ఆర్థిక సహకారం కోసం సర్కారు ప్రయత్నం
పలు జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు
చివరకు రుణం ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ సుముఖత
గొర్రెల పంపిణీకి ఎన్‌సీడీసీ నుంచే రూ. 4 వేల కోట్లు తీసుకున్న గత ప్రభుత్వం... ఇప్పుడు కూడా అదే సంస్థతో ఒప్పందానికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం సర్కారు వేట ప్రారంభించింది. రూ.31 వేల కోట్లు సమకూర్చుకునేందుకు పలు జాతీయ బ్యాంకులను సంప్రదించింది. చివరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) అవసరమైన రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీకి ఎన్‌సీడీసీ నుంచి తొలివిడత రూ.3,955 కోట్ల రుణం తీసుకుంది.
రెండోవిడతకు రూ.4,563 కోట్ల రుణం ఇవ్వాలని కోరగా.. ఎన్‌సీడీసీ చివరి నిమిషంలో ఆపేసింది. అప్పుడు రాజకీయ కారణాలు అడ్డుగా మారడంతో మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. ఇలాంటి విష యాల్లో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంలో ఎన్‌సీడీసీ ముందుంటుంది. దీంతో దాన్నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీడీసీ అధికారులతో చర్చలు జరిపింది.
అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, కేంద్ర సహకారశాఖ పరిధిలో ఎన్‌సీడీసీ ఉన్నందున రాజకీయకారణాలు ఏమైనా అడ్డుగా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్‌సీడీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయి.
ముంచుకొస్తున్న గడువు...
వచ్చే ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం రూ. 31వేల కోట్లు అవసరం అవుతాయని ప్రకటించారు. సీఎం చెప్పిన గడువుకు మరో నెలన్నర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అంత భారీ మొత్తాన్ని ఏ విధంగా సమాకూర్చుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రుణమాఫీ కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా రుణం ఇవ్వాలంటే షరతులు ఉంటాయని ఎన్‌సీడీసీ అధికారులు అంటున్నట్టు తెలిసింది.
అంతేగాక కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా అవసరమన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో రుణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే పార్టీ పనులతోపాటు ఈ విషయంపైనా తేల్చుకునేందుకు సీఎం ఢిల్లీలో నాలుగు రోజులుగా మకాం వేసినట్టు వ్యవసాయశాఖవర్గాలు అంటున్నాయి. ఇదిలాఉండగా, రుణం కోసం ముంబై వెళ్లి రిజర్వు బ్యాంకు వద్ద ప్రయత్నాలు చేశారు.
కానీ అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీడీసీపైనే ప్రభుత్వం ఆధారపడినట్టుగా చెబుతున్నారు. రుణం ఇస్తే ప్రభుత్వం అవసరమైన గ్యారంటీ ఎన్‌సీడీసీకి ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment