సంజీవ్‌కుమార్
సాక్షి, అమరావతి/విశాఖ క్రైం : విశాఖ కేంద్రంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై శనివారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరు వీఆర్వోలు, ఒక జీవీఎంసీ జోన్–3 చైన్మెన్‌ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. చిన్న అధికారులే అయినా వారి ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. ఆస్తుల విలువను రికార్డుల ప్రకారం వెల్లించిన ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్లో వాటి విలువ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఆ ముగ్గురిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం కోర్టుకు హాజరుపరచనున్నట్టు తెలిపారు.
వీఆర్వో సంజీవ్‌కుమార్ ‘భూమ్ ఫట్’..
ప్రభుత్వ సర్వీసులో 2008 మే 30న చేరిన కాండ్రేగుల సంజీవ్‌కుమార్ ప్రస్తుతం విశాఖ నగర పరిధిలోని మల్కాపురం సబ్‌డివిజన్ ములగాడ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అయన ఏకంగా తహసీల్దార్ పేరిట ఓ కారు వినియోగిస్తూ రూ. కోట్ల ఆస్తులు సంపాదించాడు. అనకాపల్లిలోని అతని ఇంట్లో డమ్మీ పిస్టల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. కాగా,అతని మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.3 కోట్ల 77లక్షల 12 వేలుగా లెక్కించగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.70 కోట్లకు పైమాటేనని అంచనా.
నాలుగు చోట్ల సోదాలు: ప్రభుత్వ సర్వీసులో 2008 మే 30న చేరిన పోలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖ అర్బన్ మండలంలోని మద్దిలపాలెం వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటితోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రికార్డుల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.కోటి 11 లక్షల 25వేల ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
చైన్‌మన్ నాగేశ్వరరావు ఆస్తులపై దాడులు..
ప్రస్తుతం జీవీఎంసీ(విశాఖ) జోన్–3 చైన్మన్‌గా పనిచేస్తున్న మునికోటి నాగేశ్వరరావు 1997లో సర్వీసులో చేరారు. ఆయన ఆస్తుల విలువ రికార్డుల ప్రకారం రూ.కోటి 31లక్ష 66వేలు ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. 15 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా
Comments
Please login to add a commentAdd a comment