సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అవినీతి నిరోధక శాఖ అంటే భయం వద్దు.. లంచం తీసుకునే వారిపై ధైర్యంగా మాకు ఫిర్యాదు చేయండి. మీ పెండింగ్ పనిని మేమే దగ్గరుండి పూర్తి చేయిస్తాం.’ అని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీఎస్పీ పి.ప్రభాకర్ పేర్కొన్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన పని పూర్తి కాదనే అపోహ ప్రజల్లో ఉందని, అలాంటి ఆందోళన నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నాటుకుపోయిన అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ ఏసీబీకి సహకరించాలని, లంచం పుచ్చుకునే ఉద్యోగి వివరాలు, తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే చాలని, మిగతా సంగతి తాము చూసుకుంటామన్నారు. కేవలం ప్రభుత్వం ఉద్యోగులపైనే కాదని, ప్రభుత్వ సంబంధిత పనులు చేపట్టే అందరిపైనా ఏసీబీకి అధికారం ఉందన్నారు.
బాధితులే డబ్బు సర్దుబాటు చేసుకోవాలి..
ఏసీబీకి ఫిర్యాదు చేస్తే చాలు డబ్బులు వాళ్లే సర్దుబాటు చేసుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ ఏసీబీ ఆ బాధ్యత తీసుకోదు. లంచం ఇచ్చే డబ్బులు బాధితులే సర్దుబాటు చేసుకోవాలి. అయితే ఆ డబ్బును వీలైనంత త్వరగా తిరిగి బాధితుడికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. గరిష్టంగా రెండు నెలల్లో బాధితుడికి సదరు డబ్బును ముట్టజెప్పుతాం అదేవిధంగా బాధితుడి పెండింగ్ పనిని సైతం మేమే పూర్తి చేయిస్తాం. ఇందుకు సంబంధిత అధికారులతో టచ్‌లో ఉండి పని పూర్తి చేసేందుకు ఒత్తిడి తెస్తాం.
ప్రభుత్వ ప్రమేయమున్న ప్రతీ వ్యక్తిపైనా..
అవినీతి నిరోధక శాఖ పరిధిలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు.. సర్కారు నిధులను ఖర్చు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిపైనా దాడులు చేస్తాం. బాధితులు మాత్రం స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలి. ఏసీబీ చరిత్రలోనే మొదటగా.. ధారూరు మండలంలోని ఒక సర్పంచ్‌పై దాడి చేసి కేసు నమోదు చేశాం.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 మందిపై ఏసీబీ దాడులు నిర్వహించగా.. శేరిలింగంపల్లి మున్సిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్ అధికారి రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ లంచం (రూ.2 లక్షలు) తీసుకున్న వ్యక్తిగా రికార్డుకెక్కారు. కేవలం కార్యాలయంలో ఉన్నప్పుడే కాకుండా ఎక్కడైనా లంచం తీసుకుంటే చాలు నేరుగా రైడ్ చేస్తాం.
అక్రమాస్తులున్నా ఫిర్యాదు చేయొచ్చు..
లంచం తీసుకున్నప్పుడే ఏసీబీకి పట్టించాలనుకోకుండా.. ఇతర పద్ధతుల్లోనూ పట్టించవచ్చు. కొందరు లంచం కాకుండా ఇతర రూపాల్లో ముడుపులు తీసుకుంటారు.
అలాంటి వాళ్లను అక్రమాస్తుల కోణంలో ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఏసీబీకి ఇచ్చే ఆధారాల్లో స్పష్టత ఉంటే సులువుగా పట్టుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాల్లో లంచాలు ఎక్కువగా ఇస్తుంటారు. వారిపై ఫిర్యాదు చేయడం అరుదు. అయితే ఎక్కువగా డబ్బులు వసూళ్లు జరిగే అంశంపైనా మాకు ఫిర్యాదు చేయొచ్చు. మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్‌బీనగర్ మున్సిపాలిటీ, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల్లో దాడులు చేశాం. అవినీతి జరిగే చోటును, వివరాలను నేరుగా నా మొబైల్ నంబర్ 94404 46140కు ఫోన్ చేసి చెప్పండి.
సిబ్బంది కొరతతో కొంత ఇబ్బందులు..
ఏసీబీ ఆధ్వర్యంలో దాడుల ప్రక్రియను మరింత పెంచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అయితే మాకు సిబ్బంది కొరత వేదిస్తోంది. అరకొర సిబ్బందిలో రెగ్యులర్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లు కోర్టులకు హాజరుకావడం, మరికొందరు కార్యాలయంలో మెమోలు, చార్జిషీట్లు దాఖలు చేసే పనిలో ఉండడంతో ఆకస్మిక దాడులు చేసే సమయం దొరకట్లేదు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తాం. అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ఈ నెల 3 నుంచి 9వరకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభాకర్ తెలిపారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయండి
Published Sun, Dec 7 2014 11:59 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement