Pedda Amberpet
-
కారు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసిన సీఐ.. కానీ..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుల కారణంగా ఎంతో మంది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. పెద్ద అంబర్‌పేట వద్ద ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో, బాధితుడు స్పృహాలోకి వచ్చాడు. అనంతరం, బాధితుడిని స్థానిక వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి చేరుకునేలోపే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు బీభత్సం
-
పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
-
TS: పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. గోడౌన్ నుంచి భారీ శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి
సాక్షి, హయత్‌నగర్/రామగిరి(నల్లగొండ): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలితోపాటు ఆమె భర్త మృతిచెందారు. పోలీసుల కథ నం ప్రకారం నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి చెంది న దొంతం కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్పల్లి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) బిల్డర్. హైదరాబాద్‌లో మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్ సమీపంలో వీరు ఉంటున్నారు. కూతురు వివాహంకోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్‌లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చేందుకు రాత్రి 8.30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌లోని ఔటర్ రింగురోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ పాడె మోస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిప్పర్ కింద ఇరుక్కుపోయిన వాహనం.. టిప్పర్‌ను స్కార్పియో వాహనం వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చిందని, అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కూతురి వివాహం.. అంతలోనే విషాదం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఎంబీబీఎస్ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడం అందరిని కలచి వేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు మృతులకు నివాళులర్పించారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
అబ్దుల్లాపూర్‌మెట్ (పెద్దఅంబర్‌పేట): మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ప్రవాస భారతీయుడిని కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి కలసి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కమిషనర్ రూ.1.5 లక్షలు తీసుకోగా.. తన వాటాను మధ్యవర్తికి ఇవ్వాలని చెప్పి టీపీఓ లిప్తపాటు కాలంలో తప్పించుకున్నాడు. కుంట్లూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సురభి వెంకట్‌రెడ్డికి తన తండ్రి నుంచి సంక్రమించిన 300 గజాల స్థలంలోని పాత ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణం చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుంట్లూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తమకు ఫిర్యాదు చేశారంటూ పలుమార్లు నోటీసులు పంపించి సిబ్బందితో పనులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్‌ను సంప్రదించగా రూ.2.5 లక్షలు (కమిషనర్‌కు రూ.1.5 లక్షలు, టీపీఓకు రూ.లక్ష) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట కార్యాలయంలోనే వెంకట్‌రెడ్డి నుంచి కమిషనర్ రవీందర్రావు రూ.1.5 లక్షల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. టీపీఓ తన వాటాను మధ్యవర్తి అయిన లైసెన్స్డ్ ప్లానర్ ఆదినారాయణ రూ.లక్ష తీసుకుంటుగా అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ రవీందర్రావుతోపాటు ఆదినారాయణపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
'ప్రాజెక్టుల పేరుతో మైహోంకు దోచిపెడుతున్నారు'
సాక్షి, రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద ప్రజలపై ప్రేమ లేదని, ప్రాజెక్టుల పేరుతో మైహోం రామేశ్వర్‌రావుకు దోచిపెడుతున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి అభివృద్ధి పేరుతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్ కింద మార్చారని విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ మూసీ ప్రక్షాళలను గాలికి వదిలేసారని దుయ్యబట్టారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుండే కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని, మూసీ ప్రక్షాళనకు ప్రధాని మోదీని కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. కాగా మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఆరుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు తీసుకువచ్చానని స్పష్టం చేశారు. తాను కేంద్రం వెంటపడి ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట నుంచి అందోల్ మైసమ్మ గుడి వరకు ఎనిమిది లైన్ల రోడ్డును తెచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. (కేటీఆర్‌కు కాంగ్రెస్ గురించి బాగా తెలుసు : కోమటిరెడ్డి) -
అందుకే అక్కడికి వెళ్లాడు: సురేశ్ భార్య
పెద్దఅంబర్‌పేట: తన భర్త సురేశ్ తహసీల్దార్‌ను హత్య చేయడానికి వెళ్లలేదని, ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నాడని.. ఈ విషయం ఆస్పత్రిలో తనతో చెప్పాడని సురేశ్ భార్య లత వెల్లడించింది. శుక్రవారం ఆమె గౌరెల్లిలో విలేకరులతో మాట్లాడింది. తహసీల్దార్‌కు లంచం ఇచ్చానని, మిగిలిన డబ్బులు ఇళ్లు అమ్మి ఇస్తానని ఒప్పుకున్నట్లు సురేశ్ తనతో చెప్పాడని వెల్లడించింది. తహసీల్దార్ మేడమ్ వినకపోవడంతోనే ఆమెను హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పాడని తెలిపింది. తమ భూముల వివాదాలను అధికారులే తేల్చాలని లత వేడుకుంది. 1950 నుంచి తమ భూములను తామే సాగుచేసుకుం టున్నామని, అప్పటి నుంచి లేని సమస్యలు ఇప్పుడెందుకు వచ్చాయని సురేశ్ తండ్రి కృష్ణ ప్రశ్నించారు. సమస్యలన్నీ అధికారులే సృష్టించారన్నారు. తమ తండ్రి కూర వెంకయ్య పేరుతో అధికారులు గతంలోనే పట్టా పాసుపుస్తకాలు ఇచ్చారన్నారు. అయితే, 2016లో వాటిని రద్దు చేశారని తెలిపారు. కాగా అబ్దుల్లార్‌పూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని సురేశ్ అనే రైతు సోమవారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించానని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. -
పెద్ద అంబర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లోడ్ లారీ ప్రమాదవశాత్తు టైర్లు విరగడంతో డివైడర్ పైకి ఎక్కి.. ఎడమవైపు నుంచి వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ సహాయంతో లారీని పోలీసులు తొలగిస్తున్నారు. -
అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చి..
పెద్దఅంబర్‌పేట : తన సోదరుడిని పాఠశాలకు పంపించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి బాలుడిని రెప్పపాటులో మృత్యువు కబలించింది. ప్రతి రోజూ స్కూల్ బస్సు వరకు వచ్చి అన్నకు టాటా చెప్పే ఆ చిన్నారిని అదే స్కూల్ బస్సు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లిన దుర్ఘటనను ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపే బుడిబుడి అడుగులు వేస్తూ చిట్టిపొట్టి మాటలతో ఆడుకునే తన ముద్దుల కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన స్థానికులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్ హయత్‌నగర్‌లోని శాంతినికేతన్ స్కూల్లో చదువుతుండగా, రెండోవాడు తన్వీష్ (3) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బస్సు చక్రం కిందపడి.. తన కుమారుడిని స్కూల్‌కు పంపించేందుకు రోజు మాదిరిగానే స్కూల్ బస్సు ఎక్కించేందుకు స్వాతి మంగళవారం ఉదయం 7:40గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి బస్సు దగ్గరికి వెళ్లింది. జశ్వంత్‌ను బస్సులో ఎక్కించే క్రమంలో తల్లి పక్కనే ఉన్న తన్వీష్ బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా స్కూల్ బస్సు ఒక్కసారిగా ముందుగా కదిలింది. దీంతో బస్సు కింద పడిని తన్వీష్‌పై నుం చి ముందు చక్రం వెళ్లడంతో తలకు తీవ్రగాయా లై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఎక్కడ ఉ న్నాడని చూసేలోపే స్వాతికి తన కుమారుడు విగతజీవిగా పడి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా స్వాతి కుప్పకూలిపోయింది. తన చిన్న కొడుకు మృతి చెందాడన్న చేదు నిజాన్ని భరించలేక రోదిస్తున్న తీరు స్థానికుల కంట నీరు పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు
పెద్దఅంబర్‌పేట: ఇంటర్నెట్ కేంద్రంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌ట్యాప్, మూడు సెల్పోన్లు, రూ.6వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన తంగిరాల ఎల్లయ్య కుమారుడు తంగిరాల నాగేష్ అలియాస్ నాగ గత కొన్ని నెలలుగా అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంలో డాట్ ఇంటర్నెట్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అయితే సమీపంలో ఉన్న నోవా కళాశాలకు చెందిన నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేస్తూ ఒక్కోకార్డుకు రూ.500 వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటూ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రామకృష్ణాపురంకు చెందిన నీరటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు నీరటి రఘుపతి అలియాస్ రఘుకు నాగేష్తో పరిచయం ఏర్పడింది. దీంతో కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేస్తే డబ్బు సంపాదించవచ్చునని రఘు.. నాగేష్తో చెప్పడంతో అందుకు అంగీకరించిన నాగేష్ సర్టిఫికెట్లు తయారు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు బుధవారం నెట్ సెంటర్‌పై దాడి చేయగా ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 11 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, రూ.6వేల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించారు. -
పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదం
-
కాలేజి బస్సు బీభత్సం...బాలిక దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పెద్దఅంబర్‌పేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఒక కళాశాల బస్సు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒక బాలిక మృతిచెందడంతోపాటు పలు బైకులు ధ్వంసమయ్యాయి. సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పెద్ద అంబర్‌పేటవద్ద అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కనున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్ళింది. దాంతో రహదారి పక్కన ఉన్న మధుశాలిని(12) అనే బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో మూడు హైక్‌లు ధ్వంసమయ్యాయి. బస్సు దూసుకురావడంచూసి పాదచారులు పరుగులుతీశారు. -
రూ. 4 కోట్ల సిగరెట్లు దోపిడీ
సిగరెట్ల లారీని అటకాయించి బెదిరింపులు డ్రైవర్‌ను కొట్టి.. సమీపంలోని గుట్టల్లోకి లారీని తీసుకెళ్లి మరో లారీలోకి సరుకంతా మార్చేసుకున్న దుండగులు రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.. చౌటుప్పల్, హైదరాబాద్: శనివారం అర్ధరాత్రి.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి.. దారిపక్కన రెండు సుమోలు కాచుకుని ఉన్నాయి.. వాటిల్లో ఉన్న 20 మంది అటుగా వస్తున్న ఓ లారీని అటకాయించారు.. డ్రైవర్‌ను చితకబాది లారీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. అందులోని రూ.4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్నారు.. అప్పటికే సిద్ధం చేసుకున్న మరో లారీలోకి ఆ సిగరెట్ల పెట్టెలను వేసుకుని ఉడాయించారు.. నిత్యం రద్దీగా ఉండే రంగారెడ్డి జిల్లా పెద్దఅం బర్పేట వద్ద పక్కాగా సినీ ఫక్కీలో ఈ సంచలన దోపిడీ జరగడం గమనార్హం. పక్కా ప్రణాళికతో.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఐటీసీ కంపెనీ నుంచి శనివారం అర్ధరాత్రి ఒక లారీ సిగరెట్ల కాటన్లను తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు బయలుదేరింది. జాతీయ రహదారిపై పెద్ద అం బర్పేట వద్ద నిర్మానుష్య ప్రాంతానికి ఆ లారీ చేరుకోగానే.. అప్పటికే అక్కడ కాపుకాస్తున్న సుమారు 20 మంది దుండగులు దానిని ఆపారు. బిహార్‌కు చెందిన డ్రైవర్ అఖిలేశ్‌యాదవ్ (35)ను చితకబాది లారీని లాక్కున్నారు. ఈ లారీతో పాటు తాము అప్పటికే సిద్ధం చేసుకున్న కంటైనర్ లారీని తీసుకుని చౌటుప్పల్ ప్రాంతం వైపు వచ్చారు. ఇంకా ముందుకు వెళ్తే టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రమాదం ఉంటుందని గ్రహించి... దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతం వైపు తీసుకెళ్లారు. సిగరెట్లన్నింటినీ వేసుకుని.. దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతంలో రెండు లారీలను నిలిపి.. సిగరెట్ల కాటన్లను తమ కంటైనర్ లారీలోకి మార్చుకున్నారు. లారీ డ్రైవర్ కళ్లకు గంతలు కట్టి.. చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ లారీని చౌటుప్పల్ వైపు తీసుకొచ్చి ఖైతాపురం వద్ద వదిలేశారు. తమ కంటైనర్‌ను తీసుకుని పారిపోయారు. అయితే చివరకు ఎలాగో కట్లు విప్పుకున్న లారీ డ్రైవర్ అఖిలేశ్‌యాదవ్.. సమీపంలోని దాబా హోటళ్ల వద్దకు చేరుకుని, వారి సాయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రాచకొండ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి, క్రైం డీసీపీ జానకి, భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి తదిత రులు ఘటనా స్థలాన్ని సందర్శించి.. వివరాలు సేకరించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకొ నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దొంగలు పాతవారేనా? కొత్తగా ఏదైనా ముఠా ఈ ప్రాంతానికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది రెండో ‘సిగరెట్’ దోపిడీ 2012 అక్టోబర్ 18న చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం శివారులో కూడా సిగరెట్ల లారీ చోరీకి గురైంది. అప్పట్లో రూ.19 లక్షల విలువైన సిగరెట్లను దోచుకెళ్లారు. దీనికి పాల్పడిన 11 మంది దొంగలను పోలీసులు అదే ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. వారంతా నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెం, చింతపల్లి మండలాలకు చెందినవారే. -
డ్రైవర్‌ను కొట్టి.. రూ. 4 కోట్ల సిగరేట్లు దోపిడీ
హైదరాబాద్: నగర శివారులో బారీ దోపిడీ జరిగింది. రూ. 4 కోట్ల విలువైన సిగరెట్లతో వెళ్తున్న కంటైనర్‌ను కొందరు దుండగులు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను చితకబాది తమతో పాటు తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను నింపుకొని పరారయ్యారు. వివరాలీవి.. ముషీరాబాద్ నుంచి తిరుపతికి సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను పెద్ద అంబర్పేట్ వద్దకు రాగానే దుండగులు రెండు సుమోలతో అడ్డగించారు. మల్కాపూర్ శివారులో డ్రైవర్‌ను కిందకు దించి ఓ సుమోలో ఎక్కించుకొని వెళ్లి అడవిలో వదిలేసి వచ్చారు. అనంతరం తమతో తెచ్చుకున్న మరో కంటైనర్‌లో సిగరెట్లను లోడ్ చేసుకుని పరారయ్యారు. ఈ దోపిడీలో సుమారు 20 మంది దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ చొట్టుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. -
పెద్దఅంబర్ పేట్లో కారు బీభత్సం
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నవారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నగరంలోని పెద్ద అంబర్‌పేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. లాలాపేట్‌కు చెందిన తల్లీకూతుళ్లు శ్రీదేవి(35), సంజనా(6)లు దసరా సెలవుల సందర్భంగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడానికి రోడ్డుపైన బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసే సమయానికి కారులోని వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలోని పెద్ద అంబర్ పేట సమీపంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ఆర్టీఏ దాడులు : ప్రైవేట్ బస్సులపై కేసులు
హైదరాబాద్ : పెద్ద అంబర్‌పేట్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
పెద్ద అంబర్పేట్ (రంగారెడ్డి జిల్లా) : పెద్ద అంబర్పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్ రూ.13,000 లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అనంతుల రవీందర్.. కుంట్లూర్ సమీపంలో ఉన్న తన అరెకరం పొలంలో కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభులాల్ లంచం అడగడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగారెడ్డి, సైబరాబాద్ ఏసీబీ డీఎస్పీ ఎమ్ ప్రభాకర్ బృందం రవీందర్ లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి
హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది. ఆ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం విటాయ్పల్లి గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు డా.శరత్మోహన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శరత్మోహన్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.