నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన యువకులు
పెద్దఅంబర్‌పేట: ఇంటర్నెట్ కేంద్రంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌ట్యాప్, మూడు సెల్‌పోన్లు, రూ.6వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన తంగిరాల ఎల్లయ్య కుమారుడు తంగిరాల నాగేష్ అలియాస్ నాగ గత కొన్ని నెలలుగా అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంలో డాట్ ఇంటర్‌నెట్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అయితే సమీపంలో ఉన్న నోవా కళాశాలకు చెందిన నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేస్తూ ఒక్కోకార్డుకు రూ.500 వసూలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటూ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రామకృష్ణాపురంకు చెందిన నీరటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు నీరటి రఘుపతి అలియాస్ రఘుకు నాగేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేస్తే డబ్బు సంపాదించవచ్చునని రఘు.. నాగేష్‌తో చెప్పడంతో అందుకు అంగీకరించిన నాగేష్ సర్టిఫికెట్లు తయారు చేయడం ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు బుధవారం నెట్ సెంటర్‌పై దాడి చేయగా ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 11 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, రూ.6వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment