పనీర్ 65
కావలసినవి: పనీర్ ముక్కలు – 15, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు, మైదా – ఒక టీస్పూను, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను, అల్లం పేస్టు – ఒక టీస్పూను, కారం – సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు), పసుపు – అర టీ స్పూను, గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత
తయారీ: స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్ 65 సిద్ధం.
స్వీట్ కార్న్ పాయసం
కావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, పిస్తా, కిస్ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు
తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్ – పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ పాయసం.
పాలక్ పరోటా
కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా
తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్‌లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.
సేకరణ: సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment