Reliance Fresh
-
రిలయన్స్ ఫ్రెష్‌లో హెరిటేజ్ ఎక్స్పైర్డ్ పన్నీరు.. క్యాంటిన్ అన్నంలో బొద్దింక!
సాక్షి, సిటీబ్యూరో: శాలిబండలోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కొన్నాను. తీరా చూస్తే అది ఎక్స్పైర్డ్ అని తెలిసింది. దాన్ని వాడి నేను మరణిస్తే అందుకు బాధ్యులెవరు? తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఓ పౌరుడు జీహెచ్ఎంసీకి సామాజిక మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సమాచారమిచ్చాం. సదరు అధికారి ఆ స్టోర్‌ను తనిఖీ చేసి.. తదుపరి చర్య కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు అంటూ జీహెచ్ఎంసీ ప్రత్యుత్తరమిచి్చంది. ‘ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘తెలుగు రుచులు’ క్యాంటిన్లో మీల్స్ పార్శిల్ తీసుకున్నాను. ఇంటికి వెళ్లి చూస్తే అన్నంలో బొద్దింక కనిపించింది. ఆ క్యాంటిన్లో వందలాది బొద్దింకలున్నట్లు నాకు సమాచారం అందింది’ అని మరో పౌరుడి నుంచి అందిన ఫిర్యాదుకు స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేసి శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. తదుపరి చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు పరీక్ష ఫలితాల అనంతరం కోర్టులో కేసు నమోదు చేయడమో, పెనాల్టీ విధించడమో చేస్తామని పేర్కొంది. ఇలా.. పేరెన్నికగన్న సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటే ఇక సాధారణ, చిన్నా చితకా హోటళ్లు, తదితర సంస్థల్లోని పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు పదిమందికి తెలుస్తాయని కాబోలు మొక్కుబడి సమాధానాలు తప్ప జీహెచ్ఎంసీ ఇంకా తగిన చర్యలు చేపట్టలేదు. ఆహార కల్తీకి సంబంధించి, కుళ్లిపోయిన ఆహారం గురించి, వంటశాలల్లో అధ్వాన్నపు పరిస్థితుల గురించి, ఇతరత్రా హానికర పరిస్థితుల గురించి జీహెచ్ఎంసీకి నిత్యం ఫిర్యాదులందుతున్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాచారం ఉండటం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తనిఖీలు పెరిగాయని చెబుతున్నారు. -
రిలయన్స్ ఫ్రెష్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలోని రిలయన్స్ ప్రెష్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ మాల్లో నుంచి పొగలు వస్తుండటం గమనించిన అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
పతంజలి నూడుల్స్ వచ్చాయ్..
70 గ్రాముల ప్యాక్ ధర రూ.15 * రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్ తదితర అవుట్‌లెట్స్‌లో లభ్యం న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద సోమవారం దేశీ మార్కెట్లోకి నూడుల్స్‌ను ప్రవేశపెట్టింది. ‘ఆటా నూడుల్స్’ 70 గ్రాముల ప్యాక్ ధర రూ. 15గా నిర్ణయించింది. పోటీ సంస్థల నూడుల్స్ కన్నా తమ ఉత్పత్తి ధర రూ. 10 తక్కువగా ఉంటుందని బాబా రాందేవ్ తెలిపారు. ఇతర సంస్థల్లాగా వీటి తయారీలో పామాయిల్ కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్, డి-మార్ట్ వంటి రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు పతంజలి బ్రాండ్ సొంత రిటైల్ స్టోర్స్‌లో కూడా ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. డిసెంబరు ఆఖరు నాటికి పది లక్షల స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. నూడుల్స్ ఉత్పత్తి కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్లో మొత్తం అయిదు తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్లలో పతంజలి ఆయుర్వేదకు చెందిన ఇతర ఉత్పత్తులు కూడా తయారవుతాయని రాందేవ్ చెప్పారు. బహుళ జాతి సంస్థలతో పోటీ పడే దిశగా త్వరలో పతంజలి నూడుల్స్‌తో పాటు నెయ్యి, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తుల ప్రచారానికి టీవీ ప్రకటనలూ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 5 నెలల నిషేధం తర్వాత ఇటీవలే మళ్లీ అమ్మకాలు మొదలెట్టిన నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్‌తో పతంజలి నూడుల్స్ పోటీపడనుంది. త్వరలో చైల్డ్, స్కిన్ కేర్ ఉత్పత్తులు కూడా..: డిసెంబర్ నాటికి చైల్డ్‌కేర్, స్కిన్‌కేర్ ఉత్పత్తులతో పాటు హెల్త్ సప్లిమెంట్స్‌ను కూడా మార్కెట్లోకి తేనున్నట్లు బాబా రాందేవ్ వివరించారు. ‘శిశు కేర్’ బ్రాండ్‌తో శిశు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, ‘పవర్ వీటా’ బ్రాండ్ కింద హెల్త్ సప్లిమెంట్స్‌ను ప్రవేశపెడతామన్నారు. అలాగే టెక్స్టైల్స్ రంగంలోకి అడుగెట్టబోతున్నామని, ‘వస్త్రం’ బ్రాండ్ కింద ఉత్పత్తులు ఉంటాయని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి ఆయుర్వేదను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ అటువంటి యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. ఎగుమతి అవకాశాలపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీ చిన్న స్థాయిదేనని, దేశీ డిమాండ్‌పైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని రాందేవ్ చెప్పారు. ఎగుమతుల అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. 2014-15లో కంపెనీ అమ్మకాల టర్నోవరు రూ. 2007 కోట్లని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 150% వృద్ధితో రూ. 5,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్లు రాందేవ్ తెలిపారు. -
రూ.22 లక్షలతో పరారీ..
నేరేడ్మెట్, న్యూస్‌లైన్: అదే నిర్లక్ష్యం.. లక్షలాది రూపాయల నగదు తరలించే వాహనంలో సెక్యూరిటీ గార్డు లేడు. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితం.. ఓ నగదు భద్రత సంస్థలో నెల క్రితమే చేరిన డ్రైవర్ రూ.22 లక్షలతో ఉడాయించాడు. నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు, సీఎంఎస్ సిబ్బంది తెలిపిన ప్రకారం.. సీఎంఎస్ ఇన్ఫో సిస్టం ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. నగరంలోని పలు రిలయన్స్ ఫ్రెష్ షాపుల నుంచి నిత్యం డబ్బులు సేకరించి దాని ప్రధాన కార్యాలయంలో అందచేస్తుంటుంది. అందుకోసం వినియోగించే వాహనానికి జాఫర్ హుస్సేన్ డ్రైవర్. సోమవారం ఉదయం జాఫర్‌తో కలిసి క్యాష్ కలెక్షన్ ఏజెంట్ శివకుమార్ చిరాగ్ అలీలేన్, నల్లకుంట, విద్యానగర్, శివంరోడ్, ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ, కుషాయిగూడలలోని రిలయన్స్ ఫ్రెష్‌ల నుంచి రూ.22, 74,991 సేకరించాడు. కాప్రా సాకేత్‌లో ఇద్దరూ భోజనం చేశారు. అనంతరం డిఫెన్స్ కాలనీలోని రిలయన్స్ ఫ్రెష్‌కు వెళ్లారు. శివకుమార్ డబ్బులు సేకరించేందుకు లోనికి వెళ్లాడు. ఇదే అదనుగా జాఫర్ అప్పటికే సేకరించిన డబ్బు, వాహనంతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటికి శివకుమార్ బయటికి రాగా వాహనం కనిపించలేదు. గాలించగా.. వాయుపురిలోని డీసీపీ ఆఫీస్ వద్ద నిలిపి ఉంది. అక్కడకు వెళ్లగా జాఫర్ కనిపించలేదు. సీఎంస్ సిబ్బంది ఫిర్యాదుతో నేరేడ్మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంతా నిర్లక్ష్యమే.. రోజూ పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించే వాహనానికి కనీసం సెక్యూరిటీ గార్డు లేడు. నిజానికి ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు సిబ్బంది ఉండాలి. సోమవారం డ్రైవర్‌తో పాటు క్యాష్ ఏజెంట్ మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గుంటూరుకు చెందిన జాఫర్ మస్తాన్ నగరంలోని బోరబండ అల్లాపూర్‌లో ఉంటూ నెల క్రితమే సీఎంఎస్ కంపెనీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు.