
సాక్షి, హైదరాబాద్: జాబితా ఏ కింద ఇప్పటికే 10 జిల్లాల్లో వంద శాతం గొర్రెల పంపిణీ పూర్తయిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. జీవాలకు వైద్యసేవలు అందించే పశు వైద్యశాలలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం రూ.12.50 కోట్లు కేటాయించిందని వివరించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జిల్లా పశు వైద్యాధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మందులు, దాణా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రతి వైద్యశాలలో మంచినీటి నల్లా కనెక్షన్ కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు దరఖాస్తు చేయాలని చెప్పారు. చనిపోయిన గొర్రెలకు ఈ నెలాఖరులోగా క్లెయిమ్‌లు పరిష్కరించాలని మంత్రి సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.