‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.
భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.
ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్‌పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది.
2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి.
వరల్డ్‌టాప్ 10
అలా మొదలైంది..
‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్‌సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.
ఉత్తమ వంటకాలు
ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది.
మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్‌సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి.
అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్‌మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది.
ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు
లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి.
యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)
మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.
మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)
మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ.
ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33)
మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)
జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.
టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు
‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.
ముంబై : వడాపావ్, భేల్‌పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్‌విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.
అమృత్‌సర్ : అమృత్‌సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్‌సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.
న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.
హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.
కోల్‌కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్
చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా.
ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం.
Comments
Please login to add a commentAdd a comment