రెండో విడత ఏది..? | Telangana Govt Sheeps Second Phase Distribution | Sakshi
Sakshi News home page

రెండో విడత ఏది..?

Published Thu, Jun 6 2019 10:20 AM | Last Updated on Thu, Jun 6 2019 10:20 AM

Telangana Govt Sheeps Second Phase Distribution - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : ఆర్భాటంగా ప్రారంభించారు.. అద్భుతంగా ఉంటుందన్నారు.. ఆర్థికంగా పోరగమి స్తారని తెలిపారు.కాని క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో లోపాలు గొల్ల కురుమల పాలిట శాపాలుగా మారుతు న్నాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ ఇంతవరకూ జరుగలేదంటే అతిశయోక్తి కాదు.  గొల్ల, కురుమ, యా దవుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 237 గొర్రెల కాపర్ల సొసైటీలు ఉండగా అందులో 26,152 సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి విడతలో 13,111, రెండో విడతలో 13,052 మంది సభ్యులకు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జూన్‌ 20, 2017న జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. మొదటి విడతలో 13,111 మంజూరు కాగా 12,832 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటి వరకు 77 మందికే అందించారు.

గొర్రెల పంపిణీ ఇలా.. 
గొర్రెల కాపరుల సంఘాల్లో సభ్యులైన వారంతా ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. జిల్లాలో ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తున్నారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ1.25లక్షలు. ఇందులో 75 శాతం సబ్సిడీ అందజేస్తారు. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు తన వాటా కింద చెల్లిస్తున్నాడు. అంటే ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి సబ్సిడీ కింద 75 శాతం అనగా రూ.93,750 రాయితీ ఇస్తున్నారు. మిగతా 25శాతం రూ 31,250 లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి, కాపర్ల సంఘాల్లోని కొందరు సభ్యులతో ఓ కొనుగోలు కమిటీ ఉంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసువచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వీటికి ఉచితంగా ఇన్సూరెన్స్‌ చేయనున్నారు. ఇది కూడా డాక్టర్లే చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. గతంలో ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించేది.

రెండో విడతలో 77 మందికే అందజేత
రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటివరకు 77 మందికే అందించారు. అక్టోబర్, 2018న ప్రారంభమైన రెండో విడత ఇప్పటి వరకూ పుంజుకోలేదు. డీడీ కట్టేదుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా గొర్రెలు అందించే వారు కరువయ్యారు. మొదటి విడత ఏప్రిల్, 2018 నాటికి పూర్తికావల్సి ఉన్న నేటికి పూర్తి కాలేదు.

మాకు కూడా గొర్రెలు ఇయ్యాలే..
మాది చెన్నారావుపేట మం డల కేంద్రం. మా కురుమ సంఘంలో 105 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతగా మా సంఘంలో 53 మందికి ఇచ్చారు. రెండో విడత వెంటనే ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. గొర్రెలు తీసుకున్నవాళ్లు లాభపడ్డారు. మాకు గొర్రె లేదు.. ఏది లేదు. అడిగితే ఎన్నికల కోడ్‌ ఉన్నది. అయిపోయాక ఇస్తామని చెబుతున్నారు. కొందరికి ఇచ్చి కొందరికి ఆపడం ఏంది.. మాకూ కూడా సర్కారు తొందరగా ఇచ్చి ఆదుకోవాలి.   –చిట్టె మల్లయ్య, గొర్రెల కాపరి, చెన్నారావుపేట

రెండేళ్లయినా.. రెండో విడత లేదు..
మా ఊరిలో గొర్రెల పంపిణీ కోసం గ్రామ సభలు పెట్టి ముందస్తుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో సగం మందికి గొర్రెలు ఇచ్చారు. మిగతా సగం మంది లబ్ధిదారులకు ఏడాది లోపు సబ్సిడీ గొర్రెలు ఇస్తామన్నారు. కానీ రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని దాటవేస్తున్నారు. వెంటనే ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేయాలి. –పెద్దబోయిన రాజన్న, నల్లబెల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement