Paneer
-
Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!!
పనీర్‌తో ఎన్ని రకాలు వండవచ్చో తెలుసా! అలాగే ఒక కేజీ పనీర్ తయారు కావాలంటే ఎన్ని పాలు కావాలో తెలుసా? పాలను విరగ్గొట్టి నీరు మొత్తం కారిపోయే వరకు బరువు పెట్టి ఎదురు చూసే సమయం ఎవరికీ ఉండడం లేదు. పైగా మనం ఇంట్లో తయారు చేసే పనీర్ మెషీన్లో చేసినట్లు క్యూబ్స్‌గా రావడం కష్టం. రెస్టారెంట్లో తిన్న పనీర్లాగ ముక్కలుగా ఉంటే తప్ప పిల్లలు ఇష్టపడరు. ఇంకేం చేస్తాం... రెడీమేడ్‌గా మార్కెట్లో దొరికే పనీర్ తెచ్చుకుని సింపుల్‌గా వండేస్తాం.పనీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిన తర్వాత ఇటీవల పనీర్ వాడకం పెరిగింది. అయితే వాడకం పెరిగినంత వేగంగా పనీర్ తయారీ పెరుగుతోందా? పనీర్ లభ్యత పెరుగుతోంది కానీ సహజమైన పనీర్ తయారీ జరగడం లేదు. మార్కెట్లో దొరికే పనీర్‌లో అసలు కంటే నకిలీ ఎక్కువ.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఢిల్లీ– ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేసినప్పుడు 13వందల కిలోల నకిలీ పనీర్ దొరికింది. దొరికింది గోరంతే, నిజానికి నకలీ పనీర్ వ్యాపారం కొండంత జరుగుతోంది. మనం ఇంట్లో వండుకోవడానికి కొనుక్కున్న పనీర్ అసలుదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే పరీక్షించుకోవడానికి మూడు పద్ధతులను తెలియచేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.పనీర్ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్ అయితే రంగు మారదు.పనీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు.ఇంత ప్రక్రియ లేకుండా వాసన ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను గుర్తించవచ్చు. కంపెనీ ప్యాకింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర లేకుండా లూజ్‌గా అమ్ముతుంటారు. ఆ పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని వాసన చూడాలి. పాల వాసన వస్తే అది మంచి పనీర్. అప్పుడు రుచి చూడవచ్చు. మెత్తగా పాల రుచిని గుర్తు చేస్తుంటే కొనుక్కోవచ్చు. అలా కాక నమిలినప్పుడు రబ్బర్లాగ సాగుతుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు. అలాగే పాలతో చేసిన పనీర్ అయినా సరే పుల్లటి వాసన వస్తుంటే అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. దానిని కూడా కొనకూడదు.నిర్ధారిత అధీకృత ముద్ర, కంపెనీ ప్యాకింగ్ ఉన్న పనీర్ కొనేటప్పుడు కూడా దాని కాల పరిమితిని సరి చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి. -
ఈ పువ్వులతో మధుమేహానికి చెక్ ! ఎలాగంటే..?
మధుమేహాన్ని అదుపులో ఉంచే పండ్లు, ఆయుర్వేద మూలికలు, ఆకులు గురించి విన్నాం. కానీ పూలతో మధుమేహ్నాని నిర్వహించొచ్చు అనే దాని గురించి విన్నారా..?. ఈ పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలే చేస్తాయట. ఇదేంటి పువ్వులా అనుకోకండి ఎందుకంటే వీటిని పనీర్ పువ్వు లేదా పనీర్ దోడి అని పిలుస్తారు. మధుమేహానికి సంబధించిన గాయాలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందట. డయాబెటిస్ రోగిల పాలిట దీన్ని వరం అని పిలుస్తారు. ఇంతకీ ఏంటి పనీర్ పువ్వులు..? ఎక్కడ లభిస్తాయి తదితరాలు చూద్దామా..! పనీర్ పువ్వును పనీర్ దోడి అని కూడా అంటారు. ఎందుకిలా అంటారంటే..ఈ మొక్క పండ్లు పాలు గడ్డకట్టే లక్షణాల కారణంగా దీన్ని పనీర్దోడి అంటారు. ఇది మేజిక్ హీలర్గా పనిచస్తుంది. ఇది ఎక్కువగా తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపిస్తుంద. భారతదేశంలో ఎక్కువగా హర్యాన, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం Withania coagulans. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. సంస్కృతంలో ఈ పువ్వు పేరు ఋష్యగంధ. దీనికి పనీర్ బెడ్, ఇండియన్ రెన్నెట్, ఇండియన్ చీజ్ మేకర్ వంటి అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క గుబురుగా ఉండి, ఇది చిన్న పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పూలను ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహాన్ని నయం చేస్తుంది.. పనీర్ పువ్వు ఓ మూలికలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది. ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ తయారు చేయడానికి పనిచేస్తుంది. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పనీర్ పువ్వు బీటా కణాలను నయం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. టైప్2 మధుమేహాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు 7 నుండి 8 పనీర్ పువ్వులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా 6 నుంచి 7 రోజులు నిరంతరంగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కావాలంటే పనీర్ పూల పొడిని కూడా వాడుకోవచ్చు. నీరు త్రాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఆహారం తినండి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంది అనిపించినప్పుడు దీన్ని వినియోగించడం ఆపేయొచ్చు. ఇతర వ్యాధులకు కూడా.. పనీర్ ఫ్లవర్ మధుమేహంతో పాటు అల్జీమర్స్, ఎర్లీ ఫెటీగ్, బ్లడ్ శుద్ధి, ఆస్తమా, నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, వాపు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేగాకుండా కంటి వాపు, పైల్స్, ఉబ్బసం, పంటి సమస్యలు నుంచి బయటపడటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దుష్ప్రభావాలు.. దీని వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వాటిల్లినిట్లు నిర్థారణ కాలేదు. కానీ ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నారు, వృద్ధులు దీన్ని తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, నిపుణుల సలహల సూచనల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!) -
బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా?
బరువు తగ్గడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అందుకోసం చాలా రకాల కసరత్తులు కూడా చేసేస్తుంటాం. ఫిట్నెస్ కోసం ఇష్టమైన ఆహారం కూడా దూరం పెట్టేస్తా. కొందరైతే భోజనమే తినడం మానేస్తారు. లావుగా ఉన్నామన్నా ఫీల్‌తో ఇంతలా కష్టపడుతుంటారు చాలామంది. అయితే నిపుణులు బరువు తగ్గాలనుకుంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో! సరైన డైట్ ఫాలో అవ్వడం అనేది అన్నింటికంటే ప్రధానం అని చెబుతున్నారు. నచ్చిన ఆహారం తినకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ అందుకోసం మరీ నోటిని కట్టేసినట్లు ఉంచుకోనక్కర్లేదంటున్నారు. నచ్చినవి మితంగా తింటూ డైట్ ఫాలో అవ్వండి. పాటిస్తున్న డైట్‌ని మన మనసు కూడా ఇష్టంగా ఆస్వాదించేలా ఉండటం అనేది కూడా ముఖ్యమే. అయితే ఆరోగ్య నిపుణులు పనీర్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి పనీర్ డైట్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఏంటీ..? పనీర్‌తో బరువు తగ్గగలమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఎలా తగ్గొచంటే.. పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12, సెలీనియ, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడంలో ఉపకరిస్తాయని అంటున్నారు నిపుణులు. ఆరోగ్య మార్గంలో బరువు తగ్గేందుకు ఈ పనీర్ ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు. పనీర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర పాల ఉత్పత్తులు కంటే మెరుగైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే పనీర్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడం నివారించొచ్చు. (చదవండి: భారత రెస్టారెంట్‌కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్‌గా అరోరా) -
నోరూరించే చిల్లీ పనీర్.. కెచప్‌తో తింటే అదిరిపోతుంది
చిల్లీ పనీర్ తయారీకి కావల్సినవి: పనీర్ – 250 గ్రా (చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్ మైదా పిండి – 5 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ – 2 (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (పెద్దగా కట్ చేసుకోవాలి) ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు, పండు మిర్చి – 4 లేదా 5 అల్లం ముక్కలు – 2 టీ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – 4 (రెండేసి ముక్కలుగా చేసుకోవాలి) పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి) టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా బాగా మరిగిన వేడి నీళ్లల్లో పండుమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వేసుకుని 10 నిమిషాలు నానబెట్టి పక్కనే పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లతోనే మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో పనీర్ ముక్కలు ముంచి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక.. పండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. వెంటనే ఆ మిక్సీ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అటూ ఇటూ కలిపి ఆ వాటర్ కూడా పోసుకోవాలి. అనంతరం గరిటెతో మధ్యమధ్యలో తిప్పుతూ, నూనె వేరుపడేవరకూ ఉడికించి, ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని.. పెద్ద మంట మీద ఉల్లిపాయ ముక్కలను లైట్‌గా వేయించాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అదే మంట మీద బాగా ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా ఉడికిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్లో.. పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమంతో పాటు.. తేనె వేసుకుని తిప్పుతూ ఉండాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, సోయా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా తిప్పాలి. తర్వాత మొక్కజొన్న పిండి–పాల మిశ్రమాన్ని వేసుకుని తిప్పాలి. ఇక అదంతా క్రీమ్‌లా మారగానే టొమాటో కెచప్, ఉల్లికాడ ముక్కలు, పనీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
పన్నీర్ పాడవ్వకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్ని కిచెన్‌లో ఉపయోగించే సరుకులు పాడవ్వకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తులు తీసుకోవాలో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొసారి పాడేపోతాయి. దీనికి తోడు ఆయా సీజన్లు కూడా తోడైతే కొన్నింటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారకోసమే ఈ వంటింటి చిట్కాలు ఇక మీరు ఆ విధమైన సమస్యల నుంచి ఈజీగా బయటపడండి. పచ్చిమర్చి తాజాగా ఉండాలంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిన మిరపకాయల తొడిమలు తీసేసి టిష్యూపేపర్లో వేసి చుట్టి, జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో ్చనిల్వ చేయాలి. ఇలా పెట్టిన పచ్చి మిరపకాయలు నెలరోజులపాటు పాడవకుండా చక్కగా ఉంటాయి. ఇంట్లో చేసే నూడుల్స్ రెస్టారెంట్లలోలాగా పొడిపొడిగా రావాలంటే... నీటిలో రెండు టీస్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పువేసి నూడుల్స్‌ను మరిగించాలి. నూడుల్స్ చక్కగా ఉడికిన తరువాత వేడి నీటి నుంచి తీసి చల్లటి నీటితో కడగాలి. నీరంతా పోయేలా వంపేసి నూడుల్స్ పైన టీస్పూన్ నూనెను వేసి కలుపుకుంటే నూడుల్స్ పొడిపొడిగా వస్తాయి. వీటికి మసాలా జోడిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పనీర్‌ను నీటిలో వేసి, పైన కాటన్ వస్త్రాన్ని కప్పి ఉంచి రిఫ్రిజిరేటర్లో ఉంచితే రెండు మూడు వారాలపాటు తాజాగా ఉంటుంది. పనీర్ ముక్కలు మునిగే అన్ని నీళ్లు పోయాలి. ఈ నీటిని రెండు మూడు రోజులకొకసారి మార్చుకుంటూ ఉంటే మరిన్ని రోజులపాటు తాజాగా ఉంటుంది. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
నోరూరించే శాండ్విచ్.. ఇలా చేస్తే బయట కొనాల్సిన పనిలేదు
పనీర్ – కీమా శాండ్విచ్ తయారీకి కావల్సినవి పనీర్ ముక్కలు – 1 కప్పు,కీమా – అర కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి) చీజ్ స్లైస్ – 6 లేదా 8 (చిన్న చిన్నవి),బచ్చలికూర తురుము – పావు కప్పు స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్లు (ఉడకబెట్టుకోవాలి),క్యాప్సికమ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ స్లైస్ – 5 లేదా 6 (గ్రిల్ చేసుకున్నవి), నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానమిలా: ముందుగా ఒక పాన్‌లో నూనె వేసుకుని వేడి కాగానే.. బచ్చలికూర తురుము, క్యాప్సికమ్ తరుగు వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉడికిన స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడా ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం పనీర్ ముక్కలు, కీమా, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ప్రతి బ్రెడ్ స్లైస్‌లో కొంత పనీర్ మిశ్రమం పెట్టుకుని, ఒక్కో చీజ్ స్లైస్ దానిపై వేసుకుని.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్‌గా త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి. -
కీమాతో పనీర్ బన్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కీమా – పనీర్ బన్స్ తయారికి కావల్సినవి: కీమా – అర కప్పు (శుభ్రం చేసుకుని, మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి), గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, పనీర్ తురుము – పావు కప్పు ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (ముక్కలు చేసుకోవాలి), కారం – అర టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్. ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ , ఉప్పు – తగినంత, నూనె – సరిపడా,నువ్వులు – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని తడి కర్చీఫ్ కప్పి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కీమా వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారం, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీ ఉండల్లా చేసుకుని.. అందులో పనీర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. -
ఇంట్లోనే పనీర్ జిలేబీ చేసుకోండి ఇలా..
పనీర్ కార్న్ జిలేబీ తయారీకి కావల్సినవి: పనీర్ తురుము 300 గ్రాములు పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా కార్న్ పౌడర్ పావు కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ సోడా అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, నీళ్లు కొన్ని పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు గార్నిష్‌కి తయారీ విధానమిలా.. ముందుగా పెద్ద బౌల్లో కార్న్ పౌడర్, మైదాపిండి, బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పనీర్ తురుము వేసుకుని బాగా కలిపి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక కవర్లో వేసుకుని, ఆ కవర్ని కోన్‌లా తయారు చేసుకోవాలి. మరుగుతున్న నేతిలో జిలేబీల్లా చుట్టుకుని, దోరగా వేయించుకోవాలి. ఈ లోపు మరో స్టవ్ మీద పంచదార, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, సరిపడా నీళ్లు పోసుకుని లేతపాకం పెట్టుకుని.. వేడివేడిగా ఉన్న జిలేబీలను అందులో వేసుకుని పాకం పట్టించాలి. అనంతరం ప్లేట్లోకి తీసుకుని, పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
పచ్చని పందిట్లో రభస..కారణం వింటే ఛీ!..అంటారు!
వివాహబంధం అంటేనే రెండు కుటుంబాల కలయిక. అందులోకి మన దేశంలో చాలా అట్టహాసంగా వివాహ వేడుకలు జరుగుతుంటాయి. అలాంటి ఆనందమయ క్షణాలను కొంతమంది అర్థం కానీ రీజన్లతో విషాదమయంగా మారుస్తుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించే నవదంపతుల సంతోషాన్ని అలాంటి సంఘటనలు ఆవిరి చేసేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పటి దాక సంతోషంగా ఉన్న పచ్చని పెళ్లిమండపం కాస్త ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పెద్ద కారణం కూడా ఏం లేదు. కేవలం వరుడు తరుపు మామయ్యకు పన్నీర్ కర్రీ వడ్డించలేదని గొడపడ్డారు. ఆ గొడవ కూడా ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్లు ఒకరి నొకరు దారుణంగా కొట్టుసేకునేంత వరకు వెళ్లిపోయారు. చుట్టపక్కల వాళ్లు ఆపేందుకు యత్నిస్తున్నా.. లెక్కచేయకుండా మూర్ఖంగా పోట్లాడుకొన్నారు. అందుకు సంబంధించిన ఆదియోగి అనే వినియోగదారుడు సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो.... यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV — Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023 (చదవండి: జస్ట్ కారు దిగి వచ్చింది..దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..) -
చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని రచ్చ రచ్చ..
లక్నో: పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్ భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो.... यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV — Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023 ఈ ఘటనలో వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చదవండి: స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి -
పనీర్ తురుము, మైదాపిండితో నోరూరించే బొబ్బట్లు.. తయారీ ఇలా
నోరూరించే పనీర్ బొబ్బట్లు తయారు చేసుకోండిలా..! కావలసినవి: ►పనీర్ తురుము, మైదాపిండి – 1 కప్పు చొప్పున ►పంచదార పొడి – అర కప్పు ►ఏలకుల పొడి – అర టీ స్పూన్ ►పచ్చి కోవా – కొద్దిగా, ఉప్పు – సరిపడా ►నెయ్యి – 4 టేబుల్ స్పూన్ల పైనే తయారీ: ►ముందుగా మైదాపిండి, తగినంత ఉప్పు వేసుకుని.. నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో పనీర్ తురుము, పంచదార పొడి, పచ్చికోవా, ఏలకుల పొడి వేసుకుని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ►ఇప్పుడు కొద్దికొద్దిగా మైదా మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న అట్లు మాదిరి ఒత్తుకోవాలి. ►మధ్యలో పనీర్ మిశ్రమంతో తయారు చేసుకున్న బాల్స్‌ని ఉంచి.. చుట్టూ మైదా మిశ్రమంతో మళ్లీ బాల్స్‌లా చేసుకుని వాటిని అట్లుగా ఒత్తుకోవాలి. ►వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెనంపైన నేతిలో వేయిస్తే భలే రుచిగా ఉంటాయి. -
రిలయన్స్ ఫ్రెష్‌లో హెరిటేజ్ ఎక్స్పైర్డ్ పన్నీరు.. క్యాంటిన్ అన్నంలో బొద్దింక!
సాక్షి, సిటీబ్యూరో: శాలిబండలోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కొన్నాను. తీరా చూస్తే అది ఎక్స్పైర్డ్ అని తెలిసింది. దాన్ని వాడి నేను మరణిస్తే అందుకు బాధ్యులెవరు? తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఓ పౌరుడు జీహెచ్ఎంసీకి సామాజిక మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సమాచారమిచ్చాం. సదరు అధికారి ఆ స్టోర్‌ను తనిఖీ చేసి.. తదుపరి చర్య కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు అంటూ జీహెచ్ఎంసీ ప్రత్యుత్తరమిచి్చంది. ‘ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘తెలుగు రుచులు’ క్యాంటిన్లో మీల్స్ పార్శిల్ తీసుకున్నాను. ఇంటికి వెళ్లి చూస్తే అన్నంలో బొద్దింక కనిపించింది. ఆ క్యాంటిన్లో వందలాది బొద్దింకలున్నట్లు నాకు సమాచారం అందింది’ అని మరో పౌరుడి నుంచి అందిన ఫిర్యాదుకు స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేసి శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. తదుపరి చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు పరీక్ష ఫలితాల అనంతరం కోర్టులో కేసు నమోదు చేయడమో, పెనాల్టీ విధించడమో చేస్తామని పేర్కొంది. ఇలా.. పేరెన్నికగన్న సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటే ఇక సాధారణ, చిన్నా చితకా హోటళ్లు, తదితర సంస్థల్లోని పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు పదిమందికి తెలుస్తాయని కాబోలు మొక్కుబడి సమాధానాలు తప్ప జీహెచ్ఎంసీ ఇంకా తగిన చర్యలు చేపట్టలేదు. ఆహార కల్తీకి సంబంధించి, కుళ్లిపోయిన ఆహారం గురించి, వంటశాలల్లో అధ్వాన్నపు పరిస్థితుల గురించి, ఇతరత్రా హానికర పరిస్థితుల గురించి జీహెచ్ఎంసీకి నిత్యం ఫిర్యాదులందుతున్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాచారం ఉండటం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తనిఖీలు పెరిగాయని చెబుతున్నారు. -
Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి. పనీర్ హల్వా తయారీకి కావలసినవి: ►పనీర్ తురుము – 500 గ్రాములు ►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున ►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►పాలు – 200 మిల్లీలీటర్లు ►కోవా – 200 గ్రాములు ►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్ ►బెల్లం కోరు – 100 గ్రాములు ►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్ ►పిస్తా – గార్నిషింగ్ కోసం తయారీ: ►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. ►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి. ►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా. ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. -
Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి!
సగ్గు బియ్యంతో కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా ఇంట్లో సులభంగా తయారు చేసుకోండి! శాగూ కేసరి తయారీకి కావలసినవి ►సగ్గుబియ్యం – అరకప్పు ►పంచదార – పావు కప్పు ►నెయ్యి – రెండు టీస్పూన్లు ►యాలకుల పొడి – చిటికడు ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికడు ►జీడిపప్పు – ఎనిమిది. తయారీ: ►సగ్గుబియ్యాన్ని రెండు మూడుసార్లు కడిగి ఉడికించాలి. ►సగ్గుబియ్యం పారదర్శకంగా మారాక దించేసి నీటిని వంపేయాలి. ►జీడిపప్పుని నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి. ►జీడిపప్పు వేయించిన బాణలిలో ఉడికించిన సగ్గుబియ్యం వేసి నిమిషంపాటు మగ్గనివ్వాలి. ►తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ►పంచదార కరిగిన తరువాత ఆరెంజ్ ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి ఐదునిమిషాలు మగ్గనిచ్చి, దించేయాలి. పన్నీర్ వైట్ గ్రేవీ కావలసినవి: ►పనీర్ ముక్కలు – పావుకేజీ ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►అనాస పువ్వు – ఒకటి ►నల్ల యాలక్కాయ – ఒకటి ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►పచ్చిమిర్చి – రెండు ►కసూరీ మేథి – టీస్పూను ►జీడిపప్పు – పావు కప్పు ►పాలు – పావు కప్పు ►పెరుగు – అరకప్పు ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►జీడిపప్పుని పాలలో ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి. ►తరువాత పేస్టులా రుబ్బుకోవాలి. ►బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన నెయ్యిలో పచ్చిమిర్చిని చీల్చివేయాలి. ►దీనిలోనే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ►ఇప్పుడు కసూరీ మేథి, జీడిపప్పు పేస్టు, పెరుగు, పనీర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పదిహేను నిమిషాలపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ►నెయ్యి పైకి తేలిన తరువాత దించేసి సర్వ్ చేసుకోవాలి. రోటీ, చపాతీల్లోకి ఈ గ్రేవి మంచి సైడ్ డిష్. ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్రూట్ బజ్జీ తయారీ ఇలా! Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి రెసిపీ -
ట్విటర్లో ‘పన్నీర్ బటర్ మసాలా’ నడుస్తోంది.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు!
పాలతో ఏ వంటకం చేసిన రుచి అదిరిపోతుంది. అందుకే పాల ఉత్పత్తులతో చేసే ఏ వ్యాపారమైన మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్లో కూడా వాటికి గిరాకీ బాగానే ఉంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా లాక్డౌన్, ధరల పెరుగుదల వంటి కారణలతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తగ్గు ముఖంపట్టాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటి పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన జీఎస్టీతో ప్రజలకు షాకిచ్చిందనే చెప్పాలి. ఈ సారి జీఎస్టీ స్లాబ్‌లో పాల ఉత్పత్తులను చేర్చడంతో వ్యాపారులకు షాక్, ప్రజలపై మరింత భారం పడనుంది. గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వస్తువుల స్లాబ్‌ను పెంచారు. సవరించిన ధరలు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇకపై మునుపటి కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ జీఎస్టీ విధింపులపై ట్విటర్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. పన్నీర్ పై 5 శాతం, బటర్‌పై 12 శాతం, మసాలాపై 5 శాతం విధించారు. ఈ క్రమంలో నెటిజన్లు కేంద్రం పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ట్విట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #PaneerButterMasala ( పన్నీర్ బటర్ మసాలా) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు కేంద్రాన్ని విమర్శిస్తూనే ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. GST on Paneer butter masala after this GST mathmatics Exam comes new Calculation 🤣😃😂 Keep Solve pic.twitter.com/74DPCjaa58 — A. AHMAD (@ASGARAHMAD84) July 20, 2022 Paneer Butter Masala at Middle Class Homes After New GST slabs. pic.twitter.com/mfFzw5TziA — Garima Kaushik (@Garimakaushikk) July 20, 2022 Paneer Butter Masala is trending. Me in hostel : pic.twitter.com/oZHOTjhRDC — Varsha saandilyae (@saandilyae) July 20, 2022 -
రుచులూరే.. షాహీ తుకడా, ఖీమా పన్నీర్ వండేద్దాం ఇలా..
ఈ కొత్త రుచులను ట్రై చేయండి. ఘుమ ఘుమలాడే వంటకాలతో మీ ఇంటిల్లిపాదిని ఆనందపరచండి. షాహీ తుకడా కావల్సినవి పధార్థాలు మిల్క్ బ్రెడ్ స్లైసులు – ఆరు పాలు – లీటరు పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు యాలకులపొడి – అర టేబుల్ స్పూను కుంకుమ పువ్వు – అరటీస్పూను పిస్తా పలుకులు – ఐదు టీస్పూన్లు బాదం పలుకులు – ఐదు టీస్పూన్లు సుగర్ సిరప్ నీళ్లు – అరకప్పు పంచదార – అరకప్పు యాలకులు – రెండు రోజ్ వాటర్ – అరటీస్పూను గార్నిష్ బ్రెడ్‌స్లైసులు – మూడు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా టేబుల్‌స్పూను పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టు కోవాలి. ►మందపాటి గిన్నెలో పాలు పోసి వేడిచేయాలి. ►పాలు మీగడ కట్టి, సగమయ్యాక, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి, 5 నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తరువాత దించి పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు అరకప్పు పంచదార, నీళ్లు వేసి తీగపాకం వచ్చిన తరువాత రోజ్ వాటర్, యాలకులపొడి వేసి కలపాలి. ►ఈ పాకంలో బ్రెడ్ స్లైసులను వేసి నానబెట్టుకోవాలి. ►గార్నిష్ కోసం తీసుకున్న బ్రెడ్‌ను త్రికోణాకృతి ఆకృతిలో కట్ చేసి నెయ్యిలో బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►వీటిని కూడా పాకంలో 15 సెకన్ల పాటు ఉంచాలి. ►ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో బ్రెడ్‌ముక్కలు వరుసగా పేర్చి, కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వాటిమీద పోసి, గార్నిష్ కోసం తీసుకున్న పదార్థాలను వేసి సర్వ్చేస్తే ఎంతో రుచికరమైన షాహీ తుకడ రెడీ. ఖీమా పన్నీర్ కావల్సినవి పధార్థాలు పన్నీర్ తురుము – కప్పు బటర్ – మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను లవంగాలు – రెండు దాల్చిన చెక్క – చిన్న ముక్క యాలకులు – రెండు బిర్యానీ ఆకు – ఒకటి మిరియాలు – మూడు ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) టొమోటో – రెండు (సన్నగా తరుక్కోవాలి) అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి) కారం – రెండు టీస్పూన్లు పసుపు – పావు టీస్పూను ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – అరటీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – అరటీస్పూను నిమ్మరసం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద బాండీ వేడెక్కిన తరువాత బటర్, నూనె వేయాలి. రెండూ వేడయ్యాకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి నిమిషం వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమోటో, కొత్తిమీర తరుగు వేసి కలిపి మగ్గనివ్వాలి. ►టొమోటో మగ్గాకా.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి సన్నని మంటమీద తిప్పుతూ ఉండాలి. ►ఆయిల్ పైకి తేలిన తరువాత పన్నీర్ తురుము, గరం మసాలా, పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . ►ఇప్పుడు మూతపెట్టి మూడు నిమిషాల ఉడికించి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే ఖీమా పన్నీర్ రెడీ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
ఘుమ ఘుమలాడే పనీర్ రోటీ రోల్స్, కీమా బోండా తయారీ విధానం ఇలా..
మార్నింగ్ టిఫిన్ గా ఈ కొత్త వంటకాలను ప్రత్నించండి.. మీ ఇంటిల్లిపాదికి కొత్త రుచులను పరిచయం చేయండి. కీమా బోండా కావలసిన పదార్థాలు కీమా – పావు కిలో (ఉప్పు, కారం, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్ వచ్చేవరకూ ఉంచాలి) జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) కరివేపాకు తురుము – కొద్దిగా ఉల్లిపాయలు – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్ కొత్తిమీర తురుము – కొద్దిగా శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – అర టీ స్పూన్ చొప్పున బంగాళదుంప గుజ్జు – పావు కప్పు (ఉడికించినది) నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, బంగాళదుంప గుజ్జు, కీమా, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని నీళ్లు పోసుకుని పలచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కీమా–బంగాళదుంప మిశ్రమాన్ని బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి, బూరెలు మాదిరిగా కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పనీర్ రోటీ రోల్స్ కావలసిన పదార్థాలు పనీర్ ముక్కలు – 1 కప్పు ఓట్స్ – 2 కప్పులు (పిండిలా మిక్సీ పట్టుకోవాలి) జొన్నపిండి – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్లు – సరిపడా గరం మసాలా, కారం – 1 టీ స్పూన్ చొప్పున పసుపు – కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి) టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు ఉప్పు – తగినంత నూనె – సరిపడా తయారీ విధానం ముందుగా పనీర్ ముక్కలకు గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఓట్స్ పిండి, జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్‌చేసి.. కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని దోరగా వేయించి, పనీర్ మిశ్రమాన్నీ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మరోవైపు ఓట్స్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, పెనం మీద ఇరువైపులా దోరగా వేయించుకుని, ప్రతి రోటీలో కొద్దికొద్దిగా పనీర్ మిశ్రమాన్ని పెట్టుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట.. -
Navratri Special 2021: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ..
దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక వంటకాలతో మీ ఇంటి అథిదులకు మరింత దగ్గరవ్వండి. పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ మీ కోసం.. పనీర్ సమోసా కావలసినవి: ►మైదా పిండి – పావు కిలో ►పనీర్ తురుము – 2 కప్పులు ►వాము – అర టీ స్పూన్ ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►క్యాబేజీ, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, ►సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ ►పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, పనీర్ తురుము, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాల వడ కావలసిన పదార్ధాలు ►మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి) ►పెరుగు – 3 టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – పావు కప్పు ►మైదా పిండి – పావు కప్పు ►అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున ►తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్‌కి ►కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
కరోనా బెల్స్...ప్రొటీన్ ఫుడ్స్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆరోగ్య కారణాల రీత్యా ప్రొటీన్ ఫుడ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా బాధితులు, నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నవారు గుడ్లు చేపలు వగైరా ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శాఖాహారులకు ఉపకరించేలా.. హైదరాబాద్‌కి చెందిన పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తొలిసారి నేచురల్ పనీర్‌ని రూపొందించింది. దీనిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పన్నీర్‌ను ‘సాఫ్ట్ అండ్ క్రీమీ పన్నీర్’ గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీరు తెలిపారు. నేచురల్ గా... తెలంగాణా కేంద్రంగా ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న వాటిలో అతి కీలకమైన ఉత్పత్తి ఈ నేచురల్ పన్నీర్. దీని తయారీ కోసం వినియోగించే పాలలో ఎలాంటి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ లేదంటే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం దీనిలో విశేషం. ఈ కారణం చేత పన్నీర్ తాజాదనం, మృదుత్వం అలాగే ఉంటుంది. తమ రోజువారీ ఆహారంలో తగినంతగా ప్రొటీన్‌ను పొందాలని కోరుకునే శాఖాహారులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.. ఈ నేచురల్ పన్నీర్ 200 గ్రాముల ప్యాక్ 150 రూపాయల ధరలో లభిస్తుంది. పనీర్ మార్కెట్ కి ఊపు.. ప్రస్తుత పరిస్థితుల్లో పనీర్ వినియోగం బాగా పెరిగింది. ‘ఇండియన్ డెయిరీ మార్కెట్ రిపోర్ట్ అండ్ ఫోర్కాస్ట్ 20212026 ’పేరిట ఈఎంఆర్ విడుదల చేసిన నూతన అధ్యయనం భారతీయ డెయిరీ మార్కెట్ 2020లో దాదాపు 145.55 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ మార్కెట్ 20212026 మధ్యకాలంలో 6% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో.. భారతదేశంలో 75వేల కోట్ల రూపాయలుగా ఉన్న పన్నీర్ మార్కెట్లో తమ వాటాను సొంతం చేసుకోవడం కోసం కంపెనీలు లక్ష్యంగా చేసుకున్నాయి. అదే క్రమంలో తెలంగాణాలో స్థానిక బ్రాండ్‌గా ఉన్న సిద్స్‌ఫార్మ్ పెరిగిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. నేచురల్ పన్నీర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా సిద్స్ ఫామ్స్ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నది మా బ్రాండ్ సిద్ధాంతం’’ అని చెప్పారు. -
పంచాయతీ ఎన్నికలు.. పన్నీర్ పంచిన నాయకులు
లక్నో: ఎన్నికలనగానే రాజకీయ నాయకులు మద్యం, డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ బుట్టలో వేసుకోవడానికి తెగ ప్రయత్నింస్తుంటారు. అయితే, యూపీలోని అమ్రోహాలో నాయకులు కాస్త వేరైటిగా ఆలోచించారు. వీరు అక్కడ జరగబోయే పంచాయతీ ఎన్నికలలో పన్నీర్‌ను పంచి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. చాకోరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థి సోదరుడు గజేంద్ర సింగ్ తన సోదరుడికి మద్దతు తెలపాలని కోరుతూ కాటేజ్ జున్ను(పన్నీర్) పంచి పెట్టాడు. విషయం తెలియగానే పోలీసులు ఆ ప్రదేశంపై దాడిచేసి, అక్కడున్న 30 కేజీల పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రజలను ప్రభావితం చేయటానికి ప్రయత్నించాడని గజేంద్ర సింగ్ పై కేసును కూడా నమోదు చేశారు. ఈ పన్నీర్‌ను అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి 29ల మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే . అయితే, ఈ విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి గతంలో ఒక నాయకుడు 100 కేజీల రసగుల్లాలను పంచిపెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
మీరు వెజిటేరియన్సా? మీ కోసమే ఈ పన్నీర్ 65 రెసిపీ..
పనీర్ 65 కావలసినవి: పనీర్ ముక్కలు – 15, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు, మైదా – ఒక టీస్పూను, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను, అల్లం పేస్టు – ఒక టీస్పూను, కారం – సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు), పసుపు – అర టీ స్పూను, గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత తయారీ: స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్ 65 సిద్ధం. స్వీట్ కార్న్ పాయసం కావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, పిస్తా, కిస్ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్ – పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ పాయసం. పాలక్ పరోటా కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. సేకరణ: సంహిత నిమ్మన -
గ్రామ జనాభా 1500.. ప్రతి ఇంట్లోనూ పనీర్
పాతికేళ్ల క్రితం ఆ ఊళ్లో ఉపాధి అవకాశాలు లేవు. బతుకు తెరువుకు పెద్ద పట్టణాలకు వలస వెళ్లేవారు. ఉన్నవే పాతిక కుటుంబాలు. పశు సంతతి వారి జీవనాధారం. ఆ ఊరు పేరు రౌతు కి బెలీ. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లోని తెహ్రీ జిల్లాలో ఉండేది. ఆడ, మగ పొరుగున ఉండే ముస్సోరీ ప్రాంతానికి వెళ్లి పాలమ్ముకొని, ఆ వచ్చిన ఆదాయంతో జీవించేవారు. పాతికేళ్లుగా ఆ గ్రామ ప్రజలు పడిన కష్టానికి ఇప్పుడు తగిన ఫలితం వస్తోంది, కుటుంబాలు పెరిగాయి. ఊరు పేరు కూడా మారిపోయింది. వారి జీవన విధానాన్ని మార్చేసిన ఘనత పనీర్‌కు దక్కింది. రౌతు కి బెలీ కాస్తా ‘పనీర్ విలేజ్’గా స్థిరపడిపోయింది. ఇప్పుడు ‘పనీర్ విలేజ్’లో 250 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 1500. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ పనీర్‌ను తయారుచేస్తారు. ఇక్కడి పనీర్‌కు టెహ్రీ, డెహ్రాడూన్, ముస్సోరితోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. పర్వత ప్రాంతాల్లో ఉపాధి కోసం కష్టపడుతున్న సమయంలో పనీర్ వీరి జీవనోపాధిగా మారింది. నిరాటంకంగా పనీర్‌ను తయారుచేస్తూ, ఎగుమతులు చేస్తూ ప్రతి కుటుంబం సుమారు 15000 వేల రూపాయల నుంచి 35,0000 వేల రూపాయల వరకు సంపాదిస్తోంది. ప్రయోగాల ఫలితం గ్రామంలో 90 శాతం కుటుంబాలు పశుసంర్థకంలో పాల్గొంటాయి. పనీర్ విలేజ్ గ్రామస్తుల్లో మహిళలు మాట్లాడుతూ–‘పనీర్ వ్యాపారం ప్రారంభానికి ముందు ముస్సోరీ, డెహ్రాడూన్లలో పాలు అమ్మేవాళ్లం. ఆ సమయంలో ముస్సోరీలోని మార్కెట్లో పనీర్ అమ్ముతున్న కొంతమందిని చూసినప్పుడు మేం కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించాం. కొంతకాలానికి మస్సోరీ ప్రజలు మా పనీర్ రుచిని ఇష్టపడ్డారు. దీంతో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు గ్రామస్తులు పాల ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి బదులు పనీర్ తయారీ, అమ్మకం పైనే దృష్టి పెట్టారు’ అని వివరించారు. ఆగిపోయిన వలసలు గ్రామ పెద్ద భండారీ మాట్లాడుతూ ‘కిలో పనీర్‌ను రూ.220 నుంచి పొరుగు గ్రామాల్లో రూ.240 వరకు అమ్ముతున్నారు. గ్రామాన్ని రహదారికి అనుసంధానించడం కూడా రాకపోకలకు సౌలభ్యం పెరిగింది. దీంతో మార్కెట్ సులువు అయ్యింద’ని వివరించారు. పనీర్ వ్యాపారం బాగా ఉండటంతో గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వలస వచ్చే యువకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉపాధి అవకాశాల కోసం ఇతర పెద్ద పట్టణాలకు వలస వెళ్లడం దాదాపుగా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం పుట్టి పెరిగిన ఊరిని వదలాల్సిన అవసరం లేనంతగా ఎదగాలంటే.. ఉన్నచోటనే అవకాశాల కల్పనకు కృషి జరగాలి. ఈ కోణంలో గ్రామీణ ప్రజానీకం దృష్టి పెడితే పల్లె ప్రగతి వేగవంతంగా సుసాధ్యం అవుతుంది. చదవండి: మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా చదవండి: 'స్విస్ టైమ్ బ్యాంక్' ఎంటో తెలుసా? -
టమాటతో హల్వా, డిఫరెంట్ రెసిపీ మీకోసం
పనీర్ లాలీపాప్స్ కావలసినవి: పనీర్ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్ పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటో హల్వా కావలసినవి: పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్ కలర్ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ పకోడా కావలసినవి:మీల్మేకర్ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది.