సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతుందడానికి మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లి గ్రామమే నిదర్శనం. ఈ గ్రామానికి మొత్తం 34 యూనిట్లు మంజూరైతే రెండు రోజుల క్రితం 32 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. గొల్ల కురుమ సంఘం నేత బంధువులకు సంబంధించి రెండు యూనిట్లు గ్రామానికి రాకుండానే కాగితాలపైనే మంజూరు చూపిస్తుండటం గమనార్హం. ఇందులో పశుసంవర్ధకశాఖ అధికారుల పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు యూనిట్లే కాకుండా మంజూరైన మిగతా గొర్రెలను కూడా గ్రామం నుంచి తరలించినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసు పాలవుతుందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో అపహాస్యమవుతోంది. గొల్ల, కురుమల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం క్షేత్ర స్థాయిలో పక్కదారి పడుతోంది. అధికారులు, రాజకీయ నాయకులు, లబ్ధిదారులు ఒకటవ్వడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం లక్ష్యాన్ని చేరడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు నిఘా లేకపోవడం.. చెక్‌పోస్టులు ఉన్నా వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ దందా జోరుగా కొనసాగుతుంది.
సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెలను మరుసటి రోజే లబ్ధిదారులు అమ్ముకుంటున్న ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గొర్రెలు ఇచ్చింది అమ్ముకోవడానికా.. పెంచుకోవడానికా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా ‘మామూళ్ల’ మైకంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిఘా కొరవడంతో.. అటు చెక్‌పోస్టుల కంట పడకుండా పక్కా ప్లాన్‌తో మారుమూల గ్రామాల మీదుగా రాత్రి వేళల్లో సరిహద్దు దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఈ పథకం తీరు తెన్నులను సమీక్షించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
జోరుగా కమీషన్లు
గొర్రెల పథకం ఇటు దళారులు, అటు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. జిల్లాలో 528 యాదవ సంఘాల్లో 54,591 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. వీరిలో మొదటి విడతలో 27,075 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి గత ఏడాది నుంచి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో 22,197 మంది లబ్ధిదారులకు 4,66,137 గొర్రెలను పంపిణీ చేశారు. వీటిలో 20 శాతం కూడా లబ్ధిదారుల వద్ద లేవని యాదవ సంఘం సభ్యులే చెబుతుండడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో గొర్రెల కొనుగోలు కోసం రూ.277.46 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అధికారులు, దళారులు కలిసి 20శాతం చొప్పున కమీషన్ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఆదాయంలో అందరికీ స్థాయిని బట్టి వాటాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద ఎత్తున గొర్రెలు రీసైక్లింగ్ జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం పథకం తీరు తెన్నులను సమీక్షించడానికి సిద్ధపడడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలా తరలిస్తారంటే...
సబ్సిడీ గొర్రెలను దళారులు చాలా చాకచక్యంగా తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు కేంద్రానికి దూరంగా ఉంటే సబ్సిడీ గొర్రెల చెవులకు ఉన్న ట్యాగ్‌లను తొలగించి రాత్రి సమయంలో వాహనాల్లో గుర్తుపట్టకుండా సాధారణ గొర్రెల్లో కలిపి తరలిస్తున్నారు. ఇక దగ్గర్లో ఉంటే మేత కోసమని నడిపించుకుంటూ సరిహద్దు దాటగానే వాహనాలు ఎక్కించి తరలిస్తున్నారు. ఈలోగా ఎవరైనా గుర్తుపట్టి సబ్సిడీ గొర్రెలు తరలుతున్నాయని అధికారులకు సమాచారం ఇస్తే అప్పుడు ఇక్కడ మేత లేదు.. కాసే వారు లేరు.. మా బంధువుల ఇంటికి తోలుతున్నామని చెబుతుంటారు. గట్టిగా నిలదీస్తే ఎంతోకొంత ముట్టజెప్పి వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరు ప్రధాన రహదారుల్లో కాకుండా అధికారుల సూచన మేరకు మారుమూల గ్రామాల మీదుగా వెళ్తున్నారనే విమర్శలున్నాయి.
రాష్ట్రంలోనే తొలి కేసు ఇక్కడే...
సబ్సిడీ గొర్రెల పథకం అమలులో భాగంగా గొర్రెల రీసైక్లింగ్ చేసే విషయంలో 2017 సంవత్సరంలో జిల్లాలోని హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెలను అమ్ముకోవడంతో వారిపై అధికారులు కేసులు నమోదు చేసి డబ్బు రికవరీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే గొర్రెల రీ సైక్లింగ్ విషయం ఇదే తొలికేసు కావడం గమనార్హం. అదేవిధంగా ధన్వాడ మండలంలో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు... అధికారుల మామూళ్ల మత్తు కారణంగా రీసైక్లింగ్ వ్యవహారాన్ని మామూలుగా తీసుకుంటున్నారు. గ్రామాల్లో గొర్రెలను విక్రయిస్తున్నారని సమాచారం ఇచ్చినా పశుసంవర్ధకశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే విక్రయాలు జరగకపోయేవని స్థానికులు అంటున్నారు. ప్రారంభంలో పంపిణీ చేసిన గొర్రెలనే లబ్ధిదారులు అమ్ముకున్నట్లు తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఆంధ్రా, తమిళనాడు నుంచి కొనుగోలు
జిల్లాలోని పలు మండలాల లబ్ధిదారులకు గొర్రెలను అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేస్తున్న సమయంలోనే అక్కడి బేరగాళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిన వారు మాటముచ్చట పక్కా చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేసిన వెంటనే వారు యూనిట్లను కొనుగోలు చేసి మళ్లీ ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇలా క్రయ, విక్రయాలలో అధికారులకు స్థాయిని బట్టి వాటాలు కేటాయిస్తున్నారు.
పోలీసులదే బాధ్యత
జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. కానీ వాటిని అరికట్టేందుకు తగిన యంత్రాంగం మా వద్ద లేదు. పథకాన్ని అమలు చేయడం వరకు మాత్రమే మా బాధ్యత. గొర్రెలు సరిహద్దు దాటకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖది. గొర్రెలు రీసైక్లింగ్ జరగకుండా చూడాలని మేం ఇది వరకే పోలీసులకు సూచించాం. – దుర్గయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment