
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం హైదరాబాద్‌కు రానుంది. ఈ నెల 20, 21 తేదీల్లో వివిధ వర్గాలతో సమీక్ష నిర్వహించనుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కటారియా, వైస్ చైర్మన్ ఎల్.మురుగన్, సభ్యులు కె.రాములు, యోగేంద్ర పాశ్వాన్, స్వరాజ్ విద్వాన్, సంయుక్త కార్యదర్శి స్మితా చౌదరి తదితరులు రెండ్రోజుల పర్యటనలో భాగంగా 20వ తేదీ ఉదయం నగరానికి చేరుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు.
సాయంత్రం అక్కడే ఎస్సీ ఉద్యోగ సంఘాలు, సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ కానున్నారు. అనంతరం ఇన్‌కమ్ ట్యాక్స్ టవర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘంతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాజ్ డెక్కన్ హోటల్‌లో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును సమీక్షిస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం అమలుపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, డీజీపీ, సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమవుతారు. జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ పూర్తి చేసినట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment