309 సహాయ పశువైద్యుల పోస్టులు భర్తీ
గొర్రెల పథకం నోడల్ అధికారిగా కలెక్టర్: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశు సంవర్థక శాఖలో ఖాళీగా ఉన్న 309 సహాయ పశువైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో గొర్రెల పంపిణీ పథకం అమలుకు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. గొర్రెల కొనుగోలు కోసం విధివిధానాలను రూపొందించేందుకు శుక్రవారం సచివాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
గొర్రెలు లేని 18 సంవత్సరాలు పైబడిన గొల్ల, కుర్మ కులస్తులందరినీ సొసైటీలలో సభ్యులుగా నమోదు చేయించాలని మంత్రి సూచించారు.గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపికను లాటరీ ద్వారా చేపట్టాలని, సగం మంది మొదటి సంవత్సరం, మిగిలిన సగం మంది రెండో సంవత్సరం లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారి నుంచి యూనిట్ విలువలో 25 శాతం ముందుగా మండలస్థాయిలో త్రిసభ్య కమిటీ వసూలు చేస్తే, దానికి 75 శాతం విలువను ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. మండలస్థాయి త్రిసభ్య కమిటీ కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
అటవీశాఖ భూముల్లో స్టైలోరకం గడ్డిని పెంచేవిధంగా చర్యలు చేపట్టాలని, పశుసంవర్థక శాఖ, ఉద్యానశాఖ సమన్వయంతో పండ్ల తోటల్లో పశుగ్రాసం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలల ద్వారా గొర్రెల మంద వద్దనే వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, పశువైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ 15 రోజుల్లో గ్రామస్థాయి లబ్ధిదారుల ఎంపిక విషయమై గొల్ల, కుర్మ కులస్తుల కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటికే వారికున్న గొర్రెలు, ఆధార్‌కార్డు నంబర్, వారి భూముల సమాచారం సేకరిస్తుందని వివరించారు.