సాక్షి, సిటీబ్యూరో: శాలిబండలోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కొన్నాను. తీరా చూస్తే అది ఎక్స్‌పైర్డ్ అని తెలిసింది. దాన్ని వాడి నేను మరణిస్తే అందుకు బాధ్యులెవరు? తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఓ పౌరుడు జీహెచ్‌ఎంసీకి సామాజిక మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సమాచారమిచ్చాం. సదరు అధికారి ఆ స్టోర్‌ను తనిఖీ చేసి.. తదుపరి చర్య కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు అంటూ జీహెచ్‌ఎంసీ ప్రత్యుత్తరమిచి్చంది.
‘ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘తెలుగు రుచులు’ క్యాంటిన్‌లో మీల్స్ పార్శిల్ తీసుకున్నాను. ఇంటికి వెళ్లి చూస్తే అన్నంలో బొద్దింక కనిపించింది. ఆ క్యాంటిన్‌లో వందలాది బొద్దింకలున్నట్లు నాకు సమాచారం అందింది’ అని మరో పౌరుడి నుంచి అందిన ఫిర్యాదుకు స్పందిస్తూ.. జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేసి శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. తదుపరి చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు పరీక్ష ఫలితాల అనంతరం కోర్టులో కేసు నమోదు చేయడమో, పెనాల్టీ విధించడమో చేస్తామని పేర్కొంది.
ఇలా.. పేరెన్నికగన్న సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటే ఇక సాధారణ, చిన్నా చితకా హోటళ్లు, తదితర సంస్థల్లోని పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు పదిమందికి తెలుస్తాయని కాబోలు మొక్కుబడి సమాధానాలు తప్ప జీహెచ్‌ఎంసీ ఇంకా తగిన చర్యలు చేపట్టలేదు. ఆహార కల్తీకి సంబంధించి, కుళ్లిపోయిన ఆహారం గురించి, వంటశాలల్లో అధ్వాన్నపు పరిస్థితుల గురించి, ఇతరత్రా హానికర పరిస్థితుల గురించి జీహెచ్‌ఎంసీకి నిత్యం ఫిర్యాదులందుతున్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాచారం ఉండటం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తనిఖీలు పెరిగాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment