
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఒక విడత పూర్తయిన ఈ పథకం కింద రెండో విడత గొర్రెలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌఖికంగా వచి్చన ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు చడీచప్పుడు లేకుండా గొల్ల కుర్మలు కట్టిన డీడీలను పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్లకుర్మల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
గత నెలరోజులుగా..: ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెల రోజుల క్రితమే ప్రారంభమైందని, జిల్లాల వారీగా వరుసగా డీడీలు వెనక్కు ఇస్తున్నారని, కొన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల కిందటే ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మరో 3,37,816 మంది గొల్లకుర్మలకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, గత ఎన్నికల కంటే ముందు సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీసి గొర్రెలెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం అకస్మాత్తుగా డీడీలు వాపస్ చేస్తుండటం గమనార్హం.
ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ...
వాస్తవానికి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టోలో కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, 90 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ గొల్లకుర్మలు కట్టిన డీడీలను వారికి వెనక్కు ఇచ్చేస్తుండటం గమనార్హం. అయితే, మంత్రివర్గంలో ఎవరికీ కేటాయించకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోకే పశుసంవర్ధక శాఖ వస్తుంది.
నేరుగా సీఎం పర్యవేక్షణలోకి రావడంతో శాఖ కార్యకలాపాల గురించి ఆయనకు చెప్పేందుకు అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒక్కసారేనని, ఈ చర్చ తర్వాతే ఉన్నతాధికారులు కొందరిపై రేవంత్ చర్యలు తీసుకున్నారని అధికారులంటున్నారు. అయితే, డీడీలు వెనక్కు ఇవ్వాలని నిజంగానే రేవంత్ ఆదేశాలిచ్చారా లేక అధికారులే చొరవ తీసుకుని ఈ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో పథకం అమలులో అవినీతి జరిగితే ఈ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసి గొల్లకుర్మలకు మేలు చేయాలే కానీ ఏకంగా పథకాన్ని తీసేవిధంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. డీడీలు వెనక్కు ఇస్తున్న ప్రక్రియపై గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. డీడీలను వాపస్ చేయడాన్ని వెంటనే నిలిపివేసి అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment