సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు తీయడానికి లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పైసలు కట్టినా యూనిట్లు సకాలం లో యూనిట్లు ఇస్తారా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10వేల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 500 మంది మాత్రమే డీడీలు తీశారు. జిల్లాలో తొలి విడతలో 9,687 యూనిట్లు, రెండో విడతలో 9,655 యూనిట్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. మొదటి విడత గ్రామాల్లో పంపిణీ పూర్తికాగా మునిసిపాలిటీ పరిధిలో 736 యూనిట్లకు అనుమతి రాకపోవడంతో అవి అలాగే ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీఓ 74తో మునిసిపాలిటీల్లోనూ లబ్ధిదారులకు గొర్రెలు అందించేందుకు అనుమతి నిచ్చింది. వీటిని రెండో విడతలో కలిపి 10,391 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
లబ్ధిదారుల్లో అనుమానాలు..
రెండో విడత సబ్సిడీ గొర్రెల యూనిట్లను తీసుకోవాలనుకునే వారిని అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని నాలుగు నెలలుగా గ్రామాల్లో చర్చజరుగుతుండడంతో లబ్ధిదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు డబ్బులు కడితే ఎప్పుడో యూనిట్లు ఇస్తారని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల అనంతరం ఈ పథకం ఉంటుందా.. లేదా? అని అనుమాన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా మంది డీడీలు తీయడానికి వెనకాడుతున్నారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని సంబంధిత అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
ఎన్నికల సమయంలో నెల లేదా రెండు నెలలు మాత్రమే పథకానికి తాత్కాలికంగా విరామం ఉంటుందని ఆ తర్వాత నుంచి డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రెలు అందిస్తామని చెబుతున్నారు. రెండో విడత గొర్రెల యూనిట్లను 2019 జూలై నాటికి పంపిణీ చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పంటలకే పెట్టుబడి పెడుతున్నారు. దీంతో తీరికగా డీడీలు కట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొనుగోలులో సాంకేతికత..
సబ్సిడీ గొర్రెల విషయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ సారి పటిష్ట్ట ప్రణాళికలతో అధికారులు సిద్ధమవుతున్నారు. గొర్రెల కొనుగోలు విషయంలో సాంకేతికతను ఉపయోగించనున్నారు. జీవాలను కొనుగోలు చేసిన వెంటనే ప్రత్యక్షంగా ఫొటో తీసీ అప్‌లోడ్ చేయాల్సి చేయనున్నారు. లబ్ధిదారుడి వివరాలు, జీవాలు కొనుగోలు చేసిన ప్రాంతం, విక్రయించిన వ్యక్తి తదితర వివరాలు అప్పటికప్పుడే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచేలా ప్రణాళికలు రచించారు.
ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఉన్న చోటు నుంచి వివరాలు, ఫొటోలు పంపాల్సిందే. ఒకవేళ సిగ్నల్ లేకపోతే మరుసటి రోజువరకు ఆగాల్సిందే. గొర్రెలను తరలించే వాహనానికి జీపీఎస్ అమర్చనున్నారు. దీనివల్ల కొనుగోలు ప్రాంతం నుంచి స్వస్థలానికి వచ్చే వరకు వాహనం ఎటువెళ్తోందనే విషయం అధికారులకు తెలుస్తుంది. దీంతో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు..
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లబ్ధిదారులకు దూరాభారం తప్పేలా లేదు. ఇంతకు ముందు జిల్లాలోని లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల వారు అనంతపురం వెళ్లి గొర్రెలను తీసుకువచ్చాక భూపాలపల్లి జిల్లా వారు వెళ్లడంతో నాణ్యమైన గొర్రెలు లభించలేదనే అపవాదు ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఈ సారి మహారాష్ట్రలోని పూణే ప్రాంతం నుంచి గొర్రెలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జూలై లోపు పంపిణీ పూర్తి చేస్తాం..
వచ్చే ఏడాది జూలై చివరి వరకు లబ్ధిదారులందరికీ గొర్రెల యూనిట్లు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాకు మొదటి విడత అనంతపురం నుంచి జీవాలను తీసుకువచ్చాం. రెండో విడతలో మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఎన్నికలు ఉన్నప్పటికీ పంపిణీకి ఏలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్నికల షెడ్యూల్ కాలంలో మాత్రమే పంపిణీ తాత్కాలికంగా జరగదు. తర్వాత కొనసాగుతుంది. – బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
నాణ్యమైన గొర్రెలు అందించాలి
ఇప్పటికే రెండో విడత యూనిట్ల పంపిణీ అలస్యమైంది. నాణ్యమెన గొర్రెలు అందిస్తే బాగుంటుంది. గత విడతలో గ్రామాల్లో ఇచ్చారు. ఈ సారి భూపాలపల్లి మునిసిపాలిటీ ప్రాంతంలోని లబ్ధిదారులకు యూనిట్లు అందించాలి. – గుండబోయిన రాజైలు, వేశాలపల్లి, భూపాలపల్లి
Comments
Please login to add a commentAdd a comment