రంజీ సెమీ ఫైనల్‌.. శతక్కొట్టిన యశ్‌ రాథోడ్‌.. భారీ ఆధిక్యం దిశగా విదర్భ | Vidarbha Batter Yash Rathod Slams Century In Ranji Semi Finals Against Mumbai | Sakshi
Sakshi News home page

రంజీ సెమీ ఫైనల్‌.. శతక్కొట్టిన యశ్‌ రాథోడ్‌.. భారీ ఆధిక్యం దిశగా విదర్భ

Published Thu, Feb 20 2025 12:48 PM | Last Updated on Thu, Feb 20 2025 12:59 PM

Vidarbha Batter Yash Rathod Slams Century In Ranji Semi Finals Against Mumbai

ముంబైతో జరుగుతున్న రంజీ సెమీ ఫైనల్‌-2లో విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. నాలుగో రోజు లంచ్‌ విరామం సమయానికి విదర్భ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 113 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం విదర్భ 340 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. యువ బ్యాటర్‌ యశ్‌ రాథోడ్‌ (110 నాటౌట్‌) ఈ సీజన్‌లో ఐదో సెంచరీతో కదంతొక్కి విదర్భను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. యశ్‌ రాథోడ్‌కు జతగా దర్శన్‌ నల్కండే (4) క్రీజ్‌లో ఉన్నాడు.

147/4 స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ.. కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (52) సహా రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు జోడించింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో అథర్వ్‌ తైడే 0, ధృవ్‌ షోరే 13, దనిశ్‌ మాలేవార్‌ 29, కరుణ్‌ నాయర్‌ 6, అక్షయ్‌ వాద్కర్‌ 52, హర్ష్‌ దూబే 1 పరుగు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో షమ్స్‌ ములానీ 3, తనుశ్‌ కోటియన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్‌ షోరే (74), దినిశ్‌ మాలేవార్‌ (79), యశ్‌ రాథోడ్‌ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్‌ నాయర్‌ (45), కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్‌ రేఖడే 23, హర్ష్‌ దూబే 18, భూటే 11, యశ్‌ ఠాకూర్‌ 3 పరుగులు చేసి ఔట్‌ కాగా.. దర్శన్‌ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్‌ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్‌స్టన్‌ డయాస్‌ తలో రెండు, శార్దూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్‌ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), శివమ్‌ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్‌ ఆనంద్‌ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్‌ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. 

ఆకాశ్‌ ఆనంద్‌కు సిద్దేశ్‌ లాడ్‌ (35), శార్దూల్‌ ఠాకూర్‌ (37), తనుశ్‌ కోటియన్‌ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్‌ రేఖడే 4, యశ్‌ ఠాకూర్‌, హర్ష్‌ దూబే తలో 2, దర్శన్‌ నల్కండే, భూటే చెరో వికెట్‌ పడగొట్టారు. 

రంజీల్లో ముంబై 49వ సారి ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో మరో ఒకటిన్నర రోజుల ఆట మిగిలి ఉంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement