
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే భారీ మొత్తంలో గొర్రెలను పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. బుధవారం సచివాలయంలో గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్థకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గొర్రెల కొనుగోలు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిబంధనల మేరకే గొర్రెల కొనుగోలు, పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారులు కారణంగా మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.