Ranji semi final
-
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. -
రంజీ సెమీ ఫైనల్.. శతక్కొట్టిన యశ్ రాథోడ్.. భారీ ఆధిక్యం దిశగా విదర్భ
ముంబైతో జరుగుతున్న రంజీ సెమీ ఫైనల్-2లో విదర్భ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 113 పరుగుల ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం విదర్భ 340 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. యువ బ్యాటర్ యశ్ రాథోడ్ (110 నాటౌట్) ఈ సీజన్లో ఐదో సెంచరీతో కదంతొక్కి విదర్భను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. యశ్ రాథోడ్‌కు జతగా దర్శన్ నల్కండే (4) క్రీజ్‌లో ఉన్నాడు.147/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ.. కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహా రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు జోడించింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో అథర్వ్ తైడే 0, ధృవ్ షోరే 13, దనిశ్ మాలేవార్ 29, కరుణ్ నాయర్ 6, అక్షయ్ వాద్కర్ 52, హర్ష్ దూబే 1 పరుగు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 3, తనుశ్ కోటియన్ 2, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు. రంజీల్లో ముంబై 49వ సారి ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో మరో ఒకటిన్నర రోజుల ఆట మిగిలి ఉంది. -
బెంగాల్ విలవిల
ఇండోర్: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ సెమీస్‌లో తొలి రోజే మహారాష్ట్ర జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎడమచేతి పేసర్ సమద్ ఫల్లా నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో బెంగాల్ జట్టు కోలుకోలేక పోయింది. దీంతో శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను 41.4 ఓవర్లలో 114 పరుగులకు ముగించింది. ఫల్లా 58 పరుగులకు ఏడు వికెట్లు తీయడం విశేషం. ఓపెనర్ ఆరిందమ్ దాస్ (108 బంతుల్లో 37; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 29; 6 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మూడో ఓవర్ నుంచే ఫల్లా ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయడం ఆరంభించాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన బెంగాల్ ఏ దశలోనూ పోరాడలేక పోయింది. 13 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 78 పరుగుల శుభారంభం లభించినా స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఖురానా (53 బంతుల్లో 48; 10 ఫోర్లు), కేదార్ జాదవ్ (58 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ప్రస్తుతం క్రీజులో అంకిత్ బానే (74 బంతుల్లో 37 బ్యాటింగ్; 7 ఫోర్లు), మోత్వాని (8 బ్యాటింగ్) ఉన్నారు. దిండా, శుక్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి. పంజాబ్, కర్ణాటక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి మొహాలీ: మరో సెమీస్‌లో తలపడుతున్న పంజాబ్, కర్ణాటక జట్ల తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా ఆడేందుకు సాధ్యపడలేదు. ఉదయం నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. ఓ దశలో వర్షం ఆగినా కూడా ఆటకు అనుకూలమైన పరిస్థితి లేకుండా పోయింది. కనీసం టాస్ కూడా వీలు పడలేదు.