ముంబై: అవినీతిపరులపై ఎవరో ఒకరు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు తగిన చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మహారాష్ట్ర ఏసీబీ చీఫ్‌గా గత అక్టోబర్‌లో ప్రవీణ్ దీక్షిత్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ శాఖ పనితీరు మారింది. ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ‘ఫిర్యాదు వచ్చేంతవరకు ఆగొద్దు.. అవినీతిపరుడని తెలిస్తే చాలు.. అతడిపై నిఘా పెట్టి సరైన సమయంలో అదుపులోకి తీసుకోండి..’ అని బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే దీక్షిత్ తన కింది అధికారులకు సూచించారు. ‘కొనుగోలుదారుల కోసం వేచి చూసే దుకాణ యజమానిలా కాకుండా.. అవినీతిపరుడిని వెంటాడు..’ అని ఆయన చెప్పారు. గత మూడు నెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) నెలల్లో ఏసీబీ 250 కేసులను నమోదు చేసింది. ఇదే సమయంలో గత ఏడాది 160 కేసులు మాత్రమే నమోదవడం గమనార్హం. లంచగొండి అధికారులను గుర్తించేందుకు ప్రస్తుతం ఏసీబీ రహస్య దర్యాప్తు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా పెడుతున్నారు. ఒకసారి ఎవరిపైనైనా అనుమానం వస్తే చాలు.. అతడు ఎవరిని లంచం కోసం ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయమై ఆధారాలు సేకరించి, నిందితుడిని పట్టుకునేందుకు అప్పుడు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని ముందడుగు వేస్తున్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అధికారిగా పనిచేసిన దీక్షిత్ ఏసీబీకి ఉన్నతాధికారిగా రాగానే తనదైన శైలిలో పనిచేయడం ప్రారంభించారు. ‘అవినీతిపరులను గుర్తించడమే కాదు.. సామాన్య ప్రజల్లో విశ్వాసం పెంచిన రోజే అవినీతిని అంతమొందించగలుగుతాం..’ అని తన కింది అధికారులకు నూరిపోస్తున్నారు. ‘పోలీస్, ఏసీబీ వంటి శాఖల వద్దకు వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకునేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు. మన శాఖ తీరుపై వారికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించి, మన దగ్గరకు ధైర్యంగా రాగలిగేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. ‘అందుకే వారు వచ్చి మనకు ఫిర్యాదు చేసేంతవరకు ఆగొద్దు.. మనమే బాధితుల వద్దకు వెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలి’ అని దీక్షిత్ చెప్పారు. కాగా, ముంబై ఏసీబీ కార్యాలయంలో 26 మంది దర్యాప్తు అధికారులున్నారు.
వీరు నిత్యం 70 ప్రభుత్వ కార్యాలయాల్లో నిఘా పెట్టాల్సి ఉంటుంది. ‘మేం నిత్యం ఆయా కార్యాలయాలకు ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏదో పని ఉండి వచ్చినట్లు సిబ్బందిని నమ్మించగలగాలి. ఏసీబీ అధికారిగా ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తపడాలి. అక్కడ ఎవరైనా లంచం తీసుకుంటున్నారని అనుమానం వస్తే.. వెంటనే సదరు బాధితుడి వద్దకు వెళ్లి వారిని ఫిర్యాదు ఇచ్చేలా ఒప్పించాలి..’ అని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు. అంధేరిలో టూరిస్ట్ ఆపరేటర్ నుంచి రూ.1,800 లంచం తీసుకుంటుండగా మంగళవారం ఆర్టీవో కార్యాలయ క్లర్క్ రాజేష్ శంకర్ నెవ్రేకర్, అతడి సహాయకుడిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నవంబర్ నుంచి టూరిస్ట్ ఆపరేటర్‌ను సదరు క్లర్క్ లంచం కోసం వేధిస్తుంటం గమనించిన మఫ్టీలోని ఏసీబీ దర్యాప్తు అధికారి.. పథకం ప్రకారం వ్యవహరించడంతో క్లర్క్‌ను పట్టుకోగలిగామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, తమ సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల్లో నిఘా పెట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వ అధికారులను దీక్షిత్ హెచ్చరించారు.
అవినీతి వెంటపడదాం
Published Thu, Jan 2 2014 11:04 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement