ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
ఉట్నూర్ : ఉట్నూర్ తహశీల్దార్ ఎండీ అర్షద్ రహమాన్ మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి. ఆగస్టు 19న ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆన్‌లైన్‌లో డాటా ఎంట్రీ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉట్నూర్ డివిజన్‌లోని నార్నూర్, జైనూ ర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, ఉట్నూర్, కెరమెరి మండలాలకు చెందిన సర్వేను ఆన్‌లైన్ డాటా ఎంట్రీ చేయడానికి ఉట్నూర్ మండల కేంద్రంలోని క్లాసిక్ కంప్యూటర్స్ నిర్వాహకుడు సయ్యద్ నసీర్ తీసుకున్నాడు.
ఉట్నూర్ మండలంలోని దాదాపు 54 వేల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయడానికి రూ.76 వేలు బిల్లు అయింది. ఇందులో రూ.35 వేలు చెల్లించిన తహశీల్దార్ మిగతా రూ.41 వేలు చెల్లించడానికి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సయ్యద్ నసీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో తహశీల్దార్ రూ.10 వేలు లంచం తీసుకుని ఉట్నూర్ వైపు కారులో వస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా, కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎవరైన లం చం అడిగితే 9440446150, 9440446153కి ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు.