కాగజ్‌నగర్‌టౌన్ : అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కాగజ్‌నగర్ విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో) కార్యాలయంలో దాడులు నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం డిమాండ్ నోటిస్ ఇవ్వడానికి 20 వేల రూపాయలు లంచం తీసుకున్న రూరల్ ఇన్‌చార్జి ఏఈ వేణుగోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన పెకర శ్రీకాంత్ తన మినీ రైస్ మిల్లును గ్రామ శివారులోకి మార్చే క్రమంలో విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
రాస్పెల్లి మెయిన్ రోడ్డు వద్ద మినీ రైస్ మిల్లును ఏర్పాటు చేసి, త్రీఫేజ్ కరెంట్ షిఫ్టింగ్ కోసం ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రూరల్ ఇన్‌చార్జి ఏఈ వేణుగోపాల్ షిఫ్టింగ్ కోసం ఇచ్చే డిమాండ్ నోటీస్ ఇవ్వడానికి మొదట 35 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం శనివారం కార్యాలయంలో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఏఈ వేణుగోపాల్ డీఈఈ ఒత్తిడి మేరకే తాను రూ.20 వేలు అడిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. షిఫ్టింగ్ చేయడానికి డీఈఈ డబ్బులు అడిగినందుకే తాను పెరక శ్రీకాంత్‌ను తీసుకుని కార్యాలయానికి రావాలని సూచించినట్లు వివరించాడు. ఇదిలా ఉండగా.. ఈ అంశంలో డీఈఈ పాత్రపైనా విచారణ చేపడుతామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. ఇన్‌చార్జి ఏఈ వేణుగోపాల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ చెప్పారు. దాడిలో ఆదిలాబాద్ సీఐ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ సీఐ వీవీ రమణామూర్తితో పాటు సిబ్బంది వెంకటస్వామి, షేక్ జమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
లంచం అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి..
- అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ గౌడ్
కాగజ్‌నగర్ టౌన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో అవినితి పేరుకుపోయిందని, లంచం అడిగే అధికారులపై ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కరీంనగర్ రేంజి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ సూచించారు. శనివారం కాగజ్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశలవారీగా ఆయా శాఖల అధికారులపై నిఘా ఏర్పాటు చేసి వారి అక్రమాలకు చెక్ పెడుతామన్నారు. అనేక మండలాల్లో పహాని, పాస్ బుక్కులు, టైటిల్ బుక్కుల కోసం ఆయా తహశీల్దార్లు వీఆర్వోలపై డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా విలేజి రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడే సిబ్బందితోపాటు డబ్బుల కోసం ఒత్తిడి చేసే అధికారిపైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దళారులు ఎంతటివారైనా వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి, అక్రమాలు జరిగినా బాధితులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నేరుగా జిల్లాలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ నెంబర్ 9440446150 (డీఎస్పీ), 9440446153 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఎస్‌ఎంఎస్ పంపినా ఫర్వాలేదని పేర్కొన్నారు. ఈ మెయిల్ చేయొచ్చని అన్నారు.
ట్రాన్స్‌కో ఏఈకి ఏసీబీ షాక్
Published Sun, Nov 16 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement