పనీర్ లాలీపాప్స్
కావలసినవి: పనీర్ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్‌చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్‌కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్ పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
టమాటో హల్వా
కావలసినవి: పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్ కలర్ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
మీల్‌మేకర్ పకోడా
కావలసినవి:మీల్‌మేకర్ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్‌లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment