అవినీతిపై పోరులో ప్రాణాలను సైతం లక్ష్యపెట్టను: కేజ్రీవాల్
అవినీతిపై పోరాడే క్రమంలో ప్రాణాలు సైతం లెక్క చేయనని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అంతేకాని అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వీర్యమైందని ఆయన ఆరోపించారు. ఏసీబీకి నూతన జవసత్వాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అందుకోసం సమర్థవంతమైన అధికారులతో ఏసీబీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వివరించారు.
అవినీతి నిరోధక శాఖలో ఒక్కసారి సమర్థవంతమైన అధికారులను నియమిస్తే అవినీతి తిమింగలాల పని పట్టడం చాలా
సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 'ఆప్'ని విస్తరించేందుకు ఇప్పటికే కేజ్రీవాల్ ముమ్మర ఏర్పాట్లులో నిమగ్న మైయ్యారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ వెల్లడించారు.