మహబూబ్‌నగర్: నిబంధనలు వర్తించవని, వ్యవస్థ అంగీకరించదని, కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త మార్గదర్శకాలు రావాల్సి ఉంది అంటూ రకరకాల సాకులతో అభివృద్ధి పనులకు అధికారులే అడ్డం పడుతున్నారు. దీంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల్లో తిరగలేకపోతున్నాం, అని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించే ప్రతిదానిని తిరస్కరించడం అధికారులకు ఫ్యాషన్ అయిందన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మూడుస్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్మాణపనులు, ఆర్థిక ప్రణాళిక సంఘాలు జరగగా, జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిక్కుడు అనురాధ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా పలుమార్లు అధికారులతీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిసంఘాల సమావేశాల్లో వివిధశాఖల ప్రగతిపై కేవలం అంకెలు మాత్రమే సూచిస్తున్నారని పూర్తి వివరాలు ఉండటం లేదన్నారు. ఈ విషయమై గత సమావేశాల్లో చెప్పినా, అధికారులు సవరించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
49 అంశాలపై చర్చ..
మూడుస్థాయి సంఘాలలో కలిపి 49 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు తదితర శాఖల ప్రగతి నివేదికను స్థాయిసంఘాల ముందుంచారు. పాఠశాల విద్యార్థులకు దుస్తులు సరిగా అందడంలేదని, దీనిపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టళ్లలో ట్యూటర్స్‌ను నియమించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. కాలేజీలలో ఫీజుల కోసం విద్యార్థులను యాజమాన్యాలు వేధిస్తున్న అంశాన్ని సభ్యులు ప్రస్తావించారు.
అయితే దీనికి అధికారులు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్టు పథకం ప్రవేశపెట్టిందని, అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళ్యాణలక్ష్మి పథకం విధివిధానాలు సరిగా లేవని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీల భూ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు ఎస్సీ జనాభా ఉంటే కేవలం 20మందికే భూ పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు. వలస ప్రాంతాలను మొదటి విడతగా భూ పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. అటవీశాఖ చట్టాల ప్రకారం అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూరు, లింగాల మండలాలలో భూ కొనుగోలు చేపట్టడానికి అవకాశం లేదని అధికారులు వివరించారు.
ఉపాధిపై విచారణ జరపండి
జాతీయ ఉపాధిహామీ పథకంలో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌లు వ్యాఖ్యానించారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించి పలు ఉదాహరణలను రాజేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గానికి సంబంధించి ఏడేళ్ల పనుల వివరాలు, ఐడీ నెంబర్ల సాఫ్ట్ కాఫీ అందజేయాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీఓలను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. కోయిల్‌కొండ, నారాయణపేట మండలాల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమన్నారు.
రోడ్ల అవకతవకలపై ఫిర్యాదలు వస్తే, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఏడాది కావస్తున్నా ఇప్పటి దాకా రిపోర్టు ఇవ్వకపోవడంలో మతలబేంటో అర్థం కావడంలేదని, మరోవైపు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. స్థాయిసంఘాల సమావేశాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, బాలరాజు గైర్హాజరయ్యారు. సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ సీఈఓ నాగమ్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
అభివృద్ధికి అధికారులే ఆటంకం
Published Fri, Jan 30 2015 9:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement
Advertisement