తొలిరోజు గ్రామసభల్లో అధికారులను ప్రశ్నించిన ప్రజలు
అనర్హులకే పథకాలు దక్కుతున్నాయంటూ ఆవేదన
జాబితాలో పేర్లు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న అధికారులు
క్యూ కట్టిన దరఖాస్తుదారులు
సాక్షి నెట్‌వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా:
హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా :
అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా :
ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా:
నందిపేట మండలం కుద్వాన్‌పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా :
ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా:
నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా
గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment