పతంజలి నూడుల్స్ వచ్చాయ్..
70 గ్రాముల ప్యాక్ ధర రూ.15
* రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్ తదితర అవుట్‌లెట్స్‌లో లభ్యం
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద సోమవారం దేశీ మార్కెట్లోకి నూడుల్స్‌ను ప్రవేశపెట్టింది. ‘ఆటా నూడుల్స్’ 70 గ్రాముల ప్యాక్ ధర రూ. 15గా నిర్ణయించింది. పోటీ సంస్థల నూడుల్స్ కన్నా తమ ఉత్పత్తి ధర రూ. 10 తక్కువగా ఉంటుందని బాబా రాందేవ్ తెలిపారు.
ఇతర సంస్థల్లాగా వీటి తయారీలో పామాయిల్ కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్, డి-మార్ట్ వంటి రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు పతంజలి బ్రాండ్ సొంత రిటైల్ స్టోర్స్‌లో కూడా ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. డిసెంబరు ఆఖరు నాటికి పది లక్షల స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు.
నూడుల్స్ ఉత్పత్తి కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మొత్తం అయిదు తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్లలో పతంజలి ఆయుర్వేదకు చెందిన ఇతర ఉత్పత్తులు కూడా తయారవుతాయని రాందేవ్ చెప్పారు. బహుళ జాతి సంస్థలతో పోటీ పడే దిశగా త్వరలో పతంజలి నూడుల్స్‌తో పాటు నెయ్యి, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తుల ప్రచారానికి టీవీ ప్రకటనలూ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
5 నెలల నిషేధం తర్వాత ఇటీవలే మళ్లీ అమ్మకాలు మొదలెట్టిన నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్‌తో పతంజలి నూడుల్స్ పోటీపడనుంది.
త్వరలో చైల్డ్, స్కిన్ కేర్ ఉత్పత్తులు కూడా..: డిసెంబర్ నాటికి చైల్డ్‌కేర్, స్కిన్‌కేర్ ఉత్పత్తులతో పాటు హెల్త్ సప్లిమెంట్స్‌ను కూడా మార్కెట్లోకి తేనున్నట్లు బాబా రాందేవ్ వివరించారు. ‘శిశు కేర్’ బ్రాండ్‌తో శిశు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, ‘పవర్ వీటా’ బ్రాండ్ కింద హెల్త్ సప్లిమెంట్స్‌ను ప్రవేశపెడతామన్నారు.
అలాగే టెక్స్‌టైల్స్ రంగంలోకి అడుగెట్టబోతున్నామని, ‘వస్త్రం’ బ్రాండ్ కింద ఉత్పత్తులు ఉంటాయని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి ఆయుర్వేదను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ అటువంటి యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. ఎగుమతి అవకాశాలపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీ చిన్న స్థాయిదేనని, దేశీ డిమాండ్‌పైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని రాందేవ్ చెప్పారు.
ఎగుమతుల అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. 2014-15లో కంపెనీ అమ్మకాల టర్నోవరు రూ. 2007 కోట్లని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 150% వృద్ధితో రూ. 5,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్లు రాందేవ్ తెలిపారు.