూపిస్తుంటారని చెప్పారు. ‘ఏదైనా ప్రాంతంలో నేరాల సంఖ్య పెరిగినట్టు తేలితే సమీక్షా సమావేశంలో సదరు అధికారులను ప్రశ్నిస్తారు. ఈ ఇబ్బంది తప్పించుకోవడానికి నేరాలను తొక్కిపెడుతుంటారు’ అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు అన్నారు. గుండెజబ్బులు పెరగడానికి డాక్టర్లు ఎలా కారణం కాదో.. నేరాల పెరుగుదలతోనూ పోలీసులకు ఎలాంటి సంబంధమూ ఉండబోదని మాజీ ఐపీఎస్ అధికారి ఒకరు అన్నారు. ‘మనం తప్పును అంగీకరిస్తేనే దానిని పరిష్కరించుకోగలుగుతాం. భారతీయులం మనల్ని మనమే వంచించుకుంటున్నాం. కేసుల్లో రాజీపడే విధానాన్ని పోలీసు అధికారులు పూర్తిగా విడనాడాలి. లేకుంటే నేరగాళ్లలో భయం ఉండదు.’ అని సమాచార హక్కు చట్టం కార్యకర్త శైలేష్ గాంధీ వ్యాఖ్యానించారు.
పశ్చిమబెంగాల్ జల్పాయిగురి జిల్లా ఎస్పీగా 1997లో పనిచేసే త్రిపురారి ఈ సమస్య పరిష్కారానికి వినూత్న విధానాన్ని అమలు చేశారు. గుర్తించతగిన నేరాలన్నింటినిపైనా తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో నేరాలరేటు హఠాత్తుగా నాలుగురెట్లు పెరిగింది. జిల్లాలో నేరాల తీరుపై వాస్తవిక సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. త్రిపురారి ప్రయత్నానికి మంచి ప్రశంసలు దక్కాయి కూడా. ముంబైలోనూ ఈ విధానం అమలైతే ఎంత బాగుంటుందో!!
నేరాలకు ముసుగు!
Published Sat, Nov 16 2013 1:07 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement