welfare associations
-
గొర్రెలు ఎప్పుడొస్తాయో?
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలసమైంది. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. ఎన్నో ఆపసోపాలు పడి, ఆరోపణలు ఎదుర్కొని తొలి విడత గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది జూన్ 20న గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూ నిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించారు. జిల్లాలో 133 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. ఇందులో 8,590 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 4,323 యూనిట్లకు గాను 4,282 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ యూనిట్లలో 3,880 గొర్రెలు చనిపోగా 2,100 గొర్రెలకు బీమా మంజూరైంది. తొలి విడత కోసం అధికారులు మూడు నెలల పాటు మహారాష్ట్రకు వెళ్లి నానా తిప్పలు పడి గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గొర్రెలు వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని యూనిట్లలో రోగాలతో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకోవాల్సి వచ్చింది. రెండో విడతలో 4267 యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సారి లబ్ధిదారుల సమక్షంలోనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. తొలివిడతలో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి రెండో విడత గొర్రెల పంపిణీ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరింత ఆలస్యం.. జూలై 2నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జూలై 2న పంపిణీ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో రవాణా వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని చివరకు గొర్రెలు కొనుగోలు చేసే రోజు చేతులెత్తేయడంతో అధికారులు అకోలిలోనే వాహనాలు మాట్లాడుకొని తీసుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి రాకుండా ఉండేందకు ట్రాన్స్‌పోర్టు కోసం ముందుగా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయి, గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే మరో 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో గొర్రెలు పంపిణీ చేస్తే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది సైతం వ్యాధులతో చాలా గొర్రెలు మృతి చెందాయి. సమస్యలు అధిగమించేనా.. మొదటివిడత గొర్రెల పంపిణీలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలోని అకోల, బుల్తానా, తులియ, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగబాద్ వంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో సమయానికి గొర్రెలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. దొరికిన గొర్రెలు సైతం కొన్ని చిన్నవిగా ఉండడం, కొన్ని ముసలి గొర్రెలు ఉండడంతో అప్పట్లో లబ్ధిదారులు అనాసక్తి చూపారు. అయినా ఏదోవిధంగా వారిని ఒప్పించిన అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. తొలి విడతలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, కొంత మంది లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు గొర్రెలకు వ్యాధులు సోకి మృత్యువాత పడ్డాయి. కొన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య కూడా ఏర్పడి పోషణ భారంగా మారి అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడతల ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో విడత పంపిణీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. -
రాష్ట్రానికి రేపు జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం హైదరాబాద్‌కు రానుంది. ఈ నెల 20, 21 తేదీల్లో వివిధ వర్గాలతో సమీక్ష నిర్వహించనుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కటారియా, వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, స్వరాజ్ విద్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి తదితరులు రెండ్రోజుల పర్యటనలో భాగంగా 20వ తేదీ ఉదయం నగరానికి చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. సాయంత్రం అక్కడే ఎస్సీ ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ కానున్నారు. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘంతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాజ్ డెక్కన్ హోటల్లో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును సమీక్షిస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం అమలుపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డీజీపీ, సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమవుతారు. జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ పూర్తి చేసినట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ తెలిపారు -
అభివృద్ధికి అధికారులే ఆటంకం
మహబూబ్‌నగర్: నిబంధనలు వర్తించవని, వ్యవస్థ అంగీకరించదని, కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త మార్గదర్శకాలు రావాల్సి ఉంది అంటూ రకరకాల సాకులతో అభివృద్ధి పనులకు అధికారులే అడ్డం పడుతున్నారు. దీంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల్లో తిరగలేకపోతున్నాం, అని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించే ప్రతిదానిని తిరస్కరించడం అధికారులకు ఫ్యాషన్ అయిందన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మూడుస్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్మాణపనులు, ఆర్థిక ప్రణాళిక సంఘాలు జరగగా, జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిక్కుడు అనురాధ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా పలుమార్లు అధికారులతీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిసంఘాల సమావేశాల్లో వివిధశాఖల ప్రగతిపై కేవలం అంకెలు మాత్రమే సూచిస్తున్నారని పూర్తి వివరాలు ఉండటం లేదన్నారు. ఈ విషయమై గత సమావేశాల్లో చెప్పినా, అధికారులు సవరించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 49 అంశాలపై చర్చ.. మూడుస్థాయి సంఘాలలో కలిపి 49 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు తదితర శాఖల ప్రగతి నివేదికను స్థాయిసంఘాల ముందుంచారు. పాఠశాల విద్యార్థులకు దుస్తులు సరిగా అందడంలేదని, దీనిపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టళ్లలో ట్యూటర్స్‌ను నియమించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. కాలేజీలలో ఫీజుల కోసం విద్యార్థులను యాజమాన్యాలు వేధిస్తున్న అంశాన్ని సభ్యులు ప్రస్తావించారు. అయితే దీనికి అధికారులు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్టు పథకం ప్రవేశపెట్టిందని, అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం విధివిధానాలు సరిగా లేవని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీల భూ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు ఎస్సీ జనాభా ఉంటే కేవలం 20మందికే భూ పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు. వలస ప్రాంతాలను మొదటి విడతగా భూ పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. అటవీశాఖ చట్టాల ప్రకారం అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూరు, లింగాల మండలాలలో భూ కొనుగోలు చేపట్టడానికి అవకాశం లేదని అధికారులు వివరించారు. ఉపాధిపై విచారణ జరపండి జాతీయ ఉపాధిహామీ పథకంలో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌లు వ్యాఖ్యానించారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించి పలు ఉదాహరణలను రాజేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గానికి సంబంధించి ఏడేళ్ల పనుల వివరాలు, ఐడీ నెంబర్ల సాఫ్ట్ కాఫీ అందజేయాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీఓలను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. కోయిల్‌కొండ, నారాయణపేట మండలాల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. రోడ్ల అవకతవకలపై ఫిర్యాదలు వస్తే, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఏడాది కావస్తున్నా ఇప్పటి దాకా రిపోర్టు ఇవ్వకపోవడంలో మతలబేంటో అర్థం కావడంలేదని, మరోవైపు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. స్థాయిసంఘాల సమావేశాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, బాలరాజు గైర్హాజరయ్యారు. సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ సీఈఓ నాగమ్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.