సాక్షి, హైదరాబాద్: ఎంపీగా, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చిందని సంజయ్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మాసాబ్‌ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మీడియా తో సోమవారం మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పథకానికి రూపకల్పన చేసి నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారన్నారు.
7.31లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో గొర్రెల యూనిట్లు పంపిణీ కోసం తొలివిడతలో రూ.3549.98 కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) ద్వారా రుణం తీసుకున్నామని, అందులో ఇప్పటికే అసలు కింద రూ.1723.62 కోట్లు, వడ్డీ కింద రూ.1177.12 కోట్లు చెల్లించామని చెప్పారు. తాము మొదటి విడతలో తీసుకున్న రుణంలో రూ.వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మొదటివిడతలో రుణాన్ని సకాలంలో చెల్లిస్తున్నందున రెండో విడత కోసం రూ.4,593.75 కోట్ల రుణంగా ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ అంగీకరించిందని చెప్పారు. ఇందులోనూ కేంద్రం నుంచి రూపాయి కూడా సబ్సిడీ రాదని ఎన్‌సీడీసీ స్పష్టం చేసిందని వెల్లడించారు. నయాపైసా ఇవ్వకుండా రూ.వెయ్యి కోట్లు ఇచ్చామని చెప్పుకోవడం బీజేపీ దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమని తలసాని విమర్శిం చారు. ఇన్ని అబద్ధాలు ఆడే బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గొర్రెల పథకాన్ని దేశమంతా అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment