పాతికేళ్ల క్రితం ఆ ఊళ్లో ఉపాధి అవకాశాలు లేవు. బతుకు తెరువుకు పెద్ద పట్టణాలకు వలస వెళ్లేవారు. ఉన్నవే పాతిక కుటుంబాలు. పశు సంతతి వారి జీవనాధారం. ఆ ఊరు పేరు రౌతు కి బెలీ. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లోని తెహ్రీ జిల్లాలో ఉండేది. ఆడ, మగ పొరుగున ఉండే ముస్సోరీ ప్రాంతానికి వెళ్లి పాలమ్ముకొని, ఆ వచ్చిన ఆదాయంతో జీవించేవారు. పాతికేళ్లుగా ఆ గ్రామ ప్రజలు పడిన కష్టానికి ఇప్పుడు తగిన ఫలితం వస్తోంది, కుటుంబాలు పెరిగాయి. ఊరు పేరు కూడా మారిపోయింది. వారి జీవన విధానాన్ని మార్చేసిన ఘనత పనీర్‌కు దక్కింది. రౌతు కి బెలీ కాస్తా ‘పనీర్ విలేజ్’గా స్థిరపడిపోయింది.
ఇప్పుడు ‘పనీర్ విలేజ్’లో 250 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 1500. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ పనీర్‌ను తయారుచేస్తారు. ఇక్కడి పనీర్‌కు టెహ్రీ, డెహ్రాడూన్, ముస్సోరితోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. పర్వత ప్రాంతాల్లో ఉపాధి కోసం కష్టపడుతున్న సమయంలో పనీర్ వీరి జీవనోపాధిగా మారింది. నిరాటంకంగా పనీర్‌ను తయారుచేస్తూ, ఎగుమతులు చేస్తూ ప్రతి కుటుంబం సుమారు 15000 వేల రూపాయల నుంచి 35,0000 వేల రూపాయల వరకు సంపాదిస్తోంది.
ప్రయోగాల ఫలితం
గ్రామంలో 90 శాతం కుటుంబాలు పశుసంర్థకంలో పాల్గొంటాయి. పనీర్ విలేజ్ గ్రామస్తుల్లో మహిళలు మాట్లాడుతూ–‘పనీర్ వ్యాపారం ప్రారంభానికి ముందు ముస్సోరీ, డెహ్రాడూన్లలో పాలు అమ్మేవాళ్లం. ఆ సమయంలో ముస్సోరీలోని మార్కెట్లో పనీర్ అమ్ముతున్న కొంతమందిని చూసినప్పుడు మేం కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించాం. కొంతకాలానికి మస్సోరీ ప్రజలు మా పనీర్ రుచిని ఇష్టపడ్డారు. దీంతో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు గ్రామస్తులు పాల ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి బదులు పనీర్ తయారీ, అమ్మకం పైనే దృష్టి పెట్టారు’ అని వివరించారు.
ఆగిపోయిన వలసలు
గ్రామ పెద్ద భండారీ మాట్లాడుతూ ‘కిలో పనీర్‌ను రూ.220 నుంచి పొరుగు గ్రామాల్లో రూ.240 వరకు అమ్ముతున్నారు. గ్రామాన్ని రహదారికి అనుసంధానించడం కూడా రాకపోకలకు సౌలభ్యం పెరిగింది. దీంతో మార్కెట్ సులువు అయ్యింద’ని వివరించారు. పనీర్ వ్యాపారం బాగా ఉండటంతో గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వలస వచ్చే యువకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉపాధి అవకాశాల కోసం ఇతర పెద్ద పట్టణాలకు వలస వెళ్లడం దాదాపుగా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం పుట్టి పెరిగిన ఊరిని వదలాల్సిన అవసరం లేనంతగా ఎదగాలంటే.. ఉన్నచోటనే అవకాశాల కల్పనకు కృషి జరగాలి. ఈ కోణంలో గ్రామీణ ప్రజానీకం దృష్టి పెడితే పల్లె ప్రగతి వేగవంతంగా సుసాధ్యం అవుతుంది.
చదవండి: మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా
చదవండి: 'స్విస్ టైమ్ బ్యాంక్' ఎంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment