పనీర్ టేస్టీ బన్స్
కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించుకుని, ముక్కలు చేసుకోవాలి), పనీర్ తురుము – పావు కప్పు, కారం – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, నువ్వులు – కొద్దిగా
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్ చూర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అందులో బంగాళదుంప, పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మధ్యలో పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులు పెట్టుకుని.. నూనెలో దోరగా వేయించాలి లేదా.. ఓవెన్‌లో ఉడికించుకోవచ్చు.
బనానా బటర్ బాల్స్
కావలసినవి: బాదం పౌడర్ – 1 కప్పు, అవిసెగింజల పొడి – అర కప్పు, సబ్జా గింజలు – 1 టేబుల్ స్పూన్, అరటి పండు – 1(గుజ్జులా చేసుకోవాలి), పీనట్ బటర్ – అర కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – అర టీ స్పూన్, బాదం తరుగు, మినీ చాక్లెట్ బిట్స్ – పావు కప్పు చొప్పున, కొబ్బరి తురుము – పావు కప్పు (అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండు గుజ్జు, బాదం పౌడర్, అవిసెగింజల పొడి, సబ్జా గింజలు, వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీనట్స్ బటర్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, బాదం తరుగు వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ బిట్స్, కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. అభిరుచిని బట్టి.. డేట్స్ తరుగు కూడా కలుపుకుని అదనంగా బటర్ వేసుకుని ముద్దలా చేసుకోవచ్చు.
ఆపిల్ – డేట్స్ హల్వా
కావలసినవి: ఆపిల్ – 4(స్మాల్ సైజ్), డేట్స్(ఖర్జూరం) – 5(గుజ్జులా చేసుకోవాలి), పంచదార – పావు కప్పు నుంచి అరకప్పు లోపు(అభిరుచిని బట్టి), నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 2, జీడిపప్పు – 10, ఫుడ్ కలర్ – కొద్దిగా(ఆరెంజ్ కలర్, అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఆపిల్స్ పైతొక్క తొలగించి.. ముక్కలుగా కట్ చేసుకుని గుజ్జులా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. 1 టీ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆపిల్ గుజ్జు వేసుకుని, ఖర్జూరం గుజ్జు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. సరిపడా పంచదార, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని తిప్పుతూ దగ్గర పడగానే ఒక బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. (క్రిస్పీ కుకీస్.. ఆనందంగా తింటే బావుంటుందేమో)
Comments
Please login to add a commentAdd a comment