బాదం – బనానా పాన్‌కేక్స్
కావలసినవి: బాదం – పావు కప్పు (నాబెట్టి పైతొక్క తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ గుజ్జు – పావు కప్పు, మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, బియ్యప్పిండి – అర కప్పు చొప్పున, పంచదార – 8 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, చిక్కటి పాలు – 2 కప్పులు, గుడ్లు – 2, అరటిపండ్లు – 4 (రెండింటిని మెత్తగా గుజ్జు చేసుకుని, మరో రెండింటిని గుండ్రటి ముక్కల్లా కట్ చేసుకోవాలి), నూనె – సరిపడా, డ్రైఫ్రూట్స్ – గార్నిష్ కోసం..
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మొక్కజొన్న పిండి, గోధుమపిండి, బియ్యప్పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, బాదం పేస్ట్, అరటి పండు గుజ్జు, ఆపిల్ గుజ్జు, చిక్కటి పాలు, గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని రొట్టెల పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనంపైన నూనె వేసుకుని, పాన్‌కేక్స్ వేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు అరటిపండు ముక్కలు, డ్రైఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.
రైస్ పుడ్డింగ్
కావలసినవి: అరటి పండ్లు – 2 (నచ్చిన షేప్ కట్ చేసుకోవాలి), బెల్లం కోరు – 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, అన్నం – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – ఒక కప్పు, కొబ్బరి పాలు – 1 కప్పులు, చిక్కటి పాలు – 1 కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం – 5(గింజలు తొలగించి పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ – 1 (తొక్క తొలగించి, గుజ్జు చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ – అర టీ స్పూన్. ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్‌లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటి పండ్ల ముక్కలను కూడా అదే నేతిలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో బెల్లం, నీళ్లు, ఏలకుల పొడి వేసుకుని ముదురు పాకం పెట్టుకుని, అందులో అరటిపండు ముక్కలు వేసుకుని, పాకం పట్టించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద బౌల్ తీసుకుని.. స్టవ్ మీద పెట్టుకుని.. చిక్కటి పాలు, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొద్ది సేపటికి అన్నం, ఆపిల్ గుజ్జు, జాజికాయ పొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ దగ్గర పడేలా చెయ్యాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, ఖర్జూరం పేస్ట్, దాల్చిన చెక్కపొడి వేసుకుని దగ్గర పడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్‌కి తీసుకుని.. దానిపైన పాకం పట్టించిన అరటి ముక్కలు, నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి.
రొయ్యల పకోడా
కావలసినవి: రొయ్యలు – 25 (వ్యర్థాలు తొలగించి, శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించుకోవాలి), శనగపిండి – పావు కప్పు, బ్రెడ్ పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర – 1 టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా.. ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, నిమ్మరసం, అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి కాగానే.. ఒక్కో రొయ్యకు శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అభిరుచిని బట్టి రొయ్యలను మిక్సీ పట్టుకుని, ఆ మిశ్రమాన్ని, శనగపిండి మిశ్రమంలో కలిపి కూడా పకోడా వేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment