సబ్సిడీ గొర్రెలు
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలసమైంది. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. ఎన్నో ఆపసోపాలు పడి, ఆరోపణలు ఎదుర్కొని తొలి విడత గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది జూన్ 20న గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూ నిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించారు. జిల్లాలో 133 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. ఇందులో 8,590 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 4,323 యూనిట్లకు గాను 4,282 యూనిట్లు పంపిణీ చేశారు.
ఈ యూనిట్లలో 3,880 గొర్రెలు చనిపోగా 2,100 గొర్రెలకు బీమా మంజూరైంది. తొలి విడత కోసం అధికారులు మూడు నెలల పాటు మహారాష్ట్రకు వెళ్లి నానా తిప్పలు పడి గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గొర్రెలు వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని యూనిట్లలో రోగాలతో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకోవాల్సి వచ్చింది. రెండో విడతలో 4267 యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సారి లబ్ధిదారుల సమక్షంలోనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. తొలివిడతలో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి రెండో విడత గొర్రెల పంపిణీ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మరింత ఆలస్యం..
జూలై 2నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జూలై 2న పంపిణీ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో రవాణా వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని చివరకు గొర్రెలు కొనుగోలు చేసే రోజు చేతులెత్తేయడంతో అధికారులు అకోలిలోనే వాహనాలు మాట్లాడుకొని తీసుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి రాకుండా ఉండేందకు ట్రాన్స్‌పోర్టు కోసం ముందుగా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయి, గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే మరో 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో గొర్రెలు పంపిణీ చేస్తే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది సైతం వ్యాధులతో చాలా గొర్రెలు మృతి చెందాయి.
సమస్యలు అధిగమించేనా..
మొదటివిడత గొర్రెల పంపిణీలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలోని అకోల, బుల్తానా, తులియ, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగబాద్ వంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో సమయానికి గొర్రెలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. దొరికిన గొర్రెలు సైతం కొన్ని చిన్నవిగా ఉండడం, కొన్ని ముసలి గొర్రెలు ఉండడంతో అప్పట్లో లబ్ధిదారులు అనాసక్తి చూపారు. అయినా ఏదోవిధంగా వారిని ఒప్పించిన అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. తొలి విడతలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, కొంత మంది లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు గొర్రెలకు వ్యాధులు సోకి మృత్యువాత పడ్డాయి. కొన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య కూడా ఏర్పడి పోషణ భారంగా మారి అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడతల ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో విడత పంపిణీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment