కరీంనగర్: ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్వో) కొమరం బాలు గత రాత్రి ఏసీబీకి చిక్కాడు. దీంతో ఏసీబీ అధికారులు కరీంనగర్, వరంగల్లోని కొమరం బాలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 50 లక్షల నగదుతోపాటు అర కిలో బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొమరం బాలు అతడి కుటుంబ సభ్యులకు దాదాపు 10కిపైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆ లాకర్లను ఒకటి రెండు రోజుల్లో తెరవనున్నట్లు తెలిపారు.
వీణవంకలో విధులు నిర్వహిస్తున్న అనస్థీషియా వైద్యుడు ఎన్. సుధాకర్కు ఇటీవల చీర్లవంక బదిలీ అయింది. అయితే తన బదిలీని రద్దు చేసి స్వస్థలంలోనే విధులు నిర్వహించేలా కొనసాగించాలని జిల్లా డీఎం అండ్ హెచ్వోను కలిశారు. ఆ క్రమంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. తాను రూ. 60 వేల మాత్రమే ఇవ్వగలనని తెలిపారు. అందుకు డీఎంహెచ్వో అంగీకరించాడు. దాంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారుల వల వేసి డీఎంహెచ్వోను పట్టుకున్నారు. ఆ వ్యవహారంలో పాత్ర ఉన్న జూనియర్ అసిస్టెంట్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.