సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు నిధుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) రూ.4,565 కోట్ల రుణాన్ని మంజూరు చేసినా.. నిధులను విడుదల చేయకుండా కొర్రీలు పెడుతుండటంపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా ఆటంకాలు కల్పిస్తోందనే ఆరోపణలు అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తొలి విడత కోసం తీసుకున్న రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నా.. రెండో విడత నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటం సందేహాలకు తావిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌సీడీసీ బోర్డు సమావేశాలకు రాష్ట్ర అధికారులు హాజరై పథకం అమలు ఆవశ్యకతను, మొదటి విడత తీసుకున్న రుణం కింద తిరిగి చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలను, రెండో విడత కింద ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గల అవకాశాలను స్పష్టంగా వివరించినా.. కుంటిసాకులు చెప్తూ ఆపుతుండటం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
సరేనంటూనే.. అభ్యంతరాలు
వాస్తవానికి రెండో విడత గొర్రెల పంపిణీకి అవసరమైన నిధులను ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ గత ఏడాది అక్టోబర్‌లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులను గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట విడుదల చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు అవసరమైంది. ఈ పూచీకత్తు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత జాప్యం చేయగా.. కథ అడ్డం తిరిగింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ అప్పుల కింద పరిగణిస్తామని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలో లెక్కగడతామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. గత ఏడాది పలు ఆర్థిక సమీకరణాల కారణంగా ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. రెండో విడత కింద గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమై అధికారికంగా పూచీకత్తు ఇస్తూ ఎన్‌సీడీసీకి ప్రతిపాదనలు పంపింది.
కానీ ఈసారి ఆడిట్ రిపోర్టు రూపంలో అడ్డంకి ఎదురైంది. తొలి విడత గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో పేర్కొనడంతో ఎన్‌సీడీసీ రుణం విడుదలపై పునరాలోచనలో పడింది. ఎన్‌సీడీసీ కేంద్ర మంత్రి అమిత్‌షా పరిధిలోని సహకార శాఖ పరిధిలోకి వస్తుందని.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ నడుమ రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌సీడీసీ బోర్డు సభ్యులు నిధుల విడుదలకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకసారి బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత నిధులను వెంటనే విడుదల చేయాలి. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి మరీ బోర్డు సభ్యులు కొందరు తెలంగాణకు నిధులు ఇవ్వద్దని పేచీ పెడుతున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే రుణం ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ అధికారులు సుముఖంగా ఉన్నారని, ఇటీవలి బోర్డు సమావేశ ఎజెండాలో ఈ ప్రతిపాదన పెట్టారని.. కానీ కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని మరో సమావేశం వరకు ఈ నిధుల విడుదలను వాయిదా వేయించారని అంటున్నాయి.
ఖజానా నుంచే సర్దుబాటుకు ఏర్పాట్లు
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో గొర్రెల పంపిణీ పథకంపై చర్చ జరిగింది. రుణం మంజూరు చేసినా విడుదల చేయకుండా ఎన్‌సీడీసీ వ్యవహరిస్తున్న తీరు, రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. 10–15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అయితే రుణ విడుదలను ఎన్‌సీడీసీ వాయిదా వేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఖజానా నుంచే రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. వారం, పదిరోజుల్లో జరిగే ఎన్‌సీడీసీ భేటీ వరకు వేచి చూస్తామని, ఈ దఫా కూడా నిధులను విడుదల చేయకపోతే.. రాష్ట్ర ఖజానా నుంచే విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆర్థికశాఖ అధికారి వెల్లడించారు.
ఒక్క వాయిదా తప్పకుండా..
తొలి విడత గొర్రెల పంపిణీ కోసం ఎన్‌సీడీసీ ఇచ్చిన రూ.3,955 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. 2017లో ఈ రుణం మంజూరుకాగా.. ఏటా మే, నవంబర్ మాసాల్లో వాయిదాలను జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 వాయిదాల్లో అసలు కింద రూ.2,626 కోట్లు, వడ్డీ కింద రూ.1,442 కోట్లు కలిపి రూ.4,068 కోట్లను చెల్లించింది. తొలి విడత రుణం 2025 మే నాటికి తీరిపోనుంది. ఇలా ఠంచన్‌గా రుణ వాయిదాలు చెల్లిస్తున్నా.. రెండో విడత కింద రూ.4,565 కోట్లను మంజూరు చేసి మరీ నిలిపివేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. రెండో విడత రుణం విడుదల చేసేందుకు.. కేంద్ర సహకార శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్‌షా అనుమతి కావాల్సిందేనని ఎన్‌సీడీసీ బోర్డులోని కీలక అధికారి ఒకరు మన రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది.
గొర్రెల పంపిణీ సంబంధిత గణాంకాలివీ..
ఇప్పటివరకు గొర్రెల పంపిణీ జరిగిన లబ్ధిదారుల సంఖ్య: 3.94 లక్షలు
రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిన తీరు: 2014–15లో 1.28 కోట్ల నుంచి 2022–23 నాటికి 1.90 కోట్లకు..
మాంసం ఉత్పత్తి పెరిగిన తీరు: 2014–15లో 5.05 లక్షల టన్నుల నుంచి 2021–22 నాటికి 10.04 లక్షల టన్నులకు..
Comments
Please login to add a commentAdd a comment