రూ.22 లక్షలతో పరారీ..
నేరేడ్‌మెట్, న్యూస్‌లైన్: అదే నిర్లక్ష్యం.. లక్షలాది రూపాయల నగదు తరలించే వాహనంలో సెక్యూరిటీ గార్డు లేడు. కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితం.. ఓ నగదు భద్రత సంస్థలో నెల క్రితమే చేరిన డ్రైవర్ రూ.22 లక్షలతో ఉడాయించాడు. నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు, సీఎంఎస్ సిబ్బంది తెలిపిన ప్రకారం.. సీఎంఎస్ ఇన్ఫో సిస్టం ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. నగరంలోని పలు రిలయన్స్ ఫ్రెష్ షాపుల నుంచి నిత్యం డబ్బులు సేకరించి దాని ప్రధాన కార్యాలయంలో అందచేస్తుంటుంది.
అందుకోసం వినియోగించే వాహనానికి జాఫర్ హుస్సేన్ డ్రైవర్. సోమవారం ఉదయం జాఫర్‌తో కలిసి క్యాష్ కలెక్షన్ ఏజెంట్ శివకుమార్ చిరాగ్ అలీలేన్, నల్లకుంట, విద్యానగర్, శివంరోడ్, ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ, కుషాయిగూడలలోని రిలయన్స్ ఫ్రెష్‌ల నుంచి రూ.22, 74,991 సేకరించాడు. కాప్రా సాకేత్‌లో ఇద్దరూ భోజనం చేశారు.
అనంతరం డిఫెన్స్ కాలనీలోని రిలయన్స్ ఫ్రెష్‌కు వెళ్లారు. శివకుమార్ డబ్బులు సేకరించేందుకు లోనికి వెళ్లాడు. ఇదే అదనుగా జాఫర్ అప్పటికే సేకరించిన డబ్బు, వాహనంతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటికి శివకుమార్ బయటికి రాగా వాహనం కనిపించలేదు. గాలించగా.. వాయుపురిలోని డీసీపీ ఆఫీస్ వద్ద నిలిపి ఉంది. అక్కడకు వెళ్లగా జాఫర్ కనిపించలేదు. సీఎంస్ సిబ్బంది ఫిర్యాదుతో నేరేడ్‌మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంతా నిర్లక్ష్యమే..
రోజూ పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించే వాహనానికి కనీసం సెక్యూరిటీ గార్డు లేడు. నిజానికి ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు సిబ్బంది ఉండాలి. సోమవారం డ్రైవర్‌తో పాటు క్యాష్ ఏజెంట్ మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గుంటూరుకు చెందిన జాఫర్ మస్తాన్ నగరంలోని బోరబండ అల్లాపూర్‌లో ఉంటూ నెల క్రితమే సీఎంఎస్ కంపెనీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు.