సాక్షి, ముంబై: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పథకం ప్రకారం వలపన్ని అనేక మంది అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. కాని కోర్టులో తగిన రుజువులు సమర్పించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కొంతమంది అవినీతిపరులకు మాత్రమే జైలు శిక్ష పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ ఆఖరు వరకు వేయి మందికిపైగా అవినీతిపరులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాని నేరం రుజువు కాకపోవడంతో కేవలం 23 శాతం మందికి మాత్రమే జైలు శిక్ష పడింది. కాగా 2009-2014 (అక్టోబర్ ఆఖరు వరకు) కాలవ్యవధిలో 2,266 మందిని పట్టుకోగా వారిలో కేవలం 519 మందికి శిక్ష పడింది. మిగిలిన 1,747 మంది నిర్ధోషులుగా విడుదలయ్యారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి పురస్కరించుకుని ఏసీబీ అక్టోబర్ 27 నుంచి నవంబర్ ఒకటి వరకు భద్రత జనజాగృతి వారోత్సవాలు నిర్వహించింది.
ఇందులో అవినీతిపరుల వివరాలు వెల్లడించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకోవడం తదితర కేసుల్లో పట్టుబడిన వారిలో అత్యధిక శాతం నాసిక్‌కు చెందినవారున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కోర్టుల్లో ప్రస్తుతం మొత్తం 2,794 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న 318 కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, అవినీతి పరులు లంచం తీసుకుంటుండగా రహస్యంగా తీసిన ఫొటోలు లేదా స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో చిత్రీకరణ దృశ్యాలు ఏసీబీకి పంపిస్తే కొంత ఫలితముంటుందని నాసిక్ రీజియన్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు.
కేసుల నిరూపణలో ఏసీబీ విఫలం
Published Mon, Nov 3 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM
Advertisement