సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన గొర్రెలను వెతికేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అందు కోసం pashubazar.telan gana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. గొర్రెల పెంపకందారులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని, ఎన్ని గొర్రెలు విక్రయిస్తారో వివరాలు తెలియజేస్తే కొనుగోలు చేస్తామని పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువులు అమ్మడానికి, కొనడానికి వేదికగా ఈ వెబ్‌సైట్ పనిచేస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
సోమవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లకుండా వెబ్‌సైట్ ద్వారానే తమ పశువులను మంచి ధరకు అమ్ముకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. వెబ్‌సైట్‌ను ఉపయోగించడం రానివారు హెల్ప్‌లైన్ నెంబర్ ‘7337362131’ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800–599–3699కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందార్ల సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు ఎస్.రామచందర్ పాల్గొన్నారు.