పనీర్‌తో ఎన్ని రకాలు వండవచ్చో తెలుసా! అలాగే ఒక కేజీ పనీర్ తయారు కావాలంటే ఎన్ని పాలు కావాలో తెలుసా? పాలను విరగ్గొట్టి నీరు మొత్తం కారిపోయే వరకు బరువు పెట్టి ఎదురు చూసే సమయం ఎవరికీ ఉండడం లేదు. పైగా మనం ఇంట్లో తయారు చేసే పనీర్ మెషీన్‌లో చేసినట్లు క్యూబ్స్‌గా రావడం కష్టం. రెస్టారెంట్‌లో తిన్న పనీర్‌లాగ ముక్కలుగా ఉంటే తప్ప పిల్లలు ఇష్టపడరు. ఇంకేం చేస్తాం... రెడీమేడ్‌గా మార్కెట్‌లో దొరికే పనీర్ తెచ్చుకుని సింపుల్‌గా వండేస్తాం.
పనీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిన తర్వాత ఇటీవల పనీర్ వాడకం పెరిగింది. అయితే వాడకం పెరిగినంత వేగంగా పనీర్ తయారీ పెరుగుతోందా? పనీర్ లభ్యత పెరుగుతోంది కానీ సహజమైన పనీర్ తయారీ జరగడం లేదు. మార్కెట్‌లో దొరికే పనీర్‌లో అసలు కంటే నకిలీ ఎక్కువ.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇటీవల ఢిల్లీ– ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేసినప్పుడు 13వందల కిలోల నకిలీ పనీర్ దొరికింది. దొరికింది గోరంతే, నిజానికి నకలీ పనీర్ వ్యాపారం కొండంత జరుగుతోంది. మనం ఇంట్లో వండుకోవడానికి కొనుక్కున్న పనీర్ అసలుదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే పరీక్షించుకోవడానికి మూడు పద్ధతులను తెలియచేసింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.
పనీర్ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్ అయితే రంగు మారదు.
పనీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు.
ఇంత ప్రక్రియ లేకుండా వాసన ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను గుర్తించవచ్చు. కంపెనీ ప్యాకింగ్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముద్ర లేకుండా లూజ్‌గా అమ్ముతుంటారు. ఆ పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని వాసన చూడాలి. పాల వాసన వస్తే అది మంచి పనీర్. అప్పుడు రుచి చూడవచ్చు. మెత్తగా పాల రుచిని గుర్తు చేస్తుంటే కొనుక్కోవచ్చు. అలా కాక నమిలినప్పుడు రబ్బర్‌లాగ సాగుతుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు. అలాగే పాలతో చేసిన పనీర్ అయినా సరే పుల్లటి వాసన వస్తుంటే అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. దానిని కూడా కొనకూడదు.
నిర్ధారిత అధీకృత ముద్ర, కంపెనీ ప్యాకింగ్ ఉన్న పనీర్ కొనేటప్పుడు కూడా దాని కాల పరిమితిని సరి చూసుకోవాలి. ఎక్స్‌పైరీ డేట్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.
పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment