పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం కార్యాలయం
అబ్దుల్లాపూర్‌మెట్ (పెద్దఅంబర్‌పేట): మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ప్రవాస భారతీయుడిని కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి కలసి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కమిషనర్ రూ.1.5 లక్షలు తీసుకోగా.. తన వాటాను మధ్యవర్తికి ఇవ్వాలని చెప్పి టీపీఓ లిప్తపాటు కాలంలో తప్పించుకున్నాడు. కుంట్లూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సురభి వెంకట్‌రెడ్డికి తన తండ్రి నుంచి సంక్రమించిన 300 గజాల స్థలంలోని పాత ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణం చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రావు, టీపీఓ రమేశ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కుంట్లూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తమకు ఫిర్యాదు చేశారంటూ పలుమార్లు నోటీసులు పంపించి సిబ్బందితో పనులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు కమిషనర్ రవీందర్‌రావు, టీపీఓ రమేశ్‌ను సంప్రదించగా రూ.2.5 లక్షలు (కమిషనర్‌కు రూ.1.5 లక్షలు, టీపీఓకు రూ.లక్ష) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట కార్యాలయంలోనే వెంకట్‌రెడ్డి నుంచి కమిషనర్ రవీందర్‌రావు రూ.1.5 లక్షల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. టీపీఓ తన వాటాను మధ్యవర్తి అయిన లైసెన్స్‌డ్ ప్లానర్ ఆదినారాయణ రూ.లక్ష తీసుకుంటుగా అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ రవీందర్‌రావుతోపాటు ఆదినారాయణపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment