Second phase program
-
రెండో విడత ఏది..?
సాక్షి, వరంగల్ రూరల్ : ఆర్భాటంగా ప్రారంభించారు.. అద్భుతంగా ఉంటుందన్నారు.. ఆర్థికంగా పోరగమి స్తారని తెలిపారు.కాని క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో లోపాలు గొల్ల కురుమల పాలిట శాపాలుగా మారుతు న్నాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ ఇంతవరకూ జరుగలేదంటే అతిశయోక్తి కాదు. గొల్ల, కురుమ, యా దవుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 237 గొర్రెల కాపర్ల సొసైటీలు ఉండగా అందులో 26,152 సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి విడతలో 13,111, రెండో విడతలో 13,052 మంది సభ్యులకు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జూన్ 20, 2017న జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. మొదటి విడతలో 13,111 మంజూరు కాగా 12,832 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటి వరకు 77 మందికే అందించారు. గొర్రెల పంపిణీ ఇలా.. గొర్రెల కాపరుల సంఘాల్లో సభ్యులైన వారంతా ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. జిల్లాలో ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ1.25లక్షలు. ఇందులో 75 శాతం సబ్సిడీ అందజేస్తారు. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు తన వాటా కింద చెల్లిస్తున్నాడు. అంటే ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి సబ్సిడీ కింద 75 శాతం అనగా రూ.93,750 రాయితీ ఇస్తున్నారు. మిగతా 25శాతం రూ 31,250 లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి, కాపర్ల సంఘాల్లోని కొందరు సభ్యులతో ఓ కొనుగోలు కమిటీ ఉంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసువచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వీటికి ఉచితంగా ఇన్సూరెన్స్ చేయనున్నారు. ఇది కూడా డాక్టర్లే చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేది. రెండో విడతలో 77 మందికే అందజేత రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటివరకు 77 మందికే అందించారు. అక్టోబర్, 2018న ప్రారంభమైన రెండో విడత ఇప్పటి వరకూ పుంజుకోలేదు. డీడీ కట్టేదుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా గొర్రెలు అందించే వారు కరువయ్యారు. మొదటి విడత ఏప్రిల్, 2018 నాటికి పూర్తికావల్సి ఉన్న నేటికి పూర్తి కాలేదు. మాకు కూడా గొర్రెలు ఇయ్యాలే.. మాది చెన్నారావుపేట మం డల కేంద్రం. మా కురుమ సంఘంలో 105 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతగా మా సంఘంలో 53 మందికి ఇచ్చారు. రెండో విడత వెంటనే ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. గొర్రెలు తీసుకున్నవాళ్లు లాభపడ్డారు. మాకు గొర్రె లేదు.. ఏది లేదు. అడిగితే ఎన్నికల కోడ్ ఉన్నది. అయిపోయాక ఇస్తామని చెబుతున్నారు. కొందరికి ఇచ్చి కొందరికి ఆపడం ఏంది.. మాకూ కూడా సర్కారు తొందరగా ఇచ్చి ఆదుకోవాలి. –చిట్టె మల్లయ్య, గొర్రెల కాపరి, చెన్నారావుపేట రెండేళ్లయినా.. రెండో విడత లేదు.. మా ఊరిలో గొర్రెల పంపిణీ కోసం గ్రామ సభలు పెట్టి ముందస్తుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో సగం మందికి గొర్రెలు ఇచ్చారు. మిగతా సగం మంది లబ్ధిదారులకు ఏడాది లోపు సబ్సిడీ గొర్రెలు ఇస్తామన్నారు. కానీ రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని దాటవేస్తున్నారు. వెంటనే ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేయాలి. –పెద్దబోయిన రాజన్న, నల్లబెల్లి -
స్త్రీశక్తితోనే క్లీన్‌సిటీ
‘స్వచ్ఛ హైదరాబాద్’కు మహిళలు నడుం కట్టాలని సీఎం పిలుపు ♦ 19న స్వచ్ఛ కమిటీలతో సమావేశం, అభివృద్ధి పనులపై నిర్ణయం ♦ ఇకపై ప్రతి నెలా 17న కమిటీలతో సమీక్ష.. ఢిల్లీ తరహాలో చెత్త తరలింపు ♦ ఎంత ఖర్చయినా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కావాలంటే మహిళలదే కీలకపాత్ర అని, వారు ముందుంటేనే క్లీన్‌సిటీ సాకారమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని తాను ఇన్చార్జిగా ఉన్న బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్టలో స్థానికులతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లలను శుభ్రంగా తయారు చేసి స్కూళ్లకు పంపడం తెలిసిన అక్కాచెల్లెళ్ల వల్లనే క్లీన్‌సిటీ సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నేనొస్తున్నానని సున్నం వేసిండ్రు. అయినంత మాత్రాన కంపు పోతదా.. కడుపులోది బయటకు వచ్చేలా తిప్పుతోంది. ఎన్నేళ్లనుంచో ఉన్న ఈ దరిద్రం ఇప్పటికిప్పుడు పోదు. మనమిప్పుడు పనులు మొదలుపెట్టినం. ఏడాది, రెండేళ్లు పడుతుంది. అన్నం వండాలన్నా అరగంట.. కూరకు ఇంకో పావుగంట పడతది కదా’ అని కేసీఆర్ అన్నారు. గత నెలలో ఐదురోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ వల్ల స్వచ్ఛ కమిటీ బృందాలకు, ప్రభుత్వానికి సమస్యలపై అవగాహన వచ్చిందన్నారు. శుక్రవారం(19న) నిర్వహించే సమావేశంలో పనులపై పూర్తి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పారిశుధ్యం, పేదలకు ఇళ్లు, నాలాల ఆధునీకరణ తదితరమైన వాటిని అమలు చేసి చూపిస్తామన్నారు. చెత్త సమస్య పరిష్కారానికి ఢిల్లీ, నాగ్‌పూర్ నగరాల్లో అమలవుతున్న మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలను మున్సిపల్ అధికారులు అందజేస్తారని, వాటిని తీసుకుని వెళ్లేందుకు నెల రోజుల్లోగా 2,500 ఆటో ట్రాలీలను అందుబాటులోకి తెస్తామని సీఎం చెప్పారు. ఆ చెత్తను ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నట్లు వివరించారు. ఢిల్లీలో మాదిరిగా నిర్మాణ వ్యర్థాల నుంచి కంకర, ఇసుక తయారుచేసే ప్రాజెక్టులను చేపడతామన్నారు. ప్రతి నెలా 17వ తేదీన స్వచ్ఛ కమిటీల సమావేశం నిర్వహించి భవిష్యత్ పనులను ఖరారు చేస్తామన్నారు. నాలాలపై ఉన్న నివాసాలను తొలగించి వారికి మరో చోట డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. యూనివర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే కొందరు నానా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎకరానికి రూ. 5 కోట్లు వెచ్చించైనా పేదలకు ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు. చిలకలగూడలోని రైల్వే స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. నేడు వేములవాడకు కేసీఆర్ వేములవాడ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకున్న సీఎం అక్కడి తెలంగాణ భవన్లో బస చేశారు. గురువారం ఉదయం 10కి వేములవాడ వెళ్తారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట తదితర గ్రామాల్లో సీఎం రైతులతో మాట్లాడారు. కరీంనగర్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏపీ సీఎం చంద్రబాబు పని అరుుపోరుునట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం రాత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్యనేతలతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. బుధవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కేవలం తనను ఎలా ఇరికించాలన్న ఆలోచనలే చేశారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. చివరకు తన భాష మీద, తాను మాట్లాడిన అంశాలమీద వివాదం రేపాలని చూస్తున్నారని చెప్పినట్లు సమాచారం. -
విన్నపాలు వేనవేలు
- ‘స్వచ్ఛ హైదరాబాద్’ రెండో దశలో దరఖాస్తుల వెల్లువ - తొలివిడత సమస్యలు ఎక్కడివక్కడే - అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం - పరిష్కారానికి సీఎం, మంత్రుల హామీ సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ రెండో దశ కార్యక్రమంలోనూ అనేక చోట్ల పాత సమస్యలపైనే వినతులు వెల్లువెత్తాయి. అధ్వాన్న రహదారులు, పునరుద్ధరణకు నోచుకోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు, ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య సమస్యలు, వెలగని వీధి దీపాలు, కలుషిత జలాలు, మురుగు సమస్యలపైనే మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు అందాయి. పార్శిగుట్టలో సీఎం కేసీఆర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నోడల్ ఠమొదటిపేజీ తరువాయి అధికారులు పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత నెలలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ మొదటి దశ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులను ఆరా తీశారు. తొలివిడత వినతులు ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కంగుతిన్న అధికారులు, మంత్రులు వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత సాగిందిలా... - ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో గవర్నర్ నరసింహన్ స్థానికులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై రాజీ పడవద్దని సూచించారు. - సోమాజిగూడలోని బీఎస్ మక్తాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పర్యటించారు. స్థానికంగా చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పైప్లైన్ల మరమ్మతులకు రూ.25 లక్షలు, రహదారులకు రూ.25 లక్షలు కేటాయిస్తున్నామన్నారు. - ఎల్బీనగర్ నియోజకవర్గం... మన్సూరాబాద్ డివిజన్ 328 యూనిట్ చంద్రపురి కాలనీలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి యూనిట్‌కు 15 మందితో కూడిన పౌర కమిటీలను నియమించారు. - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆజంపుర డివిజన్లోని మార్కస్లో పర్యటించారు. స్థానికంగా ఉంటున్న 110 కుటుంబాలకు రెండు గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్లో పర్యటించారు. మూసీ నదిలో పడి చనిపోయిన చిన్నారి కుటుంబీకులను పరామర్శించారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు, నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. - అక్కడినుంచి మూసీ పరీవాహక ప్రాంతానికి వెళ్లి... కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారు. నాలా చుట్టూ రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్బర్‌బాగ్ డివిజన్ పల్టాన్లో పర్యటించారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. - బంజారాహిల్స్ రోడ్ నెం.12లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఎన్బీటీ నగర్, ఎన్బీ నగర్ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో ఇప్పటి వరకు జరిగిన, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. - వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్‌మారేడ్‌పల్లిలో పర్యటించారు. స్థానికులు మురుగు సమస్యలు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేయగా... వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. - అబిడ్స్‌లోని మురళీధర్‌బాగ్, కట్టెలమండి ప్రాంతాల్లో ైవె ద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. మురళీధర్‌బాగ్‌లో పేద ప్రజలకు త్వరలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గోషా మహల్ నియోజకవర్గంలో తొలివిడత కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. పనులు చేపట్టాలని ఆదేశించారు. - కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. నాలా అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనిటీ హాలులో రెండోఅంతస్తు నిర్మాణం చేపట్టాలని, కలుషిత జలాల సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. - బాలానగర్‌లో ఏడు బస్తీల అసోసియేషన్లు స్వచ్ఛ హైదరాబాద్‌పై సమావేశమయ్యాయి. పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. అక్రమంగా వెలసిన చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాయి. - ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ నగర్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్థానికంగా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, నీటి శుద్ధి కేంద్రాలను బాగు చేయించాలని ప్రజలు కోరగా.. ఆమేరకు పనులు చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. - అంబర్పేట్ నియోజకవర్గంలో 210 మందికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. అంబర్‌పేట అభివృద్ధికి రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. మోయిన్ చెరువును మిషన్ కాకతీయలో చేర్చి శుద్ధి చేయించేందుకు అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఇదిలా ఉండగా... ‘గతంలో ఇచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు పరిష్కరించ లేదు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వీధుల్లో పర్యటిస్తున్నారు?’ అంటూ జైస్వాల్ గార్డెన్ వాసులు అధికారులను నిలదీయడం గమనార్హం. - ఉప్పల్‌లో మౌలిక సదుపాయాలకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు డిఫ్యూటీ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. - రామంతాపూర్ టీవీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గణేశ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో స్థానికులు అధికారులను నిలదీశారు. - అల్వాల్‌లో ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత కోసం అధికారులు, స్థానికుల ఫోన్ నెంబర్లతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. - మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు కేవలం సమావేశాలకే పరిమితం కావడం, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పర్యటించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. - అమీర్‌పేట ప్రాంతంలో హోం శాఖ కార్యద ర్శి వెంకటేశం పర్యటించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హమీలు ఎంతవరకు నెరవేరాయన్న దానిపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. - బల్కంపేట్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ మున్సిపల్ పార్కును మెంటార్ ప్రభాకర్ సందర్శించారు. సమస్యల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్నవి పరిష్కారమయ్యాయని, నిధులు కేటాయించాల్సినవాటి విషయంలో జాప్యం జరుగుతోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం సాక్షి,సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం బుధవారం జీహెచ్ఎంసీలోని 400 యూనిట్లలో విజయవంతమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పార్శిగుట్టలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బీఎస్‌మక్తాలో స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్యాట్రన్లుగా ఉన్న 35 యూనిట్లకుగాను 23 మంది హాజరయ్యారన్నారు. 400 మంది మెంటార్లు ఉండగా... 361 మంది పాల్గొన్నట్టు తెలిపారు. 400 మంది నోడల్ అధికారులు, 2595 స్వచ్ఛ యూనిట్ అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు.